గల్ఫ్ బాధితులకు మన రాజకీయ పార్టీల, నాయకుల, సగటు పౌరుని విషయ వివరణ లేఖ

Posted by తెలుగు'వాడి'ని on Sunday, October 7, 2007

గల్ఫ్ బాధితులారా

కష్టాల కడగండ్లతో పరాయి దేశంలో నిస్సహాయులుగా కన్నీటికే కన్నీరు తెప్పించే హృదయ విదారకమైన బాధతో స్వదేశి పయనానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ,అన్ని రాజకీయ పార్టీల, రాజకీయనాయకుల, మానవతావాదుల సహాయానికై చెవులు రిక్కించి ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్న మీకు అన్ని వర్గాల, పార్టీల , ప్రభుత్వాల, నాయకుల, సగటు పౌరుని సహాయ నిరాకరణకు సవివరణ కారణాలు ఇవే.

అన్ని పార్టీలు , ప్రభుత్వాలు, నాయకులు ఒకే మాటగా ప్రకటించే విషయాలు :

1. ఊహలకే పరిమితమైన మధ్యంతర ఎన్నికలు, లేక సమీప భవిష్యత్తులో ఊరిస్తున్న విధాన సభ ఎన్నికలకు ఓటరు గుర్తింపు పత్రములు ఇప్పటికే పూర్తి అయిపోయాయి. కనుక మిమ్మలని ఇక్కడకి తీసుకురావటము వలన మాకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు, కనుక గాలిలో దీపము పెట్టి ఆకాశము వైపు చూడండి.

2. ఒక వేళ ఇప్పుడు కొత్త ఓటరుగా రిజిస్ట్రేషణ్ కి వీలు ఉన్నది అనుకున్నా , మీరు ఖఛ్చితముగా ఏ పార్టీ వారో మా దగ్గర ఎలాంటి వివరాలు లేవు కనుక మీ చావు ఏదో మీరు చావండి.

3. కనీసము మిమ్మలని తీసుకువస్తే మీ భార్య , పిల్లల ఓట్లు అన్నా మాకు వస్తాయి అంటే, మీరు అక్కడ ఉద్యోగాలు ఊడగొట్టుకుని డబ్బులు లేకుండా మీరు ఇక్కడికి వస్తున్నారు ఇంక మీ మాట మీ భార్య , పిల్లలు ఎలా వింటారు.... ఈ విషయంలో మీకు మాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే ఎన్నికలలో ఓడిపోయి ఇంటికి వెళ్ళినా (ఒకప్పుడులే) లేక సాయంత్రానికి 1 లేక 2 కోట్లు ( కప్పుకునేవి, వేసుకునేవి కాదు బాబు ...దేవుడి పాలనలో నిజముగా డబ్బులే) మాకు తిండి, మంచము, తలుపు తీయటములాంటివి ఉండటము లేదు. కనుక మీకు ఆ దేముడే దిక్కు.

4. అన్నిటికన్న ఒక ముఖ్య విషయము ఏమిటి అంటే , తీసుకువచ్చి మీకు ఓటు హక్కు పుట్టించి , మా భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టే బదులు , ఎలాగు దొంగ ఓట్లు , బినామి పేర్లతొ ఆ ఓట్లేవో మేమే గుద్దేసుకుంటాము.... కనుక తూరుపుకి తిరిగి దండము పెట్టండి.

5. పార్టీ ( ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలది ఒకటే మాట బాట ఇలాంటి వాటిల్లో ) మీటింగు పెట్టి సీరియస్ గా చర్చిస్తే తేలింది ఏమిటి అంటే, మీకు ఒక్కొకరికి పది, పదిహేను వేలు పెట్టి మిమ్మలని తీసుకువచ్చి మీరు ఓటు వేస్తారో చస్తారో తెలియక టెన్షన్ పడే బదులు అదే డబ్బుతో మేము ఐదారు ఓట్లు కొనుకోవచ్చు. (కంగారు పడకండి ... ఏంటి మీరు ఈ దేశము వదిలి బయలుదేరేముందు 2 సారా పాకెట్లు , 500 -1000 రూపాయలు డబ్బులు ఇస్తే సరిపోయేదిగా అనుకుంటున్నారా... దేవుడి పాలనలో వీటికి కూడా స్టాండర్డ్ ..పెంచారులే)...

కాంగ్రెస్ (రాజశేఖర్ రెడ్డి మరియు వందిమాగధులు):

అసలు నిజముగా ఆలోచిస్తే మీరంతా 3 లేక 4 సంవత్సరాల ముందు వెళ్ళినవారే అంటే మీరు మాకు ఓటు వెయ్యకుండానే వెళ్ళారన్నమాట.. కనుక మీరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాదు కనుక , మేము ఏటి చేత్తామ్..ఒక్క చెయ్యి ఇవ్వటము తప్ప.

టిడిపి (చంద్రబాబు నాయుడు మరియు కంపెనీ):

నేను సి.యమ్ గా ఉన్నప్పుడో లేక ఎన్నికలు దగ్గరలో ఉన్నప్పుడో వెళ్ళి , నేను మీకు, మీలాంటి పేద, బడుగు, రైతు వర్గాలకు ఏమి చెయ్యలేదు అని అందరికి తెలిసేలా చేస్తారా... నేను మీ మీద అలిగాను అని మీకు తెలియ జేసుకుంటున్నాను...కనుక నేను ఉత్తరాల మీద ఉత్తరాలు ప్రధానమంత్రికో, ఇంకొకరికో పంపిస్తూనే ఉంటాను అని మీకు విన్నవించుకుంటూ...మీరు చెప్పేది విందాము అనుకునేలోగా ఆ సోనియా అమ్మ ఏదో మధ్యంతరము అంటూ ఉంది.......అదీ కాక ఈ మధ్య నేను ఏ విషయం, సమస్య మీద అయినా ఎక్కువ సేపు ఆలోచించడం లేదు ఎందుకంటే మిగతా పార్టీల వాళ్ళు లేవదీసిన సమస్యలన్నిటినీ మనం హైజాక్ చెయ్యాలి గదా ...కనుక మీ గురించి ఇంకొక సారి ఆలోచిద్దాములే..

టి.ఆర్.యస్ (చంద్రశేఖర్):

ఓరి నా తెలంగాణా బిడ్డలారా మీరేందిరో పెద్ద లొల్లి చేసి నా తల(ఏందిరా ఒకడు నా మోకాలికల్లి ఇంకొకడు నా అరికాలి కల్లి చూస్తా ఉండారు ఇంకొకడు శూన్యంలోకి చూత్తా ఉండాడు నేను తల అనగానే) బొప్పిగట్టిస్తుండురు మీరు...నేనేదో మీ పేర్లు చెప్పుకుని ఇంక ఒక రెండు మూడు వేల మందిని అక్కడికే తోలి డబ్బులు దొబ్బుతూ ఉందాము అనుకుంటిని కదా... మీరు ఇట్లా చేస్తా ఉండారు... మిమ్మలని తీసుకువస్తే నాకు ఏందయ్యా..మీరు అక్కడే ఉంటే నేను రోజుకి ఒక్కడిని తిట్టి పోస్తా ఉంటా మీరు తెలంగాణా బిడ్డలు అనే వీళ్ళు తీసుకురావటము లేదు అని.....అందుకనే అక్కడే చావండి మీరు .

బి.జె.పి(బండారు):

నేను ముందు రాసిన 73 ఉత్తరాలకి రిప్లై రాక నేను చస్తా ఉన్నా ఇక్కడ... కావాలంటే మీ కోసము ఇంకొకటి పొడుస్తా వై.యస్.ఆర్ కి... అంతే గాని అంతకి మించి మనము పెద్దగా చేసేది ఏమి లేదు...

కమ్యూనిస్ట్స్:

మా పార్టీ ప్రకారము మిమ్మలని తీసుకురావాలి అని ఉంది కాని ... మీరు ఇప్పటికి ఇప్పుడు వస్తే మీ అడాళ్ళు, పిల్లా-జెల్లా , ముసలి ముతక ఎవరూ మా పోరాటాల్లోకి రారేమో అని మా భయము... అసలే ఈ మధ్య దేవుడు గారు లాఠీ గట్టిగానే విదిలిస్తున్నారు ... ఏమి చేస్తాము మాకు కొద్దిగా ఆలోచించుకునే సమయము ఇవ్వండి... మేము చించి అదే పోరాడి అప్పుడు మీకు చెప్తాము. అప్పటిదాక లాల్ సలామ్.

లోక్ సత్తా (జయప్రకాష్):(జయప్రకాష్ మీద కామెంట్ చేసినందుకు క్షమించండి ఎందుకంటే సమకాలీన రాజకీయ నాయకులలో అసంబద్దముగా మాట్లాడని, ప్రతి దాన్ని రాజకీయము చెయ్యకుండా , సమస్య కి పరిష్కారము చూపేదిశగా ఆలోచించే ఒక గొప్ప వ్యక్తి కాబట్టి)

మిమ్మలని ఇక్కడికి తీసుకురావటము ప్రధానమైన సమస్య కాదు... అసలు మీరు అక్కడికి ఎలా వెళ్ళారు ... వెళ్ళి ఏమి చేశారు... సేవింగ్స్ లో ఎందుకు డబ్బులు లేవు... వీటంన్నిటి మీద మేము ఒక అధ్యయన కమిటీ వేసి , పూర్తి సమాచారము సేకరించి , విశ్లేషించి అప్పుడు మేము మా నిర్ణయాన్ని వెలువరిస్తాము.. అంత వరకు ఏదో చేసేయ్యాలి కదా అని చెయ్యటము మా పార్టీ ఉద్దేశము / లక్ష్యము కాదు.

సగటు పౌరుడు:

300 మంది MLAs , 40 మంది MPs మరియు MLCs (ఈ లెక్క మనకి కరక్ట్ గా తెలియదు)... వీళ్ళంతా వాళ్ళ సొంత డబ్బులు వేసుకోకపోయినా, ఒక మూడు నాలుగు నెలల జీతభథ్యాలు తీసుకోకుండా ఉంటే, ఆ గల్ఫ్ లో ఉన్నవాళ్ళని ప్రశాంతముగా తీసుకురావచ్చు అని మేము సలహా ఇద్దాము అంటే మన మాట వాళ్ళు వింటారా ... అదీ కాక వాళ్ళకి తీసుకొవటమే కానీ ఇలా ఇవ్వటం అలవాటు లేదు అని మీకు కూడా బాగా తెలిసిన విషయమే కదా...

ఒక వేళ మేమే చందాలు పోగుచేసి తెద్దాము అని ప్రయత్నము చేద్దాము అనుకుంటే, కావలసింది 4 కోట్లు అయ్యితే మేము కనీసము ఒక 15 కోట్లు పోగు చెయ్యలేకపోతే , వెళ్ళవలసిన 4 కోట్లు మీ దాక చేరవు అని భయము మాది.

అన్నిటికన్నా ముఖ్యంగా మీరు బాగా మనస్సు పెట్టి ఆలోచించవలసిన విషయము ఏమిటంటే, మీరు అక్కడే ఉంటే కనీసము మీకు తెలుస్తుంది ఎలా చావబోతున్నారో... మీరు ఇక్కడికి వస్తే, మక్కా మసీదో, ముదిగొండో, లుంబినీనో, గోకుల్ చాటో, ఇవన్నీ కాక పోతే ఏదో ఒక ఫ్లై ఓవరో.. ఇలా ఇక్కడ అయితే మీరు ఎలా చావబోతున్నారో మీకే తెలియదు.. కనుక ఏ చావు బెటరో మీరే తేల్చుకోండి.విషయ సూచికలు :


7 వ్యాఖ్యలు:

నేనుసైతం on Oct 8, 2007, 2:52:00 PM   said...

మీ బ్లాగ్ అరంగ్రేటం అదిరింది. మీ వజ్రాయుధాలని గురిచూసి వదలండి ఇంక, ఏ దున్నపోతు శరీరానికైనా ఎక్కడైనా చురుక్కుమంటుందేమో ఆశిద్దాం.
-నేనుసైతం
http://nenusaitham.wordpress.com


కొత్త పాళీ on Oct 8, 2007, 6:29:00 PM   said...

Excellent.
Looks like chaduvari is going to have company and/or competition.
Look forward to more interesting posts from your sharp pen.


తెలుగు'వాడి'ని on Oct 8, 2007, 8:02:00 PM   said...

నేనుసైతం గారికి కృతజ్ఞతలు, మీ వ్యాఖ్యానానికి, అందులోని పొగడ్తకు మరియు అభినందనలకు .. గడచిన మూడు యుగాలలోని రాక్షస సంతతి అంశలన్నీ ఒక్కటై శతకోట్లగా వెచ్చించబడి వృధ్ధిచెంది ఈ అభినవ రాజకీయ నాయకులై మన ముందు కనిపిస్తుంటే, ఎన్ని వేనవేల వజ్రాయుధాలు ఒక్కటై తాకినా, ప్రయోజనం శూన్యం. అందుకే పోరాడినా ఓడి పోతామని తెలిసీ ప్రయత్నం చేసే ఆటే ఈ సమకాలీన రాజకీయం అయినా ప్రయత్నలోపం ఉండకూడదు అనే నా ఈ ప్రయాస.


తెలుగు'వాడి'ని on Oct 8, 2007, 8:02:00 PM   said...

కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు, మీ వ్యాఖ్యానానికి, అందులోని పొగడ్తకు మరియు అభినందనలకు .. నేను కూడా చదువరి గారి బ్లాగుకు నిత్య వీక్షకుడనే ... అప్పుడే వారితో పోల్చకండి ఎందుకంటే ఇది నా మొదటి జాబు మాత్రమే కనుక ఆంధ్రుడిని అయినందుకు ఆరంభ శూరత్వం నుండి బయట పడనివ్వండి :-)ఆ తరువాత అయినా కూడా సహవాసమే ఆవిధంగా అయితే కలిసి ఏదొ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టవచ్చు అని నా ఆశ, అభిలాష మరియు ఆకాంక్ష.


చదువరి on Oct 9, 2007, 2:11:00 AM   said...

కొత్తపాళీ గారు అన్నంత లేనప్పటికీ, ఇలాంటి వాడియైన జాబులు రాసి నేనూ మీతో చేరతానండి.


gopi on Oct 10, 2007, 2:35:00 AM   said...

Dear Sir,

me prerana chala bagundhi.

idi meru ekkado undi teluguvadi gurinchi meru antha badhapadi me alochanani vaykthparicharu daniki na kruthaznathalu.

ide abhipryamu memu vykthaparisthe ikkada viplavakavi antaru danitaruvatha naxalite e.t.c antaru

anduvalana meru ela jaruguthundhi, jaragabothundhi anekante meru daniki virugudua teluguvari kosam meru emi chesaru, emi chesthunnaru, varini emi cheyyamantaro visadikaristhe baguntundani naa abhiprayam.


తెలుగు'వాడి'ని on Oct 10, 2007, 10:16:00 AM   said...

గోపి గారు, మీ అభిప్రాయాలకు, అభినందనలకు కృతజ్ఞతలు. ఈ రోజుల్లో మన విమర్శలలోని 'విరుపు' తో పని లేకుండా, వాళ్ళ 'అరుపు' లతో సమస్యను పక్కత్రోవ పట్టించడం బగా అలవాటు అయిపోయిందండి. మన విధానసభలలో, పత్రికా సమావేశాలలొ వాడే పదజాలంతో సరిపోల్చుకుంటే వారు మనకు ఇచ్చే 'విప్లవకవి', 'నక్సలైట్' ఇలాంటివి మనలను పెద్ద బాధ, భయ పెట్టేవి కాదులేండి. నా తదుపరి కార్యక్రమం, మీరు అన్నట్లే మన అభిప్రాయలను వ్యక్తపరచడంతో పాటు, సమస్యకు పరిష్కారం దిశగా కూడా కొన్ని సూచనలను చేయాలి అనే...అతి తొందరలో వీటితో మీ ముందుకు వస్తాను...అంతవరకు ఇక సెలవా మరి!


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting