ధుర్యోధన ఏకపాత్రాభినయం : వై యస్ ఆర్

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, October 10, 2007

అన్న గారి కిలో 2 రూపాయల బియ్యం పథకం మన ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హైజాక్ చేస్తున్నారని వార్త చదివిన తరువాత, ఇదే తరహాలో ఒక వేళ మన వై.యస్.ఆర్ గారు మన అన్న గారి దానవీరశూరకర్ణ లోని ధుర్యోధనుని ఏకపాత్రాభినయం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకోకుండా నాకు వచ్చిన సరదా ఊహకు ప్రతి రూపమే ఇది.
........................................

ఏమంటివి, ఏమంటివి! అవీనీతి నెపమున నా వెన్నంటిఉన్న నా వాళ్ళకు ప్రభుత్వపు సొమ్ము దోచుకొనుటకు అర్హత లేదందువా ... ఎంతమాట, ఎంతమాట! ఇది మీరు పిచ్చి పట్టి ఎన్నుకొన్న ప్రభుత్వమే కానీ మిమ్ములను అందలమెక్కించు ప్రభుత్వము కాదే, కాదూ .. కాకూడదూ ఈ ప్రభుత్వమంతయూ అవినీతి మయమేయందువా?

మీ తాత తండ్రులను పరిపాలించిన పాలకులది కాదా అవినీతి? మిమ్ములను పరిపాలించిన ఆ ప్రభుత్వాలది కాదా అవినీతి? ఆవినీతి ప్రపంచంలో పుట్టి పెరుగుతుంటివి కదా, ఇదా పెద్ద అవినీతి?

ఇంత ఏల! అవినీతి ఆదిమాత, అధికారదుర్వినియోగ రాజమాత అయిన మా ఇందిరమ్మ అవినీతీకి బీజం వేసి మా పార్టీకి వారసత్వంగా అందించలేదా.. ఆమె చేసినదీ తప్పేనందురా.

నాతో చెప్పుంటివేమయ్యా మా నవతరం నాయకులకు ప్రతినిధి అయిన మా రాజీవుడు బోఫోర్స్ ఉదంతంతో అవినీతికి కొత్త చరిత్ర మొదలుపెట్టలేదా ..

ఆ తల్లీ-తనయుల నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్న మా మర్రి, ఆయనను అనుసరించిన మా మల్లి, అటు పిమ్మట పీఠాన్ని ఎక్కిన మా కోట్ల వీరంతా అదే వారసత్వాన్ని పెంచి పోషించలేదా...

దానినే అందిపుచ్చుకున్న నేను మా కొడుకు జగన్ కు , మా మిత్రుడు గాలికి, సహచరుడు రామచంద్రునకు, మా మంత్రులు బొత్స-పొన్నాల-ఆలీ-సంభాని-కన్నా-దివాకర్ కు, నా వద్ద అయిన నేమి, మా దివాకర్ వద్ద అయిన నేమి, పనిచేసే సూరీడు లాంటి వారికి ఎవరు ఏమన్ననూ, ఏ ఆధారాలు చూపించననూ ఎదురుదాడితో తిప్పికొట్టి ప్రభుత్వ ఆస్తిపాస్తులను పంచుటలేదా...

సందర్భావసరములను బట్టి, పార్టీ-వ్యక్తిగత-మిత్ర-హిత-సన్నిహిత-బంధు-మంత్రుల-సహచర-అనుచర-కార్యవర్గ ప్రాధాన్యాలను బట్టి అవినీతి, ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి, లంచగొండితనం, అధికారదుర్వినియోగం ఇవి అన్నీ మా ప్రభుత్వంలో ఏనాడో భాగమై పోయాయి.

కాగా నేడు అవినీతి, అవినీతి అని లేనిపోని వ్యర్ధ వాదమెందులకు? పనికిమాలిన పత్రికల సాక్ష్యాలెందులకు? పస లేని ప్రతిపక్షాల విమర్శలెందులకు?

ఓహొ! అధికారమా .. నేల-నింగి-కొండ-గుట్ట-వనము-ఖనిజము-ధనము-ధాన్యము-గనులు-మణులు దోచుకునుటకు అర్హతను నిర్ణయించునది ... అయినచో మా రాష్ట్రములో సస్యశ్యామలమై, సంపద విరాళమై, ఖనిజ సంవృధ్ధి అయి, నూతన భవన నిర్మాణ-రోడ్ల విస్తరణారృమై, వెలుగొందు అన్ని ప్రాంతములను ఇప్పుడే అధికారికముగా ధారదత్తము చేయుదను.

సోదరా వివేకా! అక్రమంగా మీరు ఎన్ని రాజ సౌధాలు నిర్మించుకుంటారో, ఎన్ని పరగణాలు ఆక్రమించుకుంటారో తొందరగా నిర్ణయించుకొని మీరు మంది-మార్బలముతో ఆ పని మీద నిమగ్నమవ్వండి.

బావా మేయర్ రవీంద్రా! మన పరగణాలో పచ్చని భూములు కనిపించనందువలన సామంత రాజ్యంలాంటి పక్క పరగణాలలో పచ్చగా కనిపించే ఊరికి ఊర్లే ఆక్రమించుకోండి. గట్టిగా అడిగితే ఏదో ఒక కర్మాగారం పేరు చెప్పేయండి.

కుమారా జగనా! మన రాజ్య సంరక్షణా బాధ్యతను యువరాజు అయిన నీకు అప్పజెప్పుటకు మన మహామంత్రి రామచంద్రుని సలహామేరకు మేము నిర్ణయించితిమి. సైనిక రక్షణ కవచ, శిరస్త్రాణాల, ఆయుధాల తయారీకై నీవు సొంతంగా ఒక కర్మాగారమును స్థాపించవలసి రావచ్చు కనుక మీకు సైనిక నిధి కింద ఒక 2,000 ఎకరాలను అతి తక్కువ వెలకు ఇచ్చుటకు నిర్ణయించితిమి. శత్రు దుర్భేద్యంగా మన రాజ్య నిర్మాణ-నిర్వహణకు, ముఖ్యంగా మన శత్రువులైన రామాంధ్రచంద్రజయశేఖరనారాయణరాఘవదత్తుల వ్యాఖ్యలు-వ్యాఖ్యానాలను సమర్ధవంతంగా తిప్పికొట్టుటకు, అవసరమున్ననూ-లేకున్ననూ ముందుగా మనమే వారిపై ఎదురుదాడి చేయుటకు, దిన-వార-పక్ష-మాస-త్రైమాసిక-అర్ధ సంవత్సర-సంవత్సర పత్రికలను, వేగుల-వార్తాహరులను, ఆధునీకరించిన మాయాదర్పణ చందపు వ్యవస్థను (టి.వి ఛానల్స్)కొంగొత్త స్థాయిలో ఏర్పాటు చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. కానీ ఈ విషయాలు ఎక్కడా బయటకు పొక్కనీయక, ఇదంతయూ మీ స్వయంశక్తి సామర్ధ్యాలపైనే నిర్వహిస్తున్నారన్న భావన మన సామ్రాజ్య జనవాహినికి కలిగించినచో యువసామ్రాజ్య పట్టాభిషేకానికి తుది ఘడియల శుభసూచికలవే.

మిత్రమా గాలీ! మీరు మా కోసమైనా, మేము మీ కోసమైనా లేక మన కోసం మరెవరైనా ఆట-పాట-వేట కోసమో అశ్వారూఢులై గజ పదాతి దళాలతో ఆటవిడుపుగా మన విడిదికే విచ్చేసినప్పుడు వారి, వాటి ప్రయాణ సౌకర్యార్ధం ఒక పది సహస్రముల భూమిని ఈనాముగా ఇచ్చుచున్నాము. విడిది చుట్టుప్రక్కల కాలక్షేపం కొరకు, విడిది లోని విలాసాల ఖర్చుల కొరకు, కనుచూపు మేరలో కనిపించే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, వనములు, ఖనిజములు, గనులు, మణులు అన్నియునూ మీకే ధారాదత్తం చేయుచున్నాను.

అనుచరులారా! మీ ప్రాంతాలకే పరిమితం కాకుండా మీ శత్రు భీభత్స భయానక యుధ్ధ శిక్షణానునుభవ-ప్రతిభాపాటవాలతో దందాగిరులతో వర్తమాన-భవిష్యత్తులో నివాసయోగ్యమగు ప్రాంతాలను ఎక్కడ కావాలంటే అక్కడ ఆక్రమించుకోండి.

పార్టీ కార్యకర్తలారా! మేము ప్రవేశపెట్టబోయే / పెట్టిన అన్ని పథకాలలో మీ పేరును జొప్పించుకోండి. అందినకాడికి దండుకోండి. అడ్డువచ్చిన వాడిని తొలగించుకోండి. అడ్డంగా మాట్లాడేవాడిని బూతుల బురద చల్లండి.

వంధిమాగధులారా! మీరు నా పై చూపే వెలకట్టలేని అభిమానానికి, మీ శక్తియుక్తులన్నీ సర్వవేళ సర్వావస్థలయందు నా సార్వభౌమాధికార పరిరక్షణకు వినియోగిస్తున్నందుకు, నెలనెలా మీకు కప్పం చెల్లించేటట్లుగా నా కోశాదికారిని ఆజ్ఞాపిస్తున్నాను. మీ తనయులు విల్లంబులు, బాణాలు చేతబూని ఎప్పుడు ఎక్కడ ఎలా సంచరించిననూ, ఉపయోగించిననూ ఏ సైనికాధికారీ తప్పుపట్టకుండా, అసలు విచారణ, శిక్షలే ఒక ప్రహసనంగా మార్చివేయమని సరి కొత్త శాసనాన్ని చేయించుచున్నాను.

మంత్రులారా! జలయజ్నాలనీ, రధాల కర్మాగారాలనీ, అర్ధంకాని , అర్ధంలేని నగరాల పేర్లతోనూ, విదేశీ విహారయాత్రలతోనూ మీకు తోచిన ఏ రూపేణానైనా అందినంత వెనకేసుకోండి.

ప్రభుత్వాధికారులారా! సంవత్సరానికి 365 రోజుల చొప్పున, దినమునకు 24 గంటల పర్యంతం అనుక్షణం మేము ఇచ్చే , అర్హతలతో పనిలేని, నిభందనలకు విరుధ్ధమైనా, నియమాలకు నీళ్ళు వదిలి అయినా, మీరు కాలంతో పోటీపడుతూ మా ఆదేశాలకనుగుణంగా నేను ఇప్పటివరకు ఉదారంగా ప్రకటించిన అన్నింటికీ సత్వరమే మా అంగీకార పత్రాలను క్రొంగొత్త తాటాకులపై సిద్ధం చేసి తీసుకురండి.

నేనీ ప్రత్యక్ష ప్రసారమును వీక్షించుచున్న తొమ్మిది కోట్ల మహాజనుల సమక్షమున, ప్రింటు-ఎలక్ట్రానిక్-మొబైల్ చిత్రీకరణకు విచ్చేసిన వార్తాహర బృంద సభ్యుల మధ్యమున, సర్వధా సర్వధా శతధా సహస్రధా ఈ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, లంచగొండితనం లేకుండా ఈ ప్రభుత్వం ఉంటుంది అని భావించే పిచ్చి జనాల భావజాలాన్ని శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను.



విషయ సూచికలు :


34 వ్యాఖ్యలు:

chandu on Oct 10, 2007, 6:46:00 PM   said...

మన ప్రస్తుత రాజకీయాల గురించి బహు చక్కగా వర్ణించారు..
రచన లొ ఉన్న అంశం చాలా బగుంది. ఉన్న విషయాన్ని బాగా చెప్పారు.


srk on Oct 10, 2007, 9:36:00 PM   said...

మన ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మీ బ్లాగు చూసి మనసులొ ఎమి అనుకుంటారొ ఎమి అనాలనుకుంటారొ ఒక ఉహరూపము


అయ్యా

తెలుగు 'వాడీ' గారు

మీరు చేసిన సహయానికి ఎలా క్రుతజ్నతలు చెప్పుకొవాలొ తెలియడము లేదు. మేడం గారు కూడా మధ్యంతర ఎన్నికలు అనేసరికి మా వాల్లకి తొందరగ సంపాదించుకొండి అని ఎలా చెప్పాలొ అర్ధం కాక సతమతమయ్యను ఎందుకంట్టె కిలొ 2 రుపాయలు బియ్యం అన్న గారికి పని చెసినట్టు మనకి పనిచెస్థుందొ లెదొ తెలియదు కద, నెను మా వాల్లకి ఎది ఎల చెప్పాలని అనుకున్నానొ అలాగే మీరు ధుర్యోధనుని ఏకపాత్రాభినయం లో చెప్పెసారు అందుకు మికు క్రుతజ్నతలు. మీరు అట్లా మన వాల్లకి అందరికి అర్ధము అయ్యెటట్టు బాగా ప్రచారము చెయ్యండి మిమ్మలను బాగ గుర్థుంచుకుంటాము మేడం కి చెప్పి మీకు ఒక సీట్ ఇప్పించె ప్రయ్త్నం చెస్థను జై మేడం జై జై మేడం


రానారె on Oct 10, 2007, 11:57:00 PM   said...

మాస్టారూ అదరగొట్టేశారు !! ఎన్టీయార్ డైలాగుతో మొదలెట్టి, జూఎన్టీయార్ డైలాగుతో ముగింపువరకూ ఆద్యంతమూ కాంగ్రెస్ అస్తవ్యస్తతను ఎండగట్టారు. ఐతే రాజశేఖరుడు అర్జునిడిలా స్థితప్రజ్ఞతను, దుర్యోధనునిలా జలస్తంభనవిద్యనూ సాధించేసి అజేయుడైనాడు.


Unknown on Oct 11, 2007, 2:47:00 AM   said...

ఒక్కసారి అచ్చంగా అన్నగారే dailogue చెప్తున్నారా అన్నట్టుగా, ఆ ప్రాస ఎక్కడా తప్పకుండా చాలా బాగా రాశారు.

అందుకోండి మరి ఈ అన్నగారి అభిమాని అభినందనలు.


చదువరి on Oct 11, 2007, 4:56:00 AM   said...

ధణుతెగరగొట్టేసారు పొండి. ముఖ్యమంత్రి మనస్థితికి, ప్రస్తుత పరిస్థితికి భలే అతికినట్టు సరిపోయాయి, డైలాగులు.

"దానవీరశూరకర్ణ" విద్యా ప్రదర్శన అంకంలో దుర్యోధనుడి డైలాగులు మొత్తం బాగా అన్వయించారు. అసలు డైలాగులు మారుమోగాయి. ఎంతలా అంటే.. చదివేసాక, "పితుహూ" డైలాగు వినబడింది, చెవుల్లో!


Unknown on Oct 11, 2007, 5:33:00 AM   said...

ఏకపాత్రాభినయనం అదిరింది.కాంగ్రెస్ అస్తవ్యస్త పరిస్థితి అంతటిని,మూలాలతో సహా బహు చక్కగా ఎండగట్టారు.
-నేనుసైతం


Chowdary on Oct 11, 2007, 11:25:00 PM   said...

అందరికీ కృతజ్ఞతలు. ఈనాటి మీ వ్యాఖ్యానాల ప్రోత్సాహక చిరుచినుకులే, రేపటి నా అసంఖ్యాక జాబులకు ఉత్సాహాల విరిజల్లులు.

http://teluguvadini.blogspot.com


Ramani Rao on Oct 12, 2007, 4:16:00 AM   said...

తెలుగు "వాడి" గారు..

దుర్యోధనుడు.. కర్ణుడు.. శ్రీకృష్టునుడు అంటే రూపం లోను.. మాటలోను వెరసి ఏకపాత్రాభినయంలోను N T R కి N T R మాత్రమే ఇక ఎవరు పోటి రారు .. రాబోరు.. రాలేరు.. అని అందరూ అనుకొంటున్నవేళ మీ వాడి .. వేడి చూపించేసారండి.. ఎక్కడ ఆగకుండా.. ఒక ప్రవాహంలా సాగిపోయిన.. ఈ టపా చూస్తే అలనాటి పౌరాణిక చిత్రాలు చూస్తున్న అనుభూతి కలిగింది(ఇక్కడ హీ(జీ)రో రాజశేఖరుడనుకొండి)... అయినా మనలో మన మాట.. ఇంతటి వాక్చాతుర్యం మన ముఖ్యమంతులగారికెక్కడిదండి..దోచుకొనే చాతుర్యం తప్పితే..

నవ్వి నవ్వి కడుపునెప్పి వచ్చింది.. ఇలాగే ముందు ముందు మీ వేడి వాడి పదాలతో .. మరిన్ని హాస్య జల్లులు కురవాలని...


Anonymous on Oct 12, 2007, 4:38:00 AM   said...

ఏరులా పారు ఆ 'రాజ'ర్షుల పాలనలు మనము విచారించదగినవి కావు :)


kakatiya on Oct 16, 2007, 10:07:00 AM   said...

This comments are very good and it is very useful to people to know the present politics situation.
It is having comedy & jokes.
If NCB will sees this one,he will guarantly distribute pamplates of this copies to all in AP.


Chowdary on Oct 16, 2007, 6:31:00 PM   said...

కాకతీయ గారికి ...మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు మరియు అభినందనలు.

బాబు గారికి తెలిసినచో ఈ జాబును అందరికీ పంచుదురు.
రాజు గారికి తెలిసినచో నా బూజును పూర్తిగా వదిలించుదురు.

బాబు గారి అనుచరులతో నాపై ఎడతెరపని చప్పట్లు
రాజు గారి అనుచరులతో నాలో ఎముకలు విరిగిన చప్పుళ్ళు.

ఎడతెరపని చప్పట్లు కాదు ముద్దు.
ఎముకలు విరిగిన చప్పుళ్ళు అసలే వద్దు.

ఇప్పుడే మన రాకేశ్వరరావు గారు చెప్పినట్టు బ్లాగోకం బురదన్నారు-బ్లాగడం దురదన్నారు :-) ఇవే కాదు లేండి ఇంకా చాలా చెప్పారు...పూర్తిగా చడవటానికి ఆ లంకెను క్లిక్కండి.

కనుక ఏదో దురద పెట్టిననపుడు ఎక్కడో ఒకచోట గోక్కోని ఇలా జాబిస్తూ/బ్లాగిస్తూ ఉండిపోతానండి.


Anonymous on Nov 10, 2007, 11:57:00 AM   said...

మనం రాద్దాము అనుకున్న కామెంట్స్ అన్నీ(ముఖ్యంగా రమ గారి కామెంట్) ఇక్కడ మన కన్నా ముందే అందరు రాసేశారు కానీ ఇంత బాగా అసలు నిజంగా చెప్పాలి అంటే ఇంత వెరైటీ గా ... డైలాగులు పొల్లుపోకుండా, ప్రాస తప్పకుండా, మొదలు పెట్టిన దగ్గర నుంచి చివర వరకు అదే టెంపో మెయింటైన్ చెయ్యటం చూసినాక/చదివినాక రాయకుండా ఉండలేక ఈ కామెంట్ రాస్తున్నా...

ఈ బ్లాగ్ పోస్ట్ పూర్తిగా

కెవ్వు : కేక : సూపర్ : డూపర్ : చించేశారు

Finally THANKS to the Nandamuri Fans WebSite for posting this link there.


సూర్యుడు on Nov 18, 2007, 1:08:00 AM   said...

I did not realize this fact while I commented on one of your earlier posts that there is a link between this blog or blog author or whatever and a nandamuri fans stuff. Can't expect a better objective criticism than this anyway.

Looks like there are other people on this bloggers list who can listen to other unknown voices by reading this kind of stuff. Can't imagine how can we expect a better govts at AP.

Are we really educated? or at least think with our own heads, do we have heads and if we have, do we have brains in it, if we have it as well, did it drop the knee level, or to the toe ;)

Look at Karnataka, I don't when AP can reach that level, I am talking about people maturity levels.

As the saying goes, "Yadha Raja thatha Praja". Now in democracy, people are the Raja, now you can imagine why our govts are like that, because we are like that. How many of these honorable bloggers have never committed a single corrupt act in their life, however small it may be.

Chetha blogulatho visugetti na
Suryudu


తెలుగు'వాడి'ని on Nov 18, 2007, 9:03:00 PM   said...

@ Suryudu :

Just want to clarify one thing : This blog is (NO WAY ... NEVER EVER) neither connected to nor linked/related to Nandamuri Fans or for that matter to any such web sites so there is nothing for you to realize about this Blog.

There may be most/many/all of these honorable bloggers(or any/every one) might have done corruption (or encouraged by giving it) but it doesn't diminish the fact about what's going on in YSR's regime(it even applies to Babu or everywhere else too) in the last three+ years.

We all wish/hope/pray to get better Govts in AP and whether these so called Blogs/Bloggers will help to get there is, a different topic altogether but what I see from these blogs/posts is to deliver the happennings in AP via different channels/mediums/tranports, in which there is no harm done.

No comments on your comment about "educated? heads? It's position?' as I didn't understand the relevance to this post.


Bujji on Nov 27, 2007, 9:51:00 AM   said...

na bhootho na bhavashyathi "anna" reethilo undi.....telugulo entha vaadi undo vaadigaa vedigaa andinchaaru...andukondi maa abhinandanalu!!!!!

Kosamerupu entante ee agnaana prabhuthvam ivanni pogadthalu ani bhrama padi meeku sanmaanam chesinaa aacharyam ledu.


తెలుగు'వాడి'ని on Nov 27, 2007, 5:03:00 PM   said...

బుజ్జి గారు, కృతజ్ఞాతాభినందనలు మీ వ్యాఖ్యలకు. కానీ మీరు చెప్పిన సన్మానం నేను పైన మరొక కామెంట్ గానో లేక మీ బ్లాగ్ లోని మరో పోస్ట్ తెలుగువాడి ఆక్రోశం లో చెప్పినట్టుగా ఉంటుందేమోనని భయం.

మనకు ఈ సన్మానాలు, సత్కారాలు ఎందుకులేండి. ఏదో కొద్దిగా అవేశం, మరికొద్దిగా నవ్వుకుందామని తపన, ఆ పైన ముఖ్యంగా కొంత కాలానికైనా ఇవి పరిష్కారం చూపించే దిశగా మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయనే ఆశ, నమ్మకం.


రాధిక on Nov 28, 2007, 9:39:00 AM   said...

కెవ్వు : కేక : సూపర్ : డూపర్ : చించేశారు


Anonymous on Dec 2, 2007, 4:21:00 AM   said...

చాలా చక్కగా వ్రాసారు. నిజంగానే ఇప్పటి పరిస్థితులను చాలా బాగా అన్వయించారు. మీ నుండి మరిన్ని ఏకపాత్రాభినయాలు ఆశిస్తున్నాను.


RG on Aug 24, 2008, 2:52:00 AM   said...

మాష్టారు, టపా అదిరింది.
BTW, టెంప్లేట్ గ్లేర్ కొడుతునట్టుంది, మరీ ఇంత కాంట్రాస్ట్ ఉంటే చదవడం కష్టంగా ఉంది.


Anonymous on Aug 24, 2008, 11:20:00 PM   said...

Exellent simply superb
there no words to appriciate


Anonymous on Sep 7, 2008, 9:22:00 AM   said...

6 rs biyyam 2 rs icchina n t r anna ayitea
21 rs biyyam 2 rs ki istunna ysr antha kanna greatea kada


Anil Dasari on Sep 16, 2008, 5:19:00 PM   said...

హితుడా,

ఇప్పుడే చదివితిని. ఏవో సాంకేతిక రాతలు రాసుకునేవాడివని ఉపేక్షించి మీ బ్లాగుని ఇన్నాళ్లూ పూర్తిగా వీక్షించియుండలేదే. అయ్యారే .. ఇంతటి కళనీ సాంకేతికత మాటున దాచి అడవిగాచిన వెన్నెల జేతువేమయా?


Unknown on Sep 23, 2008, 5:45:00 AM   said...

కెవ్వు : కేక : సూపర్ : డూపర్ : చించేశారు


Anonymous on Sep 25, 2008, 2:58:00 PM   said...

This is a kamma's site, so it will always try to throw shit on reddy governement.

CBN never tried to implement rs 2 k.g. rice when he is in power, but this guy YSR is implementing them.

Now you kamma buggers try to find fault with ysr. thumbs down for you kammas


తెలుగు'వాడి'ని on Sep 26, 2008, 1:43:00 PM   said...

@ Anonymous (30) on Sep 25, 2008 2:58:00 PM : ఈ వ్యాఖ్యను ప్రచురించి ఈ బ్లాగ్ వాతావరణాన్ని సైతం తెలుగు ఫోరమ్స్ లాగా మార్చకూడదని అనుకున్నా మొదట ... కానీ నువ్వు ఒక రోజు తర్వాత కూడా అదే టపాకు వచ్చి చూసుకునేటప్పటికి ఇక ప్రచురించి నీకు సమాధానం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నా ....

America కు వచ్చి Apple లో ఉద్యోగం చేయటం తెలిసింది కానీ, కొద్దో గొప్పో అబ్బిన చదువు కానీ, అనువంశికంగా/జన్మతః వచ్చిన లేక తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం గాని నీకు 'A for Apple' స్థాయి దాటలేదని నీ వ్యాఖ్య చూస్తేనే తెలుస్తుంది. మరి ఎందుకు ఇక్కడ నా ప్రతిస్పందన అంటావా, నీ లాంటి మ.కొ, లు.వె లకి ఒక సారి గట్టిగా నాలుగు తగిలిద్దామని ... కుల ప్రస్తావన ఎందుకు నీకు, తింగరివేషాలు కాకపోతే ...

ఇంకొక సారి వ్యాఖ్య రాయటానికి ప్రయత్నించకు .. నేనూ ఎలాగూ పబ్లిష్ చేయను .... రెండందాలా (నీ వ్యాఖ్య .. దానికి నా ప్రతివ్యాఖ్య)దూల తీరిపోయిందిగా ఇక పనిచూడు....


పుల్లాయన on Oct 1, 2008, 11:35:00 PM   said...

బాగా రాసారు ఇప్పటి పరిస్థితి గురించి.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting