చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మరియు మనలో పదేళ్లలో ఎంత మార్పు !?

Posted by తెలుగు'వాడి'ని on Thursday, November 29, 2007

కాలచక్రంలో పదేళ్లు గిర్రున తిరిగిపోయాయి. పాలక ప్రతిపక్షాల స్థానాలు మారాయి ... హైదరాబాద్, బెంగుళూరు మొదలగు సిటీల నుండి మనం అమెరికాకు వచ్చిపడ్డాము .. రూపాయి స్థానంలో డాలర్ కనపడటం మొదలెట్టింది...కానీ మారనిది, ఆరేడు (మూకుమ్మడిగా లేక బయటకు తెలిసింది) సంవత్సరాల క్రితం మొదలైన రైతుల కష్టాలు, ఆత్మహత్యలు మరియు వారి జీవన స్థితిగతులు...మారని ఆ రైతుని చూసి ఒక రైతుబిడ్డగా ఆవేదనతో ఎందుకో ఈ పదేళ్లను మననం చేసుకోవాలి అనిపించిన నా ఆలోచనకు అక్షరరూపం.

ఆనాడు :

మనకు ఈ బిల్లు(క్లింటన్, గేట్స్)లు మాత్రమే చాలన్నావు .. అదే అభివృధ్ధిపధమని ఊదరగొట్టేశావు మా తండ్రులకు....

ఆ పిచ్చి మా తండ్రులేమో ఇద్దరు బిల్లులలో ఒక్కరైనా తన రెండు బిల్లు(విద్యుత్తు, అప్పు)లలో ఏ ఒక్కటైనా తీరుస్తారేమో, చిల్లులు పడిన తన భార్యాపిల్లల గుడ్డలకైనా అతుకులు వేస్తారేమో, కాలే కడుపులకింత గంజైనా పోస్తారేమో అని ఎదురుచూస్తూ ....

మీకు ఈ బిల్లు(క్లింటన్, గేట్స్)లు కాదు, అసలు ఏ బిల్లులు లేకుండా చేస్తాను ... అంతా ఉచితమే అని అడుగడుక్కీ చెప్పావు....అంతా మన చేతుల్లో ఉందని అన్నావు ...

పిచ్చిగా నమ్మారు నీ ఉచితాన్ని, పాదయాత్రను, చెప్పిన ఇందిరమ్మ రాజ్యాన్ని, తెగిపోయిందన్న ఆవేశపు నరాన్ని, చలించిపోతుందన్న నీ మనస్తత్వాన్ని...అందుకే అందించారు జీవితంలో ఒక చివరి అవకాశాన్ని

ఈనాడు :

పేదలకు, రైతులకు సంస్కరణ ఫలాలు అందాలంటున్నావు ... అందుకే ఒకప్పుడు హైటెక్కు బాట పట్టావనీ, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయనీ అంటున్నావు

అదే పిచ్చి పేదలు, రైతులేమో తినటానికి ఒక ఫలమిచ్చిన చాలు ... పండించిన పంటకు సరైన ధర ఇచ్చిన చాలు ... భార్యల పుస్తెలకు నూరేళ్ల గారంటీ కనిపించిన చాలని ... నీ వెంబడి పరుగులు తీస్తూ.......

అయినదానికీ కానిదానికీ ఆ తొమ్మిదేళ్ల పాలనతోనే పోలుస్తున్నావు .... వాళ్లు ఇంతకన్నా ఏమి పీకారు అని ఎదురు చెపుతున్నావు ... గట్టిగా అడిగితే బూతుల చిట్టా విప్పుతున్నావు

కానీ ఇచ్చిన వాగ్ధానం ఒక్కటి మాత్రం నిజంచేసి చూపిస్తున్నావు .... అదే దోచుకోవటమన్నది,కాల్చి చంపటమన్నది,పచ్చని పంటలు పరిశ్రమలకు పంచటమన్నది పూర్తిగా ఉచితంగానే కానిస్తున్నావు ...

మరి వచ్చిన లేదా మనకు కనిపించే మార్పేమిటంటారా .....


మన రాష్ట్రంలో :


పాలక-ప్రతిపక్షాల స్థానాలు మరాయి..చంద్రయ్య బదులు రాజయ్య వచ్చాడు

మారింది స్థానాలు, మనుషులే..అంతరంగాలు ఒకటే..అందినకాడికి సంపాదించటం..అయినవాడికి అప్పనంగా దోచిపెట్టటం

విధానాలు అవే ..ఆచరణకూడా అదే .. కానీ చెప్పే భాషలోనే తేడా అంతే

బాబు గారేమో : మనం ముందుకు పోతున్నాము అని తెలియజేసేవారు
రాజు గారేమో : ముందుకు పోయి చేసేదేమీ లేదని తెలియజేస్తున్నారు

మన కుటుంబాలలో :

మన 'ఆ' బాబు .. ఈ 'మన' బాబులో(గా) క(అ)నిపిస్తున్నాడు
మన 'ఆ' అమ్మ .. ఈ 'మన' అమ్మాయిలో(గా) క(అ)నిపిస్తుంది

ఆనాడు ....


నెత్తిమీద తెల్ల కండువా తో మన నాన్నోడు ....

అడిగాడు నన్ను లాప్-టాప్ ల లాజిక్కు, హైటెక్కుల జిమ్మిక్కు గురించి
అర్ధంకాకున్నా ఆదరించారు నిన్ను మరో అయిదేళ్లు ...

ఎండకన్నెరుగకగ పెరిగినా,కూలీనాలీకి వెళ్లకపోతే జరుగదని తెలుసుకున్న మన అమ్మ

ఒంటిమీద తెల్లబట్టలు నెత్తికి కండువా చూసారు నీ మీద, ...
చూసుకున్నారు నీలో మరో రైతన్నను అందుకే అందించారు ఊహించని అఖండ విజయాన్ని

ఈనాడు ....

నడ్డిమీద నల్ల జీన్స్ ఫ్యాంట్ తో మన చంటోడు ...

అడిగాడు నన్ను రైతంటే ఎవరని, వరి అంటే ఏమిటని
రాజు, బాబుల గెలుపోటముల చిరు రహస్యమేమిటని ...

అంధ్రప్రదేశ్ ని చూసి రాత్రికి రాత్రే ధనవంతులవ్వచ్చు అనుకునే మన అమ్మాయి

సంపాదించటమింత తేలికని కనిపిస్తుంటే .. ఎందుకునాన్నా మనకేమీ ఆస్తులు లేవనీ, ఎందుకొచ్చాము ఈ దేశమనీ

చూపులతోనే ప్రశ్నిస్తుంటే ఇది నా చేతకానితనమా అని ... వలస వచ్చినది నా అసమర్ధతవలనా అని

అప్పుడైనా ఇప్పుడైనా ... తెల్ల మొహం వేయటమే మాకు తెలిసింది....

కష్టమైన ప్రశ్నలు కావవి కానీ సరళంగా సమాధానం చెప్పలేని బేలతనమది

నూరేళ్ల అనుభవసారం ఒక వైపు ... నూరేళ్ల జీవిత భవితవ్యం మరొక వైపు

నడుమన నన్ను వుంచి సంధించిన ప్రశ్న ఒక్కటే...నమ్మవలసిందెవరినని :
హైటెక్కు బాట పట్టిన బాబునా .... రైతన్న పాట పాడుతున్న బాబునా...
రైతన్ననని చెప్పిన రాజునా ... దోపిడీని మౌనంగా చూస్తున్న రాజునా

ఒక్కటి మాత్రం నిజం ... నాకు అర్ధమైన పచ్చి నిజం ....

కొడుకుగా ఆనాడు ... తండ్రిగా ఈనాడు ... ఏ బాబు(అమ్మ(యి))కి గూడా అర్ధమయ్యే రీతిలో సమాధానం చెప్పలేని నిస్సహాయుడనని

మారనిదేమో ఛిద్రమైన రైతు కుటుంబాల జీవన స్థితిగతులు మరియు నిరుపేదల బతుకు వెతలు అనీ

అందుకే ఓ చంద్రయ్య, రాజయ్యలూ ...

ఎందుకు మా మీద ఇంత కోపం .. ఎందుకు మా జీవితంతో ఆడుకోవటం
వదిలెయ్యండయ్యా మా తరాన్ని ... ఆడుకోకండయ్యా మా తలరాతల్ని

పశ్చాత్తాపానికి మించిన ప్రాయాశ్చిత్తం లేకపోవచ్చు ...
అలాగే ఫలానా సమయంలోపలే పశ్చాత్తాపం కలగాలన్న నియమం ఉండకపోవచ్చు

క్షమాగుణం అనేదొకటుందని మాకందరికీ గుర్తుండి ఉండవచ్చు
అలాగే క్షమించటం అన్నది మన రక్తంలో, సంస్కృతిలో భాగమై ఉన్నదని మాకు తెలిసుండవచ్చు

పశ్చాత్తాపం మీద నమ్మకం పోయేటట్టుంది మీ ఈ కొత్త మాటలను వింటుంటే
క్షమాగుణం అనేది ఉన్నదని మరచిపోవాలనిపిస్తుంది .... మీ ఈ సరికొత్త రూపాన్ని(పాలన) చూస్తుంటే

రైతు ఆత్మహత్యలకు ఒక్క చంద్రబాబు మాత్రమే కారణం కాకపోవచ్చు కానీ, వ్యవసాయం అనే ప్రయోగంలో 'లాభసాటికాదేమో, శాస్త్రీయ పధ్ధతులు అవలంబించాలేమో, Mktg & Distribution వ్యవస్థను సరిచేయాలేమో' అనే పెద్ద ఉత్ప్రేరకాలకు 'చంద్రబాబు హైటెక్కు, రైతుల వ్యతిరేక విధానాలు' అనే ఒక అతి పెద్ద ఉత్ప్రేరకం తీక్షణంగా పనిచేయగా వచ్చిన వ్యతిరేక ఫలితమే రైతు ఆత్మహత్యలన్నది నా అభిప్రాయం.

ఇరువదిఅయిదు సంవత్సరాల రాజకీయ జీవితంలో (అతి కొద్దికాలం తప్పించి) ఎలాంటి అధికార పదవినీ అధిష్టించక, తన జీవిత పరమపద సోపాన పటంలో ఎక్కిన ఒకే నిచ్చెన ఏకంగా చివర గడిలోకి చేర్చిననూ, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికీ రాని అవకాశం (అంటే పీఠాన్ని అధిష్టించేటప్పుడే అయిదు సంవత్సరాలు ఖచ్చితంగా ఉండితీరుతారు) చేజిక్కుంచుకుని కూడా(ఇప్పటిదాక చెప్పిన కారణలన్నిటి చేత నాకు ఎందుకో రాజశేఖరరెడ్డి గారి మీద అపరితమైన నమ్మకం ఉండేది ఒక మనీషిగా మిలిగిపోవటానికి , మన రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించటానికి, పేద-బడుగు-రైతు ల బతుకులలో వెలుగులు కురియించి ఓ ఆరాధ్యదైవంగా మిగిలిపోవటానికి నిత్యకృషీవళుడై ఈ పదవి-అధిక్కారాన్ని ఒక తపస్సుగా భావించి చేసితీరుతాడు అని) 'అవినీతి, లంచగొండితనం, ఆశ్రితపక్షపాతం, నిర్లక్ష్యపు పాలన' అనే సరికొత్త ఉత్ప్రేరకంగా మారుటచే ఆ రైతు ఆత్మహత్యలే ఇంకా కొనసాగటానికి కారణమని నా అభిప్రాయం...

అదే ఫలితం ... నిండునూరేళ్ల జీవితం వారి చేతుల్లో పెట్టే రైతన్నల లలాట లిఖితం ... కనుచూపు మేరనైనా కనిపించని సహాయ ప్రయత్నాలు..

అందువలన

గతించిన వారెందరో.....గతిలేక దినసరి కూలీలుగా మారినదెందరో.... పస్తులున్నదెందరొ ... పుస్తెలమ్మిన దెందరో .. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భూములను అమ్ముకున్నదెందరో .. ప్రాణమున్న జీవఛ్ఛవాలుగా బ్రతుకు బండినీడుస్తున్నదెందరో ..మా తండ్రుల ప్రాణమే ఈ భూమనీ ... ఈ వ్యవసాయమే మాకు వారసత్వమనీ గర్వంగా చెప్పలేని, చెప్పుకోలేని స్థాయికి దిగజార్చావు, అదే వ్యవసాయాన్ని అపహాస్యం చేశావు.

అవకాశాలు వెదుక్కుంటూనో, అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనో, చితికిపో(వుచున్న)యిన మా కుటుంబాలను కాపాడుకోవటానికో, వ్యవసాయం వంటబట్టకనో(వంటబట్టించుకోవటం ఇష్టంలేకనో) .... పుట్టిపెరిగిన ప్రాంతాన్ని వదిలి వచ్చి అంతో ఇంతో సంపాదించుకున్నందుకు, మా రైతులను, రైతు కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగానే తెలుసు.

ఈ సమస్యకు పరిష్కారపు దిశగా, ప్రోదిచేసుకున్న నా ఆలోచనలు : ఓ రైతుబిడ్డగా నా అంతఃసంఘర్షణకు ప్రతిరూపంగా తదుపరి కార్యాచరణగా ...

ప్రత్యామ్నాయం లేకనో........మా క్షమాగుణ(18 నెలల్లో మీ విషయంలో ఇది అనేది ఉందని మర్చిపోవటానికి పూర్తిగా కృషి చేస్తాము) సంపత్తిచేతనో....లేక మా ఖర్మ సంపూర్తిగా కాలితేనో... మరలా మీరు అదికారంలోకి వస్తే ...

నిజమైన పశ్చాత్తాపమంటే ఏమిటో తద్వారా ఈ రైతన్నలకు ప్రాయాశ్చిత్తంగా చేయగలిగేది సంపూర్తిగా చేసి చూపించండి....

మనిషిగా పుట్టడం దేముడిచ్చిన వరం.
మనిషిగా పెంచ(బడ)డం మీ తల్లిదండ్రుల సంస్కార, బాధ్యతల, పుణ్య ఫలం.
మనిషిగా ఎదగటానికి మీరు నేర్చుకున్న చదువు,మిత్రుల వల్ల వచ్చిన అవకాశం.
మనిషిగా నిలబడటానికి, సాటి మనిషికి సాయంచేయటానికి అన్న(అమ్మ)గారు మీకు అందించిన ఆశీర్వాదఫలితం.

మనీషిగా నిలిచిపోవటానికి ఇచ్చిన 9(3.5)సంవత్సరాల అవకాశాన్ని వ్యర్ధం చేసుకోవటం పేద, బడుగు, రైతుల పరంగా క్షమించరాని నేరం....

ఒక మనిషిగా మిగిలి పోతారో ... మనీషిగా మారిపోతారో ... మీ చేతుల్లో ఉంది ... అది చేతల్లో చూపించండి....



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు : ,

రైతుల ఆత్మహత్యలపై నా అంతఃసంఘర్షణ, తదుపరి కార్యాచరణ ప్రణాళిక - ఓ రైతుబిడ్డగా

ఇప్పటి వరకు పాలకుల, ప్రభుత్వాల, అధికారుల నిర్లక్ష్య, నిర్లజ్జ రైతు వ్యతిరేక విధానాల ఫలితం ... నిండునూరేళ్ల జీవితం వారి చేతుల్లో పెట్టిన రైతన్నల లలాటలిఖితం ... కనుచూపు మేరనైనా కనిపించని సహాయ ప్రయత్నాలు

అందువలన

గతించిన వారెందరో.....గతిలేక దినసరి కూలీలుగా మారినదెందరో....పస్తులున్నదెందరో ... పుస్తెలమ్మిన దెందరో... ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భూములను అమ్ముకున్నదెందరో .. ప్రాణమున్న జీవఛ్ఛవాలుగా బ్రతుకు బండినీడుస్తున్నదెందరో ... మమ్ములను మా తండ్రుల ప్రాణమే ఈ భూమనీ ... ఈ వ్యవసాయమే మాకు వారసత్వమనీ గర్వంగా చెప్పలేని, చెప్పుకోలేని (ఇక్కడ కారణలు అప్రస్తుతం మరియు అందరూ ఇలాకాక పోయుండచ్చు) స్థాయికి దిగజార్చారు, అదే వ్యవసాయాన్ని అపహాస్యం చేశారు.

ఇందుకు దారితీసిన పరిస్థితులు, నాయకులు, విధానాలు మొదలగువారి(టి) గురించి మనకందరికీ సంపూర్తి అవగాహన ఉంది....కాకపోతే అవే విషయాలను మరొక మారు పునఃశ్చరణ చేసుకోవాలి అనుకుంటే వీటిని మీరు నేను ప్రచురించిన నా మరొక బ్లాగ్ పోస్ట్: బాబు, రాజు మరియు మనలో ... పదేళ్లలో ఎంత మార్పు !? లో చూడొచ్చు.

అవకాశాలు వెదుక్కుంటూనో, అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనో, చితికిపో(వుచున్న)యిన మా కుటుంబాలను కాపాడుకోవటానికో, వ్యవసాయం వంటబట్టకనో(వంటబట్టించుకోవటం ఇష్టంలేకనో) .... పుట్టిపెరిగిన ప్రాంతాన్ని వదిలివచ్చి అంతో ఇంతో సంపాదించుకున్నందుకు, మా రైతులను, రైతుకుటుంబాలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగానే తెలుసు.

ఈ సమస్యకు పరిష్కారపు దిశగా, ఓ రైతుబిడ్డగా నా అంతఃసంఘర్షణకు ప్రతిరూపంగా తదుపరి కార్యాచరణగా ప్రోదిచేసుకున్న నా ఆలోచనలు ఇక్కడ :

ఈ చిన్ని ప్రయత్నానికి మరికొన్ని చేతులు కలిసి, ఆలోచనలు జోడించి, చేతలలోకి మార్చుకునే సమయం వచ్చి అందుకు మనం అవకాశం కలిగించుకోగలిగితే అదే పదివేలు.

స్పందించటానికి రైతు కుటుంబ నేపధ్యం నుంచే రానక్కరలేదు .... చదివిన, తెలుసుకున్న, విన్న, చూసిన వాటినుంచైనా స్పందించగలిగిన మనస్సుంటే చాలు.

సహాయం అనేది ప్రతి సారీ, అందరూ డబ్బుల రూపంలో చూడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కొకసారి వెలకట్టలేని అలోచనలు, ఆచరణలో పాలుపంచుకోవటం కూడా సహాయపు జాబితాలోకే వస్తాయి కనుక.


ఒక్కొకరు ఒకేసారి వెయ్యో, రెండు వేలో డాలర్స్ ఇవ్వటానికో లేక మధ్య మధ్యలో తోచినప్పుడు ఒక అయిదారువందల డాలర్స్ ఇస్తూ ఉండటమో చేయటానికి ఇష్టపడతారు .... కనుక అందరూ అలాగే ఉండవలసిన అవసరం లేదు కనుక నా అభిప్రాయం ప్రకారం ఏదైనా చిన్నదిగా, తక్కువ మొత్తంగా మొదలెడితే అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటే మంచిదని ... అంటే ప్రతి నెలా ఒక పదో, ఇరవయ్యో డాలర్స్ ఇవ్వగలిగితే అది ఒక అధ్బుతమైన ప్రారంభం అనిపిస్తుంది.

మనం ఆ పది, ఇరవై డాలర్స్ ను విడివిడిగా చూస్తే శిఖర సమానమైన సమస్యకు ఇది పరిష్కారమా అనిపించవచ్చు ....కానీ ఒక వంద, రెండువందల మందిమి ఒకే సారి కలిస్తే .. అవే వెయ్యో, రెండు వేలో డాలర్స్ అవుతాయి ...

వీటితో కనీసం ఒకటో, రెండో కుటుంబాల సమస్యను సంపూర్తిగా పరిష్కారించలేక పోవచ్చు .. అలాగే వాళ్ల అప్పులు తీర్చడంతోనే సమస్య పరిష్కారం అయిపోయినట్టు కూడా కాదు .. కాకపోతే బ్రతికించటం కన్నా, మరొక జీవనోపాధి చూపించటం కన్నా ముందు ఒక బ్రతుకు కడతేరకుండా చేయ గలిగితే తదుపరి అలోచించవచ్చు.

వందల మిలియన్ డాలర్స్ తో తీసే ఇంగ్లీష్ సినిమాను తొమ్మిది డాలర్స్ లోపే చూడొచ్చు కాకపోతే మూడు నుంచి అయిదో, ఆరో మిలియన్ డాలర్స్ తో తీసే తెలుగు సినిమా మాత్రం పది నుంచి పదమూడు నుంచి పదిహేను నుంచి పదహారు దాకా పెంచినా కూడా చూస్తూనే ఉన్నాము ... కొంతమంది ఈ తెలుగు సినిమాలు చూడటానికి 40-60 మైళ్లు కూడా డ్రైవ్ చేసుకొని వెళ్లి చూస్తున్నారు ...దీనికి రావటనికి పోవటానికి ఒక $6-7 .... మనలో చాలా మంది సినిమాకు ముందో తరువాతో ఖచ్చితంగా లంచ్ కో, డిన్నర్ కో వెళ్లటం అక్కడ ఒక $10-20 ...

అలాగే మొదటలో ఇష్టమున్నా లేకపోయినా ఈ దేశంలో టిప్స్ ఇవ్వటం అనేది ఒక విధంగా కంపల్సరీ అని మొదలెట్టి ఇప్పుడు మెల్లమెల్లగా అలవాటు పడి నెలకు ఒక $10-20 దాకా ఇస్తూనే ఉన్నాము

నా ఉద్దేశ్యం మనం ఇవన్నీ మానుకోవాలని చెప్పటం కాదు సుమా ... మన దైనందిన జీవితాలలో ఒక భాగమై కూర్చున్న ఇలాంటి ఖర్చులన్నింటికీ మనం ఎంత ఖర్చు పెడుతున్నామో ... వాటితో పాటుగా మరో $10-20 ఇంకొక ఖర్చుగా అనుకోగలిగితే మీరు చేసే ఈ సహాయం మరికొంత మందితో కలిసి నెలకు ఒకటో రెండో కుటుంబాలనైనా ఆత్మహత్యల బారి నుంచి కాపాడవచ్చు.

ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అండి :
ఇండియాలో జీతాలు, వాళ్ల ఖర్చుల గురించి(I.T కి సంబందించినంతవరకు అయితే ఓకే) నాకు అంత బాగా అవగాహన లేదు మరియు అరకొర సమాచారంతో మాట్లాడేకన్నా మాట్లాడకపోవటమే మంచిది అనే ఉద్దేశ్యంతో ... కనుక ఇక్కడ నేను అంత వివరంగా ఆయా ఖర్చుల జోలికి వెళ్లలేదు(కనుక దయచేసి అన్యధా భావించవద్దు..అలాగే మిగతా దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా).

ఇంతమంది బ్లాగ్మితృలలో, పెద్దవాళ్లలో ఎవరైనా ముందుకు వచ్చి దీనిని ఒక ఫౌండేషన్ గా రూపుదిద్దుటకు కృషి చేయగలగటానికి తప్పక ముందుకు వస్తారని ఆశ, ఆకాంక్ష........లేదంటే ఇప్పటికే ఉన్న ఏదో ఒక ఫౌండేషన్ తో మనం ఒక టై-అప్ పెట్టుకోని మనం ఇచ్చే ఈ డబ్బుని రైతు కుటుంబాల జీవన స్థితిగతులను మార్చుటకు ఉపయోగించవలసిందిగా కోరవచ్చు. మీకు ఇలాంటి ఫౌండేషన్స్ గురించి తెలిసి ఉంటే దయచేసి కొంత సమయం చూసుకొని పూర్తి వివరాలను ఇక్కడ తెలియజేయండి ... కనీసం ఒక్కొకరిగానైనా మనం మన వంతు సహాయం అందిద్దాం.

మన రక్త సంబంధీకులు, బంధు మిత్ర హిత సన్నిహితుల నుంచి లేదా మనకు బాగా తెలిసిన వాళ్ల నుంచి ఏయే కుటుంబాల వారు ఆత్మహత్యా రేఖకు దగ్గరలో ఉన్నారో, పూర్తిగా అప్పులలో మునిగి ఉన్నారో లేక తమ కొడుకు-కూతుళ్ల చదువుకు, కుటుంబంలో ఆరొగ్యానికి డబ్బు కట్టలేని స్థితిలో ఉన్నారో మొదలగు కారణాలున్న వారి వివరాలు సేకరించి వారందరికీ సాధ్యమైనంతవరకు సహాయం చేయటానికి ప్రయత్నించవచ్చు. మనకు వచ్చే వందలాది/వేలాది అప్లికేషన్స్ లో నుంచి మనం ముందు ఎవరికి సహాయం చేయాలి అన్న దానికి మనం కొంత క్రైటీరియా ఏర్పరచవచ్చు (దీనికి ఇంకా కొంత అలోచనామధనం జరుగవలసిన అవసరం ఉంది ... నిదానంగా అలోచిద్దాం మరి)

మన అభిప్రాయాలను పంచుకొందాం ... మార్పులు చేర్పులు చేసుకుందాం ... మొదలెడదాం మరొక మహాప్రస్థానం ...

ఆరేడు సంవత్సరాల క్రితం మొదలైన ఈ ఆత్మహత్యల పర్వం ఇప్పటికి కూడా ఆగలేదు .. మనకందరికీ తెలుసు ఇకముందు కూడా ఉంటాయని ... అందుకే చేయి-చేయి కలుపుదాం..రూపాయికి రూపాయ్(డాలర్ కి డాలర్) జతచేద్దాం ... నెలకొక ఆత్మహత్యనైనా ఆపుదాం....



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు : ,

ఫైళ్లు చదవకుండా సంతకాలు చేయనన్న వై.యస్.ఆర్ !?

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, November 28, 2007

ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ వార్త ఫైళ్లు చదవకుండా సంతకాలు చేయనన్న వై.యస్.ఆర్ చూడగానే ఒక్కసారిగా నా మోములో సందేహం, ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు వచ్చింది....

ఎందుకంటే....వై.యస్.ఆర్ గారు

    ఇలా ఎప్పటి నుంచి డిసైడ్ అయ్యారా అని ఆశ్చర్యం !,

మరియు

    కొత్తగా ఇలా కూడా(ఎందుకు) చేస్తున్నారా అని సందేహం ?

రాజు గారు ఏమి చేసినా అంతా మన మంచికేలే ...

ఏమిటో ...

     సాయంత్రం అయ్యినది (ఇండియాలో పొద్దున) మొదలు అన్నీ ఇలాంటి సంచలన వార్తలే ....

ఏది ఏమైనా ...

ఈ సాయంసమయం(ఇండియాలో ఉషోదయం) చిరునవ్వుతో మొదలయ్యింది
        నాకు మరొక టపా ప్రచురించే ఒక చిన్న అవకాశం కల్పించింది

అందుకే వై.యస్.ఆర్ గారికి కృతజ్ఞతలు .....



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు : ,

సినిమాలు, సన్నివేశాలు, డైలాగులు మొదలగునవి కాపీ కొట్టటం ఎంతవరకు సమంజసం !?

Posted by తెలుగు'వాడి'ని on Saturday, November 24, 2007

చాలా రోజుల క్రితం ఈ పోస్ట్ మొదలు పెట్టి కొంత రాసిన తరువాత, మధ్యలో నా ఖర్మకాలి చూసిన మహేష్ అతిధి సినిమా దెబ్బకు మరియు నవీన్ గార్ల గారి సలహా మీదట సినిమా వీక్షణానికి కొంత విరామం ప్రకటించటంతో ఇది పూర్తిగా అటకెక్కేసింది. ఈ మధ్యలో ఉచితమే కదా అని కొంత, ఇంట్లోనే కదా (సైడ్ ఎఫెక్ట్స్ తో రోడ్ల మీద లేక డ్రైవ్ చేసేటప్పుడు వెర్రివేషాలు, తింగరి ప్రవర్తనతో జనాలను ఇబ్బంది/భయపెట్టటం అనేది లేని మంచిపని కదా) చూస్తున్నాము అని మరికొంత ధైర్యం చేసి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ అనే ఒక నాలుగయిదు సంవత్సరాల పాత తెలుగు సినిమా చూసి అందులో కలగలిసిన మళయాళం దెబ్బకు పెల్లుబికిన నా ఆవేశం,బాధను ఒక కొత్త టపాగా [పర భాష-రాష్ట్ర, పద,వాక్య, సన్నివేశ, ప్రదేశాల కూర్పుతో మన తెలుగు సినిమా !?], మరియు అదే సినిమాలో నాకు బాగా నచ్చిన, స్ఫూర్తినీ, ఉత్తేజాన్ని కలిగించే ఒక ఆణిముత్యం లాంటి పాటకు సంబంధించి నా అభిప్రాయన్ని ఇంకొక కొత్త టపాగా [మౌనంగానే ఎదగమనీ - నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ సినిమాలోని పాట] మార్చే ప్రయత్నాలలో ఈ పోస్ట్ ను పూర్తి చేయటానికి నా ఆలోచనలను ప్రోదిచేసుకునే సమయం, అవకాశం చిక్కలేదు. ఇంతలో ఇప్పుడే చూసిన/చదివిన రాజేంద్ర గారి ఆర్తీని ఫలానవాడు మోసం చేసాడు ..!? అనే టపా లో చివరలో "అతడు" సినిమాను త్రివిక్రం గారు హిందీ సినిమా నుంచి 60% కాపీ కొట్టలేదా అనేదానితో ముగించటం చూసిన తరువాత, అటకెక్కి బూజుపట్టిపోయిన నా టపా గుర్తుకువచ్చి చెంగున కార్యరంగంలోకి దూకి దీనిని మీ ముందుకు తీసుకువచ్చాను. రాజేంద్ర గారి టపాలోని చివర వాక్యాలు మరచిపోయిన నా టపా గురించి గుర్తుచేసి, దానిని పూర్తిచేయటానికి దోహదం చేసినందులకు ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు.

ఇక అసలు విషయంలోకి వెళితే .....

సినిమా ఒక వ్యాపారంగా, ధనార్జనే ధ్యేయంగా తీస్తున్నప్పుడు, కాపీ కొట్టి కూడా (సరికొత్తగా తీసి) మెప్పించగలము అనే ధైర్యమో లేక ఇంతకు మించి కధ, సన్నివేశాలు మనం ఏడవలేమో అనే ఉద్దేశ్యమో లేక ఇక్కడ ప్రేక్షకులకి ఇంకా ఇది(వి) కాపీ అని తెలిసే అవకాశం లేదు అనే నమ్మకమో లేక ఒకవేళ తెలిసినా చూసే(చూస్తున్న, చూడబోయే) వీళ్లు మరియు ఈ కధా, సన్నివేశాల అసలు ఓనర్స్ పెద్దగా పీకేది(పీకగలిగేది) ఏమీ లేదు అని తెలుసుకున్న (అతి)తెలివితేటలో .. ఏదైనా కానివ్వండి ...

నా వరకు నాకు,

....ఈ కాపీయింగ్ అనేది ఏకకాలంలో కాకుండా అంటే ఈ కాపీకొట్టిన వాడి ప్రయత్నం నిజమైన ఓనర్ ని దెబ్బ తీయకుండా అంటే ఓనర్ కన్నా కాపీ గాడు సినిమాను/ట్రైలర్స్ మొదలగునవి ముందు విడుదల లాంటివి చేయనంతవరకైతే ఓకే...

....అలాగే ఒరిజినల్ సన్నివేశాల కన్నా ఈ కాపీ చేసినవి ఆయా దర్శక, మాటల రచయితలు నిజంగా ప్రేక్షకులను మెప్పించగలిగేలా తీయగలిగి మనలను నవ్వించగలిగినా లేక సంభ్రమాశ్చర్యచకితులను/ఒళ్లు గగుర్పోడిచేలా (with visual, special effects and high technical standards/values) చెయ్యగలిగేలా తీయగలిగితే ఓకే.

....ఇందుకు నాకు నచ్చిన ఓ రెండు మంచి ఉదాహరణలు : అతడు సినిమాలొ రైలు మీదకు దూకే సన్నివేశం (ఇది Money Train సినిమాలో WeslEy Snipes చేసినది :: కరెక్టే కదా!?) మరియు నువ్వు నాకు నచ్చావ్ లో డైనింగ్ టేబుల్ దగ్గర వెంకటేష్ దైవ ప్రార్ధన, ప్రకాష్ రాజ్ తల్లి మీద కవిత (ఇది Meet The Parents సినిమాలో Ben Stiller మరియు Robert De Niro చేసినది)....మరియు మరొక అధ్బుతమైన ఉదాహరణ మన్మధుడు సినిమా (What Women Want). ఇది గుర్తు చేసింది కింద వారి కామెంట్ ద్వారా RSG గారు అందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు.(To be honest with you even though I enjoyed those original scenes in English, I enjoyed more in Telugu version seeing Mahesh's terrific screen presence in the first one and Trivikram's brilliance in wording in the latter)

అలాగని ఇది తప్పుకాకుండా పోదు మరియు తప్పుకాదు అని చెప్పటం నా ఉద్దేశ్యమూ కాదు అంతకు మించి నేనేమీ దీనిని సమర్ధించటం లేదు....

నేను చూసీచూడనట్టు పోవటానికే ఇష్టపడటానికి కారణమేమిటి అంటే....

సినిమా అనేది నా దృష్టిలో ఒక ప్రోడక్ట్ కాదు ... కాపీ కొట్టిన వాడు ముందు దాని కన్నా మంచి (betterment) ప్రోడక్ట్ చేశాడు అని జనాలు పొలోమంటూ ఈ కాపీ గాడి వెంట పరుగులు తీసి అసలు దాన్ని పుట్టిముంచెయ్యటానికి.....సినిమా వచ్చింది ఆడింది పోయింది అంతే .... దాని సరాసరి ఆయుష్షు అంతే ఒక వ్యాపార దృక్పధంలో నుంచి చూసినప్పుడు... కానీ చూసిన జనాలు వాళ్ల గుండెల్లో ప్రతిష్టించుకునే ఆ సినిమా కాలపరిమితి ఉంది చూశారా అది...అది నిజమైన ఆయుర్ధాయమంటే....అందుకే ఒక దానవీరశూరకర్ణ, మిస్సమ్మ, శంకరాభరణం, దేవదాసు, సాగరసంగమం, The God Father, షొలే, గుండమ్మ కధ, పాతాళ భైరవి చెప్పుకుంటే ఇలా ఎన్నో ... కాపీ/రీమేక్ చెయ్యమనండి వీటిని లేదా వీటిలో సన్నివేశాలను...నూటుకి నూరు శాతం ప్రజల తీర్పు ఏమిటో, ఈ సినిమాల గురించి ప్రేక్షకులు ఏర్పరచుకున్న వెలకట్టలేని అభిమానం ఏపాటిదో సుస్పష్టంగా చెప్పితీరుతారు. (ఇప్పటికే రాంగోపాల్ వర్మకు, షారూఖ్ ఖాన్ కు బాగానే బుధ్ధి చెప్పారు)....ఇది ఇంతటితో ఆగదు ఇక ముందు కూడా ఇంత కన్నా బాగానే, ఎక్కువగానే బుధ్ధి చెపుతారు..శివ రీమేక్ చేస్తే అన్న ప్రశ్నకు నాగార్జున గారి సమాధానం ఇది : 'everyone has a right to make fools of themselves. Who can stop them?' .. ఎంత బాగా చెప్పారో కదా ...

సినిమాల రాశి ఎక్కువైనప్పుడు ఇలాంటివి తప్పవేమో లేక చాలా మామూలేనేమో అనిపిస్తుంది ఎందుకంటే మన భారతీయ భాషలలో (ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళం మొదలగు ప్రధానమైనవి) వచ్చేవి అసలే వందలాది సినిమాలాయె....ఇక్కడ గమనించవలసిన కొన్ని విషయాలు ఏమిటి అంటే ... ఒకటో, రెండో సన్నివేశాలు లేదా కొద్దో గొప్పో కధ ఒకే రకంగా ఉంటే ఏదో కాకతాళీయమేమో (కాదు అని మనకు కూడా తెలుసనుకోండి) అని సరిపెట్టుకోవచ్చు ... అలాగే నిజంగా ఒక సినిమా కధను మరొక సినిమాలో కాపీ చేస్తే ఆ నిర్మాత కాపీరైట్స్ ఉల్లంఘన కింద ఎలాగూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు (ఇది ముఖ్యంగా ఇంగ్లీష్ మరియు హిందీ సినిమా వాళ్లు కూడా బాగా కఠినంగా అమలుచేయటం మొదలు పెట్టాలి)...

దీనికి ఒక మంచి ఉదాహరణ ఈ మధ్యనే విడుదలైన ఆట సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మరియు తొలిరోజు ప్రేక్షకులు చాలా డైరెక్ట్ గా ఈ సినిమాకు ఏ సినిమా (గుడుంబా శంకర్) అనుకరణో చెప్పటం తద్వారా ఈ సినిమాకు ఫ్లాప్(ఇదొక్కటే కారణం అయ్యుండకపోవచ్చు) ముద్ర వేయటం నిజంగా రానున్న మార్పుకు సూచనగా అనిపిస్తుంది...[ఆ పైన కొసమెరుపు ఏమిటి అంటే ఈ గుడుంబా శంకర్ నిర్మాత ఆట సినిమా నిర్మాత నుంచి ఒక 15 లక్షలు రాబట్టటం తన సినిమా కధను కాపీ కొట్టినందుకు] ...

ఈ గుర్తించటం అనేది మెల్లమెల్లగా హిందీ, ఇంగ్లీష్ సినిమాల నుంచి అని తెలుసుకోవటానికి మరియు ఇలాంటి తెలుగు సినిమాలకన్నా ఆ హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూడటం లేదా ఇవే తెలుగు సినిమాలను పైరేటెడ్ సిడి లోనో లేక ఇంటర్నెట్ లో ఉచితంగా చూడటమే మంచిది అనే అభిప్రాయం కలగటానికి (ఇప్పటికే ఇవి అభిప్రాయాలు చాలా ఎక్కువగా, బలంగా మనలో నాటుకుపోవటమే కాదూ ఆచరణలో కూడా కనిపిస్తూనే ఉన్నాయి) తద్వారా ఈ కాపీయింగ్ బాగా తగ్గిపోయే అవకాశం చాలా దగ్గరలోనే ఉన్నది అని (ఇంకా పెద్ద ఎక్కువ సమయం పట్టక పోవచ్చు) అని నా అభిప్రాయం......[ఇప్పటికే ప్రేక్షకులు మనదైన అంటే ఒరిజినాలిటీ ఉండి, మితిమీరిన హింస, వెకిలి హాస్యం లేకుండా ఉన్న సినిమాలను తారాగణంతో పని లేకుండా ఆదరించగలరు అని చెప్పటానికి ఓ మంచి ఉదాహరణ : శేఖర్ కమ్ముల సినిమాలు మరియు బొమ్మరిల్లు మొదలగునవి...]

ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ లో రెండో మూడో, విజయవాడ లో ఒకటో, రెండో థియేటర్లలో ప్రదర్శించ బడే స్థాయి నుంచి, మరియు English సినిమా USA/UK లో విడుదలైన కొన్ని నెలల తరువాత ఇక్కడ విడుదలయ్యే ప్రక్రియ నుంచి ఇప్పుడు ఇక్కడ కూడా అవే తేదీలలో విడుదలయ్యే స్థాయికి మరియు ఏదో వెరైటీగా లేక జాకీఛాన్ లేక మంచి ఫైటింగ్స్, Visual Effects ఉన్న సినిమా అని ఇంగ్లీష్ సినిమాకు వెళ్లే కోరిక నుంచి ఈ రోజు ఇంగ్లీష్ సినిమా విడుదలవ్వగానే రివ్యూలు చూసి వెళ్లాలా వద్దా అని రడీ పోయే సెలెక్టివ్ స్థాయికి మనం వచ్చాం ....

అలాగే ఇంటర్నెట్ వినియోగం పెరిగి మన లాంటి వాళ్లు బ్లాగ్స్/సైట్స్ లో చెప్పే మరియు టివి, పత్రికలు, SMS మొదలగు వాటి ద్వారా ఈ సినిమా లేక సన్నివేశం ఏ సినిమా/సన్నివేశానికి కాపీ అనేది ఈ మిగిలిన జనాలు సైతం తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు మరియు రాబోయే కాలం కూడా ఈ కాపీయింగ్ ని చాలా వరకు తగ్గించటానికి తప్పక దోహదం చేసి తీరుతుంది.



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..

పర భాష-రాష్ట్ర, పద,వాక్య, సన్నివేశ, ప్రదేశాల కూర్పుతో మన తెలుగు సినిమా !?

Posted by తెలుగు'వాడి'ని on Thursday, November 22, 2007

తెలుగు సినిమాలలో పర రాష్ట్ర, భాష (Hindi, Tamil, Malayalam and Kannada etc) పద, వాక్య, సన్నివేశ, ప్రదేశాలను కూర్చిన ప్రయోగాలను చూసి ఎప్పటినుంచో విసుగుచెంది కూడా, తన్నుకొచ్చే కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకుంటూ మరలా అదే తెలుగు సినిమాలు చూస్తూ (సిగ్గులేకుండానో లేక గతిలేకనో అని చదువుకున్నా ఫర్వాలేదు:)ఎలాగో కాలాన్ని నెట్టుకొస్తుండగా, ఇంతలోనే అంటే ఇప్పుడే చూసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా చూసి అందులో మితిమీరి పోయి ఉన్న ఈ విషసంస్కృతి లేక దర్శక/కధా రచయితల మరియు కెమేరామెన్ కొంగొత్త అభిరుచి లేక సృజనాత్మకత (!?) చూసి తట్టుకోలేని నా అవేదననకు అక్షర రూపమిది.

ఈ సినిమాను నేను ఉచితంగా (ఏమీ తెలియనట్టు, ఎలాగబ్బా అన్నట్టు ఫేసులు పెట్టకండి...అందరమూ (సరేలే చాలామందిమి) ఆ తానులో గుడ్డలమే ;) చూశాను (అందులోనూ ఇది చాలా పాత సినిమా) కాబట్టి ఈ సినిమాపై సమీక్షలాంటి నా అభిప్రాయాలేమీ ఇక్కడ ప్రస్తావించుటలేదు.

ఇప్పటికే మన దైనందిన జీవితాలలో ఆంగ్ల (అదే హైదరాబాద్ లో ఉంటే హిందీ/ఉర్దూ) పదాల వాడుక ఎంతగా జొచ్చుకు పొయిందో ఇక్కడ నేను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు ... మనం ఆ పదాలు వాడకుండా కొన్ని నిముషాలు లేదా కొన్ని వాక్యాలు కూడా మాట్లాడలేని పరిస్థితి... కానీ మనకందరికీ తెలిసినట్టుగా ఏవో ఒకటో రెండో ఆంగ్ల పదాలు అక్కడక్కడ వాడి మాట్లాడటం మొదలు పెట్టి ఇప్పుడు అక్కడక్కడ ఒకటో రెండో తెలుగు పదాలు పెట్టి మాట్లాడే స్థాయికి ఎదిగి(!?)పోయాము. (ఈ జాడ్యాన్ని కొద్దో గొప్పో తగ్గించటానికి, తెలుగు భాషాభివృద్ధికి, దాని గొప్పతనాన్ని కాపాడటానికి, ప్రాచీనభాషగా గుర్తించుటకు, తెలుగు వికీపెడియాలో విషయాలను చేర్చుటకు పాటు పడుతున్న ప్రతి ఒక్కరికీ ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందన శతఃనమస్సుమాంజలులు)

కుడి-ఎడంగా ఇదే విధంగా ప్రారంభమై, (బాల్య/కౌమార దశలను అంటే ఒకటో/రెండో పదాలు, వాక్యాలు/సన్నివేశాల తొ సరిపెట్టటం .. దాటాయనే నా అభిప్రాయం) ఇప్పుడు ఏకంగా యవ్వన/మధ్య వయస్సుని చేరుకొనే పరిణామ క్రమంలొ ఉన్నట్టుగా అనిపించే అంటే పూర్తి ఫ్లాష్-బాక్ లోని డైలాగులు, పాటలలో రెండో/మూడో వాక్యాలు, లేదంటే ఆరో/ఏడో సన్నివేశాలు మొదలగునవి జొప్పించి మనమీదకు వదలటం (మనం చూస్తున్నాము కాబట్టి వాళ్లు తీస్తున్నారు అని ... వాళ్లు తీస్తున్నారు కాబట్టి మనం చూస్తున్నాము అని ఎవరైనా వాదించవచ్చు గాక) అనేది నా అభిప్రాయం ప్రకారం దర్శక/కధా రచయితల పనికిమాలిన, వెధవ/చెత్త అభిరుచి, తెలుగు భాష, సినీ అభిమానులు అంటే లెక్కలేనితనం, అసలు కొంచమైనా బాధ్యతలేని సంపూర్ణ నిర్లక్ష్యం ... ముమ్మాటికీ మన దౌర్భాగ్యం.

నా ఆవేదన మరియు నా ఈ అభిప్రాయాలు ఈ ఒక్క సినిమాకు మాత్రమే సంబంధించినవి కాదు అండి....ఇలా అతిపోయే మిగతా సినిమాల గురించి కూడా నా స్పందన ఇలాగే ఉంటుంది.

సినిమాలాంటి ఒక పవర్-ఫుల్ మీడియా లో 'పర' ప్రయోగమనే అనే చిన్న మొక్కలాంటి విషసంస్కృతికి, దర్శక,కధారచయితలు వారి దౌర్భాగ్యపు అతి తెలివితేటలు, ఎందుకూ కొరగాని వ్యర్ధమైన సృజనాత్మక(?!) అలోచనలు అనే నీరు-పోసి బలం-వేసి ఒక వటవృక్షంగా తయారవ్వటానికి వారివంతు సాయం చేస్తున్నాము అన్న స్పృహ లేకపోవటం, ఉన్నా లేనట్టు నటించటం మనకు పట్టిన/పడుతున్న మరో జాడ్యం.

ఈ (తొక్కలో) దర్శకులు తీసేది ఏమన్నా అధ్భుత కళాఖండాలా లేక సమైక్య భారత జనజీవన స్రవంతి గురించి డాక్యుమెంటరీలా లేక సర్వరాష్ట్ర సమతోధ్ధారణ ప్రభోధిత సినిమానా ... నేటివిటి అనో లేక మాతృకలో ఇలానే ఉంది అనో లేక కధ వీటినే డిమాండ్ చేస్తున్నాయని పనికిమాలిన వాదనలతో సమర్ధించుకోవాలని చూడటం...

ఈ సినిమాలో హీరో గారి రెండో ప్రేమకధ గురించి చెప్పటానికి ఆంధ్రా నుండి కేరళకు తీసుకెళ్లిన దగ్గరనుంచి అక్కడ వచ్చేవన్నీ ఆ మళయాళం గోలే (ఒకటో రెండో డైలాగులు కాదు, పాటలో కూడా హీరోయిన్ తో రెండు వాక్యాలు .. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి)....ఈ సినిమా దర్శక/కధారచయితలు ఎందుకు కేరళను ఎన్నుకున్నారో తెలియదు గానీ....నా మటుకు నాకు ముఖ్యంగా మూడు సన్నివేశాలు కనపడ్డాయి...అవి :

1. హీరో గారికి హఠాత్తుగా ఒక తెలుగు ఆంటీ ముక్కుపుడక పెట్టుకొని కనపడటం...హీరోయిన్ తో ఆడపిల్లకు ముక్కుపుడక అందంగా ఉంటుంది అని చెప్పటం...ఈమె గారు తదుపరి సీన్ లో పెట్టుకోవటం...

2. కాలేజి నుంచి ఇంటికి రావడానికి పడవలో హీరో గారికి అక్కడ మళయాళం గుంపు చోటు ఇవ్వకపోవటం...హీరోయిన్ గారు అంతా ఆడవాళ్లు మాత్రమే ఉన్న పడవలో హీరో గారికి చోటు ఇవ్వటం...ఈ మగ గుంపు 'ఆడంగి' అని మళయాళంలో ఎగతాళి చేయటం.....(తరువాత మన వాడు రెచ్చిపోయి అందరినీ నీళ్లల్లోకి తోసెయ్యటం...మీరు ఊహించే ఉంటారు కదా)

3. హీరో గారి కోసం మన హీరోయిన్ గారు తెలుగు నేర్చుకోవటం ... (తన మీద ఉన్న ప్రేమతోనని చెప్పటం .. అదే తెలుగుతో చివరలో మరచి పొమ్మనమని చెప్పటం)

గుండెమీద చెయ్యివేసుకొని, అంతరాత్మ మీద ప్రమాణం చేసి అన్నీ నిజాలే చెప్పగలిగిన క్షణాన ఈ దర్శక/కధా రచయితలను మాట్లాడమని చెప్పండి...

రెండవ భాగం (మొదటిది గోదావరి జిల్లా నేపధ్యం) ఆంధ్రప్రదేశ్ లో వేరే ప్రాంతానికి (ఉదా: తెలంగాణ) మార్చి, అదే ముక్కుపుడక సీను, మన హీరో గారికి తెలియని తెలంగాణ తిట్టుతో ఆ సన్నివేశాన్ని, మన హీరోయిన్ గారి తెలంగాణ యాస నుంచి మన హీరో గారి కోసం వీడు మాట్లాడే ఏ ప్రాంత తెలుగు అయితే అది నేర్చుకున్నట్టుగా చూపించలేరా?

ఒకవేళ పై విధంగా సన్నివేశాలు మారిస్తే మన ఈ అతి గొప్ప సినిమా భవితవ్యం/కధాగమనం/చిత్రీకరణ పై నిజంగా అంత ప్రభావం చూపిస్తాయా? (ఏమీ ఉండదు అని నేను అయితే ఘంటాపధంగా చెప్పగలను...వీలయితే మీ అభిప్రాయాలు తెలుపగలరు)

మరి వీళ్లు ఏ ప్రయోజనం ఆశించి లేక ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి కధావస్తువులను, సన్నివేశాలను తీస్తారో, తీస్తున్నారో నిజంగా వారికన్నా తెలుసంటారా (బహుశా తెలియదేమో)....ఇక వేరే దేశాలలో ప్రముఖ వీధుల్లో మన హీరో-హీరోయిన్లు పాటకు వేసే శరీర భాగాల వింత వింత కదలికలను వారు వీరివైపు అతి విచిత్రంగా నవ్వుకుంటూ ఏవో వింత జంతువులను చూసినట్టు చూస్తూ ఉన్నా కూడా మనవారు మరలా ఎగేసుకోని అవే/అలాంటి ప్రదేశాలకు మరలా మరలా వెళ్లటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా..

ఇక్కడ నేను ముఖ్యంగా కొన్ని విషయాలను ప్రస్తావించదలచాను :

1. నేను వీటిని వాడ(చూపించ)టానికి పూర్తిగా వ్యతిరేకిని కాదు ... అలాగని పైన చెప్పినట్టుగా మొత్తము దానితోనే చుట్టేస్తాము రీలు మీద రీలు అంటే చూస్తూ ఊరుకోనూ లేను...ఏదో ఆవేశం....ఏదైనా మితముగా ఉండేటట్టుగా చూస్తే, అలాగే నిజముగా ఆ సన్నివేశాలు/డైలాగ్స్ మొదలగునవి సినిమాకు అవసరమనీ, అవే ప్రాణమనీ గుండె మీది చెయ్యి వేసి చెప్పగలిగి తీసి ప్రేక్షకులను ఒప్పించ గలిగేలా ఉంటే బాగుంటందని నా అభిప్రాయము....

2. ఒక వేళ ఈ సన్నివేశాలు/డైలాగ్స్ ఆయా ప్రాంతాల, రాష్ట్రాల, ప్రజల పధ్ధతులను, ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సంప్రదాయాలను అంటే దసరా/దీపావళి నార్త్ లో ఎలా జరుపుకుంటారో, మన ఉగాదిని తమిళనాడులో ఏమంటారో/ఎలా చేసుకుంటారో, మళయాళీల చీరకట్టు, మదరాసీల పంచెకట్టు... ఇలాంటివాటికి పరిమితమైతే అందరికీ ఆనందము ..కొత్త విషయాలు నేర్చు(తెలుసు)కున్నాము/కుంటున్నాము అనే భావనతో.

3. అలాగే పాటలలో లేక సన్నివేశాలలో ప్రకృతి రమణీయ దృశ్యాలను చూపించటానికి (కేరళ, కర్ణాటక, చెన్నై మరియు ఆ హిందీ రాష్ట్రాలతో సరిసమానమైన లేక ఇంకా కొంచెము బాగా ఉండే ప్రదేశాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అని కొంతమంది వాదించ/తెలియపరచ వచ్చు) ఈ డైలాగ్స్/సన్నివేశాలు ప్రాతిపదికైతే ... అంతవరకు ఓకే....ఎందుకంటే మొదటి కారణము కారణాలు ఏవైనా దీనిని దర్శక/కధా రచయిత/కెమెరామెన్ ల అభిరుచికి, నిర్మాత బడ్ఙెట్ కి వదిలి పెట్టెయ్యటము మంచిది .. ఇక రెండో అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇలాంటి విషయాలు/ప్రదేశాలు చూడటం/తెలుసుకోవటం వలన, పర్యాటకం పెరిగి అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి...

దీనికి మంచి ఉదాహరణ : గోదావరి సినిమా ... ఇది వచ్చిన/చూసిన తరువాత నుంచీ గోదావరి పర్యాటక ప్రదేశంగా ఎంత అభివృధ్ధి చెందిందో, ఆ లాంచీ ప్రయాణం ఎంత ఫేమస్ అయ్యిందో మనలో చాలామందికి తెలిసిన విషయమే ... అలాగే ఈ గోదావరి సినిమా చూస్తూ ఉన్నంత సేపూ, చూసిన చాల రోజుల తరువాత వరకు కూడా, మన కందరికీ నిజంగా ఇంత అందంగా ఉంటాయా ఆయా ప్రదేశాలు (ఒక్క ప్రదేశాలే కాదు లేండి కమలనీ ముఖర్జీ కూడా అనుకోండి ;) అనీ లేక ఇంత అందంగా చూపించవచ్చా సినిమాలలో అనీ అనిపించిన(చని)వారంతా తెలియజేయండి(ఈ తెలియజేయడం ఒక్క గోదావరి అందాల గురించేనండోయ్ :)

ఇది భారతీయత అనీ, ఇవి మన వారసత్వ సంపద అనీ, మనం భారతీయులమనీ గర్వంగా చెప్పుకోవటానికి దోహదపడతాయి కాబట్టి ఓ.కె ... అలాగే రేపు ఇతర దేశాలలో వీటి గురించి NRIs ని, లేక ఇండియా విచ్చేసిన ఇతర దేశాల వాళ్లు మన ఇండియన్స్ ని ఎవరన్నా అడిగితే ... ఆ! అవా , అవేవో కేరళ వాళ్లవనో, తమిళనాడు వాళ్లవనో ఒక్కరంటే ఒక్కరు కూడ చెప్పరు ... ఎవరైనా-అవునండీ, అవి మా ఇండియా లో ఫలానా రాష్ట్రంలో లో ఉంటాయి ... బాగుంటాయి ... ఒక్క సారన్నా చూసి తీరవలసినవి అనే చెప్తారు.......అందుకే పర్యాటక, విహారానికి సంబంధించిన ప్రదేశాలను సినిమాలలో చూపించటం తప్పులేదు.

నాకు తెలియని విషయం ఒకటి తెలుసుకోవాలనే ఉత్సాహంతో అడుగుతున్నాను : మన తెలుగు సినిమాల లాగానే ఆ తమిళ, మళయాళ, హిందీ మొదలగు సినిమాలలో కూడా ఇలాగే తీస్తున్నారా అంటే వాళ్లు కూడా ఫ్లాష్-బాక్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లేక గోదావరి చుట్టుపక్కల పల్లెప్రాంతాలకి వెళ్లినట్టుగా, కొన్ని డైలాగులు తెలుగులో మాట్లాడుతున్నట్టుగా మొదలగునవి. (నేను ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ తమిళ/మళయాళం సినిమాలు చూడలేదు కనుక మనకి ఆ విషయపరిజ్ఞానం శూన్యం. కనుక మన బ్లాగ్మితృలలో ఎవరికి అయినా వీటి గురించి తెలిసి ఉంటే దయచేసి తెలుపగలరు..అట్టివారికి మునుముందుగానే కృతజ్ఞతలు)..ఒక వేళ వాళ్లు కూడా ఇలాగే తీస్తూ ఉంటే .. అదొక రకమైన వెర్రి ఆనందం :-( వాళ్లు కూడా మనతోనే ఉన్నారనీ మరియు మన గురించి అక్కడ ప్రాచుర్యం లభిస్తుంది కదా అని.....ఏదో గుడ్డిలో మెల్ల :-)

అలాగే ఇంకో గుడ్డిలో మెల్లగా, మట్టిలో మాణిక్యంలా....ఇంత బాధలో కూడా దొరికిన ఆణిముత్యమైనది ఏదైనా ఉంది అంటే అది ఈ సినిమాలో ఉన్న మౌనంగానే ఎదగమనీ అనే పాట....దీని గురించి నేను ప్రచురించిన మరొక బ్లాగ్ పోస్ట్ : మౌనంగానే ఎదగమనీ - నాకు నచ్చిన పాటలు లో చూడండి.



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..

మౌనంగానే ఎదగమనీ - నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ సినిమాలోని పాట

నాకు బాగా నచ్చిన సినిమాలు, పాటల గురించి నా ఆలోచనలను, అభిప్రాయాలను నాకు తోచిన రీతిలో, సాధ్యమైనంత విశ్లేషణాత్మకంగా వ్యక్తపరచుటకు, నాలో పెల్లుబికిన నూతనోత్సాహపు ప్రత్యూషపవనం నా మబ్బుల మదిని తాకిన ఈ క్షణాన విరచించబడిన నా ఈ మొదటి ప్రయత్నం తేలిపోయే పిల్లమబ్బులా ఈ ఒక్క దానితోనే మిగిల్చిపోతుందో లేక చిరుజల్లులు కురియించు చందంగా మరికొన్ని రాయుటకు ఉత్తేజాన్నిస్తుందో లేక ప్రళయకాల ఝుంఝూనిలమారుతమై ఒక సునామీ కెరటమై నేను చెప్పదలచుకున్నవన్నీ నా ఆలోచనాభిప్రాయాల సంద్రంలో నుంచి తీరమనే బ్లాగ్-పోస్ట్స్ లోకి విసిరి కొట్టే వరకు నన్ను వెన్నంటి ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.

ఇక మనం పైన పేర్కొన్న పాటకు సంబంధంచిన విషయంలోకి వెళితే.....

హీరోగారి రెండో ప్రేమకధ కేరళకు మారినప్పటి నుంచి ఇదేదో మళయాళం సినిమా చూస్తున్నామన్న భావన అనే కష్టాల కడలిని ఈదితే, ఈ మౌనంగానే ఎదగమనీ అనే ఆణిముత్యం లాంటి పాట దొరకటం నిజంగా ఒక అందమైన అనుభూతి. ఈ తెలుగు సినిమాలో మళయాళం గోల గురించి, ఇంకా పర భాష-రాష్ట్ర, పద,వాక్య, సన్నివేశ, ప్రదేశాల కూర్పుతో మన తెలుగు సినిమా గురించి, తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడో లేక పైన ఉన్న ఆ లంకెనైనా క్లిక్కండి....

ఒకవేళ మీకు ఈ పాట చూడాలి అని ఉంటే ఈ దిగువన ఉన్న లింకుని నొక్కండి...లేదా మీకు YouTube లో(చాలా మంచి కామెంట్స్ రాశారు) చూడాలి అంటే ఈ లింకుని నొక్కండి లేదా క్రింద ఉన్న వీడియోపై డబుల్ క్లిక్ చెయ్యండి....

మౌనంగానే ఎదగమనీ(భూమిక), ఒవ్వొరు పోక్కళమే(స్నేహ) మౌనంగానే ఎదగమనీ(భూమిక), ఒవ్వొరు పోక్కళమే(స్నేహ)

YouTube లంకె(తెలుగు):వీడియో - మౌనంగానే ఎదగమనీ(భూమిక)
YouTube లంకె(తమిళం):వీడియో - ఒవ్వొరు పోక్కళమే(స్నేహ)

ఈ పాటగురించి చెప్పాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, మొదలు పెట్టిన తరువాత ఎక్కడ ఆపాలో తెలియనట్టుగా .... ఒక దానికొకటి మమేకమై మనలోని పంచేద్రియాలు ఏకకాలంలో ...ఈ పాటలో చంద్రబోస్ సాహితీ పటిమను, కీరవాణి సుమధుర సంగీతాన్ని, భూమిక ప్రశాంత స్థిరచిత్త హావభావ ముగ్ధ మనోహర సౌందర్యాన్ని, కోయిల కలకూజిత చిత్ర గాత్ర మాధుర్యాన్ని చవి చూస్తూ ఒక అయిదు నిముషాలు కాలమే స్తంభించిందా అనిపించేలా, మనసుకు హత్తుకుపొతూ, ఒక రకమైన ఉత్తేజాన్ని, సూర్తినీ రగిలిస్తుంది.

ఈ పాటలో నాకు బాగా నచ్చిన ఆణిముత్యాల వంటి (మచ్చుకి) కొన్ని చరణాలు : [పూర్తి లిరిక్స్ ఈ పోస్ట్ చివరలో ఇమేజెస్ రూపంలో ఉన్నాయి...కావాలంటే సేవ్ చేసుకోండి.]

ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందీ....
......
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చిందీ....
విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మిచ్చిందీ...
.....
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ ...
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలీ...

(పైన చెప్పినవన్నీ తమిళంలో పాటకు కుడా చక్కగా వర్తిస్తాయి కాకపొతే మనకు ఆ పాట అర్ధం తెలియ(లే)దు, మరియు భూమిక బదులు స్నేహ ఉంది....మిగతా వివరాలు మనకు తెలియవు ....)

[తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ప్రాణం పోయుటలో అణువంత ప్రమేయం ఉన్నా కూడా ఆ అందరికీ పేరుపేరునా ఇవే నా హృదయపూర్వక నమఃసుమాంజలి .... మీ కృషి, కష్టం అజరామరం .... దాని ఫలితం అనవరతం ఆనంద, స్ఫూర్తిదాయకం.]

ఈ పాటలొ భూమికకు చీర కడితే పాటకు-భూమికకు-పాట నేపధ్యానికి-ఆ స్టేజీ వాతావరణానికి ఇంకా బాగా నిండుదనం వచ్చేదేమో అనిపించింది ఈ పాట చూస్తున్నంత సేపూ .... ఏమోలే మన తొక్కలో అలోచనలు అంటే డ్రస్ వేస్తే చీరైతే, చీర కడితే డ్రస్ అయితే అనుకునే టిపికల్ అని నన్ను నేనే కొంచెం సేపు తిట్టుకోని ఇక ముయ్యమని సర్ది చెపుతున్నంతలో...ఈ పాటల రచయిత, సంగీత దర్శకుడు, పాడిన వారి గురించి తెలుసుకుందామని గూగ్లిస్తే, తమిళంలొ స్నేహ పాడిన పాట తగిలింది YouTube లో .... అందులో కూడా మన స్నేహ పంజాబీ డ్రస్ లొ నే ఉంది....అప్పుడు అర్ధం అయ్యింది అసలు విషయం :) మన తెలుగు సినిమా వాళ్ల గురించి తెలిసి కూడా తొందరపడి ఇందాక నన్ను తిట్టుకున్నాను అని గుర్తుకు వచ్చి అందుకు మరలా ఇంకొక సారి తిట్టుకోని (ఆ! మనకేమన్నా సిగ్గా పాడా మరలా మామూలే)...ఆ బాధ అంతా స్నేహను చూస్తూ(పంచేద్రియాలలో శ్రవణం (మనకు ఆ తమిళం అర్ధం అయ్యి చావదు కదా) వాటా, నయనానికి బదిలే చేస్తే ఆ ఆనందం చెప్పేది ఏముంది...ఎందుకంటే స్నేహ ముగ్ధమనోహరంగా, మనసుకు ఇంపుగా, కనులకు పండుగగా ఉంది) మర్చిపోయాము.......

ఒక వేళ మీరు ఈ పాట లిరిక్స్ ని డౌన్-లోడ్ చేసుకొవాలి అంటే కింద ఉన్న JPEG ఇమేజెస్ ను సేవ్ చేసుకోండి.


<-1:2->


ఒక చిన్న (సరే సరే పెద్దదేలే) విన్నపం : మన బ్లాగ్మితృలలో ఎవరైనా ఈ పాట తమిళ్ వెర్షన్ కు .. ఏ చరణానికి ఆ చరణం తెలుగు లో కి అనువదించి కొంచెం (ఓకే ఓకే చాలా) పుణ్యం కట్టుకోగలరా...వారికి ముందుగానే వేనవేల కృతజ్ఞతాభినందనవందనములు)



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..

ఏక వాక్య వార్తను పొడిగించి ఒక పేరాగా మార్చడం ఎలా !?

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, November 13, 2007

పేపర్ చదవడంలో సాధారణంగా మనమందరం అవలంబించే పధ్ధతిని (హెడ్డింగ్ పెద్దది, ఎక్కువ మాటర్ ఉన్నది దానిని ముందు చదవటం) యధాతధంగా మన ఇంటర్-నెట్ లో ప్రచురించే వార్తలను కూడా అలాగయితేనే చదువుతారేమో అని అలోచించి అలాగే అన్వయించాటానికి ప్రయత్నిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది.

ఇది ఈ మధ్యనే తెలుగులో.కాం అనే వెబ్ సైట్ లో ప్రచురించబడిన ఒక వార్త.

ఏకవాక్య వార్తను ఒక పేరాగా మార్చి రాసిన వారికి గొప్ప బహుమతి ఇస్తామన్నారో లేక సస్పెండ్ చేశారుఅనే పదాలను ప్రతి వాక్యంలో ఖచ్చితంగా ఉండాలి అనే నియమం ఏదన్నా విధించారో లేక ఈ సైట్ లో మీరు సేకరించిన వార్త ప్రచురించబడాలి అంటే కనీసం అయిదు లైన్ లు అన్నా ఉండాలి అని విలేఖరి కి చెప్పారో తెలియదుగానీ ... ఇదో విచిత్రం .. ఏమిటో ఈ వార్తాప్రచురణ ! :-( ;-)

వార్త ఇలా ఉండకూడదు ... లేదా ఫలానా విధంగానే ఉండాలి/రాయాలి అనే నియమనిబంధనలు ఏమీ లేవు అనుకోండి ... కాకపోతే ఇలాంటి వాటికి ఇంకా అలవాటు పడని ప్రాణం కదండీ...ఏదో ఉండబట్టలేక ఇలా...

ఒక వేళ సరదాగా .. కనీసం అయిదు వాక్యాలు ఉండాలి వార్త ప్రచురించబడటానికి .. అనేది కరెక్ట్ అనుకుంటే ....

ఇక్కడ ఉదహరించబడిన లంకె "9వ తరగతి తెలుగు ప్రశ్న (భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడు) - సమాధానం" కూ ఈ వార్తకూ బాగా జోడీ కుదిరినట్టే ...

తెలుగులో.కాం వారికి ఒక విన్నపం : ఈ(మీ) ఇంటర్-నెట్ సైట్ లో మనం ఇచ్చేది ఒక ఆకర్షణీయమైన లింకు లేక ఇమేజ్ .. దానిని క్లిక్కిన తరువాత మాత్రమే ఆ వార్తా వివరాలు చూపిస్తున్నారు కనుక .. ఇక్కడ మన దినపత్రికల ప్రింట్ మీడియాలో లాగా ఎక్కువ పేరాలు ఉన్న వార్త లాంటివి చదువుతారేమో అనేది అవసరం లేదు అండి.. ఎలాగూ క్లిక్కాము గదా .. చదివారా లేదా అనేది మనకు ఎలాగూ తెలియదు .. మనకి కావలసిన హిట్ మనకి వచ్చింది ... అంతే తెలుస్తుంది మనకు...కాకపోతే క్లిక్కి ఆ పేజ్ లోకి వేళ్లాము కాబట్టి ఒక వాక్యమున్నా చదువుతాము అందులో విషయముంటే ... పేరాలతో పని లేదు.



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

మీరూ ప్రయత్నించండి. 9 వ తరగతి ప్రశ్న : భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడు?

Posted by తెలుగు'వాడి'ని on Monday, November 12, 2007



ప్రశ్న చదివారు కదా ... ఇంకా ఎందుకు ఆలశ్యం ... చించండి మరి సమాధానం ...

సమాధానంతో మీరు సిధ్ధమైనా లేక ఇక ఆగలేకపోయినా ... మరి ముందుకు సాగి మూషికరాజ సహాయమున ఈ తెరపై బాగా కిందకు వెళ్లండి ..........




















































..................సరే ఇదేదో 9వ తరగతి పిల్లాడు రాశాడనో లేక సరదాగా ఉంది నవ్వుకున్నాం అనో అనుకుంటే .... ఇదే రేంజ్ లో ఒక తెలుగు సైటులో ప్రచురించిన ఒక వార్త,

ఏక వాక్య వార్తను ఒక పేరాగా ఎలా మార్చారో

............................ఏమో లేండి ఈ వార్త రాసింది అదే తొమ్మిదో తరగతి అర్హత ఉన్నవారో లేక ఏడో తరగతి మూడోసారి రాస్తున్నవారో :-) మన పనల్లా ఇలాంటివి కనిపించినప్పుడు నవ్వుకోవటం లేదా కొంచెం దురద ఎక్కువైతే ఇలా బ్లాగటం.



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

వరికి మధ్ధతు ధర - రాజశేఖరుని పనితనం మరియు వాచాలత్వం

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, November 6, 2007

ఎవడికి వాడు వరికి వెయ్యి ఇవ్వాలి అనే వాడే కానీ ఒక్కడు కూడా మా బాధ పట్టించుకోడే ... ఇది మీరందరూ అనుకుంటున్నంత చిన్న విషయం కాదయ్యా ..... మేము ఏమన్నా వెర్రి పప్పలలాగా హైదరాబాదులొ ఇప్పటి దాకా ఊరికే కూర్చున్నామా ... మేము చేసే ప్రయత్నాలన్నీ ప్రతి ఒక్కరికీ వివరించుకోవలసిన ఖర్మ పట్టింది ఏం చేస్తాం .. తప్పదు కదా పాలకపక్షంలో ఉన్నప్పుడు ... సరే తెలుసుకోని అఘోరించండి...

వివిధ పత్రికల సంపాదకీయాలు :

ఈనాడు ....ఇదేం మద్దతు
ఆంధ్రజ్యోతి .... విశాలం కావలసిన వరి ఆందోళన
ప్రజాశక్తి .... మధ్ధతు ధర - చిత్తశుధ్ధి

మొట్టమొదటి సారి రైతులు ఈ రేటు గురించి అలోచిస్తున్నారు అని మేము తెలుసుకున్నప్పుడు, తరువాత అన్ని ప్రతిపక్షాలు, నాయకులు దీని గురించి ధర్నాలు, వింత ప్రదర్శనలు మొదలు పెట్టినప్పుడు, వారి చిల్లర వ్యాఖ్యానాలు మేము పేపర్లలో చదివినప్పుడు, టి.వి లలో చూసి/విన్నప్పుడు, మేము మీకు ఎవ్వరికీ తెలియకుండా మా వార్తాహరులు/వేగుల ద్వారా మొత్తం సమాచారం సేకరించాము.

కానీ దాంట్లో మాకు పనికి వచ్చే విషయాలు ఏమీ కనపడలేదు అంటే ...

*** మేము మొన్నే కదా ఆదర్శరైతులుగా మొత్తాన్ని మా కాంగ్రెస్ వాళ్లనే ఎన్నుకున్నది, అందువలన వాళ్లకి ఎవరికీ ఇంకా వరి ఉన్న దాఖలాలు కనపడలేదు ... మరి ఇంకా ఎందుకయ్యా రేటు పెంచడం...

ఆ మిగతా వాళ్లు మాకు వోటు వేస్తారో ఛస్తారొ తెలియదు ... కొంచెం అటూ ఇటూ ఎవరన్నా ఉంటే రేపు ఎన్నికలప్పుడు మేము దీనికి వడ్డీ, అసలు, కొసరు కలిపి అప్పుడే ఇస్తాము కనుక ఇప్పుడు దీని గురించి మేము చించుకోని ఏమన్నా చేసినా ఎన్నికలనాటికి ఇది మర్చి పోయి ఇంకొకటి పట్టుకుంటారు ... అప్పుడే అంత వెధవలం అయిపోయాము అనుకుంటున్నారా...ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉంది.

*** మా పార్టీ కార్యకర్తలు, మంత్రులు, MLA - MP లు, అనుచరులు, బంధుమిత్రహితసన్నిహితులు, అసలు మా అనుకున్న ఎవరికి గానీ ఏ ఒక్కరికి అయినా ఈ రేటు పెంచటం వలన పైస కూడా వచ్చేటట్టేమీ కనపడలేదు...అంటే అసలు రాదు అని కాదు ఒక వేళ వచ్చినా కూడా అది మాకు చిల్ల పెంకులతోనో, విదిల్చిన ఎంగిలి మెతుకులతోనో సమానం....మాకు డబ్బు సంపాదనే ధ్యేయం అనుకుంటే మా పొన్నాలకి ఒక్క సైగ చేస్తే చాలు ఏదో ఒక కొత్త ప్రాజెక్టు సృష్టించకపోడు.....మరి ఇన్ని తెలుసుకోని రేటు పెంచి ఏం చేస్తాం.....ఏదో మీ పిచ్చి ఆలోచనలు కాకపోతే...

సరే ఇంతటితో సరిపెడదామా అంటే ... ఈ బాబు ఒకడు ... తుయ్యిమని ఢిల్లీ వెళ్లి అక్కడ అపాయింట్ మెంట్ దగ్గర నుంచి చివరికి ప్రధానమంత్రితో తిట్టించుకొన్నది కలుపుకోని అన్నింటినీ కలిపి ఒక పెద్ద లొల్లి మొదలెట్టాడు....సరే మనమేమన్నా తక్కువ తిన్నామా ... అదే టైంలో మా MLA - MP లు, ఇంకా ఢిల్లీ చూసొద్దాం , పేపర్లలో ఫొటో చూసుకుందాం అనుకున్న వాళ్లని మొత్తాన్ని చుట్టచుట్టి ఏదో వినతిపత్రం ఇప్పించాం .. గుడ్డిలో మెల్లగా రేటు పెంచితే మన గొప్పతనం...లేదంటే ఆ! బాబేనా ఢిల్లీ వెళ్లి అడిగేది మేము కూడా వత్తిడి తెస్తున్నాము అని చెప్పుకోవచ్చు కదా....ఇంత చేసినా మీకు సంతృప్తి లేక పోయే ఎట్లా ఛస్తామయ్యా మీతో...

ఇక ఇట్లా కాదులే అని చిట్ట చివరిగా నేనే పంచె సవరదీసుకుంటూ ఢిల్లీ వెళ్లానా లేదా మీ కోసం ... అహ అసలు వెళ్లానా లేదా మీ కోసం ... అర్ధం చేసుకోరు ఏందయ్యా మీరు అసలు...

మీకేం నాయనా ఇక్కడ ఢిల్లీలో నా బాధలు ఎవడికి చెప్పుకోవాలి .... ప్రధానమంత్రి గారికి పేరులో మాత్రమే మన (మన+మోహన్ సింగ్) ఉంది ... ఈయనకి మన తన ఎవడైనా ఒకటే ... ఈయన ఇచ్చేదేమో కొన్ని నిముషాల సమయం .. ఆ కాస్తలోపే నా పాలన గురించి, 'మన' అనుకుంటే ఎట్లా దోచి పెట్టచ్చో, నియమనిబంధనలతో పని లేకుండా ఎదైనా ఎలా చేయవచ్చో, ఏ విధంగా సంతకం పెట్టవచ్చో వివరించటం కుదిరి చావదాయే...ఎలా చావాలి ఈయనతో ..

కాదూ కూడదూ ఈయనను మన బ్రహ్మాస్త్రంతో .. అదేనండీ డబ్బు సూట్ కేసులతో కొడదామా అంటే ఈయనేమన్నా మా సోనమ్మా లేక దిగ్విజయన్నా లేక మొయిలీ మామా....అదీ గాక ఈ పెద్ద మనిషికి ఈ సూట్ కేస్ ల లెక్కలు అర్ధం అయి చావవు .... అసలు మన అర్ధశాస్త్రం ఈయన అర్ధశాస్త్రం పూర్తిగా వేరాయె....

ఏదో చెపుతాడు : భారం అంటాడు ... బడ్జెట్ అంటాడు ... మనకి అర్ధం అయ్యే భాషలో ఒక్కటీ చెప్పడు

... ఇయన్నీ ఎవడికి కావాలండి ఏదో ఒకటి చేసి మరలా ఎన్నిక అయితే ఆ తరువాత వీటన్నిటినీ వెంటనే ఉపసంహరించుకోవచ్చు కదా ... మమ్మల్ని చూసికూడా నేర్చుకోడు మేము నాలుగేళ్లనాడు ఎన్ని చెప్పలేదు, ఏమన్నా చేసామా పెట్టామా, ఏం పీకుతున్నారు జనాలు... మనదేమో ఎన్నికలశాస్త్రం ఈయనదేమో నిజమైన అర్ధశాస్త్రం ... రెండికీ లంకె కుదరదు అని ఈయనకి అర్ధం కాదు పెట్టదు ..

సరే ఈ చావు కబురు మరల హైదరాబాదు దాక మోసుకెళ్లటం ఎందుకు అని ఇక్కడే పత్రికల/టివి వాళ్లకి చెప్పేసా .. హమ్మయ్య ఒక పని అయిపోయింది....అసలు మనం ఇక్కడికి వచ్చింది వేరే పని మీద కదా .. అదేనండి అమ్మకి ఈ నెల సూట్ కేస్ లు ఇచ్చే పనిమీద .. ఇక మనం ఆ పని కానించేస్తే ఇక్కడ చెయ్యటానికి ఏమీ లేదు.....అప్పుడు మన పాదయాత్ర-తలకి కండువా, ఇప్పుడు మన విమానయాత్ర-పంచెకట్టు చూసి నిజంగా ఏదో చేసేస్తామని నమ్మిన వాళ్లకి మనం ఇక్కడికి వచ్చి ఫుల్ గా బాగానే యాక్ట్ చేసాం కదా ఇక చాలు ఇక్కడ..........

కాకపోతే మనం తొందరగా హైదరాబాద్ బయలు దేరి వెళ్లాలి ... అసెంబ్లీ మొదలు కాబోతుంది కదా .. నాకు, మా మంత్రులకు "తిట్ల పురాణం - తెలుగులో" క్లాస్ కి అటెండ్ అయి కొత్తవి నేర్చుకోవాలి....లేక పోతే మన పని గోవిందా ఆ ప్రతిపక్షాల, వాళ్ల నాయకుడు అడిగే ప్రశ్నలకు, లేక బయట పెట్టమనే నిజాలకు.....

హమ్మయ్య! మొత్తానికి చివరకు విమానంలోకి వచ్చి పడ్డాం.....ఇంకెంత సేపులే ఈ మాగజైన్ తిరగేసేలోపు మా రాజ్యం/పాలనలోకి వచ్చి పడతాం....

ముగింపు : విమానం దిగిన తరువాత విలేకరుల సమావేశంలో వరికి మధ్ధతు ధరపై అడిగిన ప్రశ్నకు

ఎవడ్రా వాడు వరికి రేటు పెంచమనేది ... ఏందిరా పెంచేది తొక్కా.....నా సంగతి తెలియదు మీకు ... తోలు తీస్తా ఏమనుకున్నారో....బొక్క ఏమన్నా కాదు పెంచేది....గట్టిగా అడిగితే బొంగు పగులుద్ది.....ఇంక మూసుకోని దొబ్బెయ్యండి...ఇక ఈ విషయం ఇంతటితో వదిలెయ్యకపోతే డొక్క చించి డోలు కడతా .... అని వివరిస్తున్నంతలో ...

ఇది అసెంబ్లీ కాదు, ఎదురుగా చంద్రబాబు లేడు, ఆ పైన అడిగింది ఈనాడు/ఆంధ్రజ్యోతి విలేకరి కాదు అయినా ఏమిటబ్బా (కొంపదీసి హైదరాబాద్ గాలి/నీళ్లు కాదుకదా అనుకునేంతలో) అని అందరూ, వారితో పాటు తను కూడా ఆశ్చర్యపడుతున్నంతలో,

ఒక్క సారి చేతుల వైపు చూసుకుంటే ...

ఇందాక మనం చెప్పుకున్న తను, తన మంత్రి వర్గం అటెండ్ కాబోయే "తిట్ల పురాణం - తెలుగులో" క్లాస్ కు సంబంధించిన మొదటి పాఠం ....

అది చూడటంతోనే అందరికీ అర్ధం అయిపోయింది అసలు విషయమేమిటో ....

కొసమెరుపు : ఎవడురా రేపు చదవవలసిన పాఠం ఇప్పుడే తెచ్చి నాముందు పెట్టింది ... ఉన్న తలనెప్పులకు తోడు ఇవి కూడానా అని బాధపడుతున్నట్టు నటిస్తూ, మెల్లగా ఆ కాపీని మరికొన్ని కాపీలు తీయించి, కన్నా కు, ధర్మాన కు మొదలగు వారికి పంచవలసిందిగా రోశయ్యగారికి సైగచేసి చెప్పటం అందరి కంటా పడింది.



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting