నవ్వితే నవ్వండి (మోడ్రన్ భక్తుని ప్రార్ధనకు ఆల్ట్రా-మోడ్రన్ దేముని వరం)

Posted by తెలుగు'వాడి'ని on Friday, October 12, 2007

బ్లాగు రాతలతో, బ్రౌజింగు చేతలతో విసుగు పుట్టిన వేళో లేక విరామం కోరుకున్న వేళో, మన లాంటి ఒక తెలుగువాడు హఠాత్తుగా దేముణ్ణి ప్రార్ధించడం మొదలు పెట్టాడు ....

దేముడా ... ఓ మంచి దేముడా !

ఆ రోజు విధినిర్వహణలో ఉన్న మన దేముడుంగారు టపటపా బ్రౌజరు ఓపెన్ చేసి వీడు ఏ మెస్సెంజరులో ఆన్-లైన్ ఉన్నాడో లేక ఏ సైటు లో దొరుకుతాడో వెదుకుతున్నాడు ఎందుకంటే వీడిని ఎలాగన్నా అడగబోయే కోరిక నుంచి డైవర్ట్ చేద్దామని లేదూ ఖచ్చితంగా ఇవ్వవలసి వస్తే ఇక్కడి నుంచే పని కానిచ్చేద్దామని... కానీ మన వాడు ఎక్కడా దొరకక పోయేటప్పటికి ఇదేదో కొంచెం సీరియస్ వ్యవహారమే అనుకొని మన గూగుల్ సెర్చ్ అల్గారిథం లాంటి ఒక మనోవేగపు వాహనంపై మన వాడు ఉన్న ప్రదేశానికి ప్రత్యక్షంగా వచ్చాడు ....

మన వాడు తెలుగువాడు కాకపోతే కిందకు దిగకుండా ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం అలోచించేవారే, కానీ మన వాడు దేముడు గారిని తడిమి చూసి, సవాలక్ష యక్షప్రశ్నలు వేసి సమాధానాలు సరిచూసుకొని గానీ వదిలి పెట్టడని ఆ దేముడి గారికి పూర్తిగా తెలుసు....

మనవాడి యక్షప్రశ్నల భయం ఒక వైపు, క్రిందకు వెళ్ళిన తరువాత ఎలా సంభోధించాలి, ఏమని మాట్లాడాలి అనే టెన్షన్ ఒక వైపు....కానీ వీటన్నిటి మధ్యలో ఒక పేద్ద ఆనందం ఏమిటి అంటే, ఇన్ని రోజులకి తను ఇష్టపడి కొనుక్కున్న ఐపాడ్, పాకెట్ పిసి, సెల్ ఫోన్, బ్లూటూత్ హెడ్/మైక్రో ఫోనులు, మోడ్రన్ డ్రస్ అన్నీ వేసుకొని చూసుకొని అందరికీ చూపించే అవకాశం వచ్చినందులకు (ప్రక్క వారు చూస్తే కుళ్ళుకుంటారనో, లేక నేను బయటకు తీసుకు వెళితే మర్చిపోయో, పారవేసి వస్తాననో మా భార్యామణి నేను పెట్టుకోవటానికి పడనివ్వలేదాయె ....

నిత్య బ్లాగరీ, అనునిత్య బ్రౌజరీ ! ఏమి నీ కోరిక?

పిలుపు క్రొత్తది, పలుకు పాతది ... క్రిందకు వచ్చే మార్గమధ్యంలో క్రొత్తగా వచ్చిన, తను చూసిన, మన యమదొంగ, యమగోల సినిమాలు గుర్తుకు వచ్చి మధ్యేమార్గంగా వెళితే మంచిది అని ఇలా డిసైడ్ అయిపోయారన్నమాట.


స్వామీ! నాకు తక్షణమే ఒక సంచి నిండా డబ్బులు, ఒక ఉద్యోగం, ఒక వాహనం మరియు దాని నిండా అమ్మాయిలను ప్రసాదించండి.


మన వాడి కోరిక విన్న దేముడిగారికి ఎంతకీ లోడ్ అవ్వని మనకు కావలసిన పేజీలా, చాల ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు హేంగ్ అయిపోయే కంప్యూటర్ లా, దిమ్మతిరిగి పోతూ ఉన్న సమయంలో, సునామీ లాంటి భయం ఒకటి మనసును, మదిని ఆవహించింది. అది, ఇంతకు మునుపు అయితే వరం ఇవ్వక పోతే, ఎర్రబడ్డ కళ్ళతోనో, కమండలంలోని నీళ్ళతోనో చాలా సింపుల్ గా ఒక జన్మకి సరిపోయే శాపంతో అయిపోయేది. తరువాత ఆవేశం తగ్గేదాకా ఉండో లేదంటే పైకి వెళ్ళి పెద్దాయనకి అసలు విషయం చెప్పి శాపవిమోచనా విధానం కనుక్కుని, వీలుంటే కొంత శిక్ష తగ్గించుకొనో లేక సూపర్ ఫాస్ట్ గా శాపం నుంచి బయటకు రావటమో జరిగిపోయేది. ఇప్పుడు అదేమిటో ఇంటర్నెట్ యుగమట ఒక్క సారి మన గురించి అందులో ఏమి వచ్చినా, వ్రాసినా, వ్రాయబడినా ఇక అంతే సంగతులట.....ఎన్నెన్ని జన్మలకయినా అది అలాగే ఉండునట....మంచి అయినచో అందరికీ సంతోషమే .. చెడు అయినచో కింకర్తవ్యము? మరలా ఆ పెద్దాయన నన్ను ఒక వైరస్ గా ఈ లోకంలోకి పంపించిననూ, మనకు గెలుపు మీద నమ్మకము లేదాయె ... అప్పుడంటే శత్రువు కళ్ళకెదురుగా కనిపించెను కనుక మనకు ఇచ్చి పంపించిన దివ్యశక్తులతో కొంచెము నాటకీయతను జోడించి సులభముగా గెలిచినాము అనే భావన రాకుండా జాగ్రత్త పడితిమి. ఎదురుగా యున్నది తెలుగువాడాయె, ఈ రోజులలో ఎక్కడ చూసిననూ వీరి పాండిత్యము అమోఘము...ఈ ఇంటర్నెట్ టెక్నాలజీయందు వీరితో మనము పోటీ పడజాలము కనుక ఈ భక్తునకు కోపము రాక మునుపే, కావలసినది ఇచ్చి, కుదరకపోతే ఎదో బురిడీ కొట్టించి ఇచ్చినట్లు నటించి తొందరగా మనము వెనుకకు వేగవలె. లేనిచో, వీడు నాకు జన్మజన్మలకై ఈ ఇంటర్నెట్ శాపమును ఒసంగిన నాకెవరు దిక్కు?

ఇవన్నీ మెదడులో, మనసులో సుడులు తిరుగుతున్న సమయంలో ఒక సారి మన వాడి వైపు కళ్ళు తిప్పి చూస్తే అప్పుడే వీడు పళ్ళు కొరకటం, కళ్ళు ఎర్రబడనీయటం కనపడనీయక మెల్లగా కంప్యూటర్ దగ్గరకు వెళ్ళే ఉద్దేశ్యం ఉన్నట్టు అనిపించగానే, మన దేముడు మనోనేత్రాన్ని విప్పి మన వాడి ఆలోచనలలోకి తొంగిచూసి, ఒక్కసారిగా భూనభూనోంతరాలు దద్దరిల్లిపోయేలా పొలికేక పెట్టి, వేనవేల సునామీల వేగంతో వెనువెంటనే మనవాడితో ..........

తధాస్తు నాయనా! నీ కోరికను మన్నించు చుంటిని. పూర్తి వివరములతో నీకు ఒక ఈ-టపా పంపించెదను.

అని దీవించి మనవాడి అలోచనలను కొద్దిగా డైవర్ట్ చేసి, మరికొద్దిగా శాంతింపజేశాను అని స్థిమిత పడిన తరువాత ఇందాకటి పొలికేకకు ఫ్లాష్ బాక్ లోకి వెళితే .... దేముడు గారికి కనపడిన మనవాడి మాస్టర్ ప్లాన్ ఏమిటి అంటే...

వీడు అప్పుడే దేముడు వరం ఇవ్వకపోవటం పై ఎన్ని బ్లాగులు రాయాలి (ఎప్పుడూ మనసుకు హత్తుకునే సున్నితమైన కవిత్వాలు వ్రాసే మా రాధిక అక్కకు, .... పుట్టిన రోజో మరి పెళ్ళి రోజో గుర్తుంచుకోలేదనో లేక బహుమతి కొనలేదనో నిన్ననే బావ గారి మీద బాగా కోపంతో ఉన్న జ్యోతక్కకు (ఇలా ప్రస్తావించినందులకు మనసు నొప్పించి ఉంటే క్షమించండి..నిన్ననే చదివాను, గుర్తు ఉంది అందుకే ఇలా వాడాను, ఇలాంటి వాళ్ళందరినీ కూడగట్టి, నా కేసును కొద్దిగా బాగా స్ట్రాంగుగా ప్రెజెంటు చేసి, ఎలాగైనా ఒప్పించి (కామన్ గా బావ గారి పేరు చెప్పి, దేముడి పేరు చెపితే చీపురు తిరగేస్తారు....బావగారి పేరు అయితే, లైటు దెబ్బలు, స్ట్రాంగ్ తిట్లతో సరిపెట్టచ్చు), ఛండప్రఛండమై, అక్షరాలలో అగ్నికీలలు కనిపించే, పదాలలో విష్ఫులింగాలు పలికించే కవితలో, జాబులో రాయించ గలిగితే దేవత గారి తరపు నుంచి సెంటిమెంటు కలిసి వస్తుంది...మహిళాలోకమంటే దేముడు గారికి భయం వేస్తుంది.) , ఏఏ బ్లాగు సైన్యాల సమూహాన్ని (చదువరి, కొత్తపాళీ, శోధన , విహారి, రానారె, ఒరెమూనా తదితరులు .. ఇప్పుడిప్పుడే బుడిబుడి నడకల తప్పటడుగులతో అడుగిడిన నాకు, తరచుగా తగిలిన పేరులు మాత్రమే ఉదహరించాను ... వీలు చిక్కినపుడు మరలా కొందరి పేరులు ఇక్కడ ప్రస్తావించెదను...అంతవరకూ క్షంతవ్యుడను) కూడ గట్టాలి, ఏఏ బ్లాగు కూడలి, జల్లెడ, తెలుగుబ్లాగర్స్ సైటులకి ఈ బ్లాగును, జాబులను జత చేయాలి, ముఖ్యంగా ఒక పదో-పదిహేనో స్పామ్ ఇంజన్లు పెట్టి ఆ దేముడు గారి ఈ-టపా వ్యవస్థను మొత్తాన్ని అతలాకుతలం చెయ్యాలనీ, అన్నిటికన్నా ముఖ్యంగా నలుగురైదుగురు హాకర్లను పెట్టి, ఆ దేవత గారు ప్రతి రోజూ చదివే పోసుకోలు కబుర్ల, సౌందర్యాలంకరణ, నగలు-చీరల, కూరలు-పిండివంటల, అనునిత్యం వీక్షించే ఐ.పి.టి.వి తెలుగు సినిమాల,సీరియల్స్ సైటులపై సంపూర్తిగా దాడి చేసి, ఆ సైటుల్లోని ఏ పేజీలలోకి వెళ్ళినా మన దేముడి గారి మార్ఫింగ్ చేసిన బొమ్మలు-రాతలతో నింపిన పేజీలు చూపించే విధంగా ప్లాన్ చేసినట్లుగా కనపడినది. (దేవత గారి ముందు పాయింటు వరకు ఒట్టి పొలికేక, దేవత గారి తరువాత పాయింటుతో పెద్ద సునామీ ).

మనవాడు వరమును పొందిన ఆనందంలో అమిత సంతోషుడై(మన దేముడి గారి గురించి అప్పుడే పూర్తిగా మర్చి పోయిన వాడై), యధావిధి తన కొత్త జాబు రూపకల్పనలో నిమగ్నమై, చిరుదరహాసంతో టైపుతున్న వేళ, మన దేముడు గారు ఆ చిరుదరహాసాన్ని గమనించిన వారై, ఏదో సంశయం మనసుని పట్టి పీడించుచున్నందువలన, ఇప్పటి దాకా భూలోకంలో ఉన్న ప్రభావమున, అలవాటులో పొరపాటుగా మనవాడి భుజం మీదుగా కంప్యూటర్ లోకి తొంగి చూస్తే అప్పటి దాకా మనవాడు టైపినది చూసి మరొక్క సారి ఢమాల్, ఢమాల్...ఇటు దేముడి గారి డంగు అటు తనకు ఈ-టపా వచ్చిన ట్రింగు ... మనవాడు, ఎంత అయినా తెలుగువాడు కదా, ముందు ప్రాధాన్యం దేముడు గారికే ఇచ్చి ఆయనను నీళ్ళు కొట్టి లేపి, వాహనమును సిధ్ధము చేసి పైకి సాగనంపెను.

ఇప్పటి ఢమాల్ కు మరలా ఫ్లాష్ బాక్ లోకి వెలితే .... మన దేముడి గారికి మనవాడి కొత్త జాబులో కనిపించింది ఏమిటి అంటే .....

టైటిలు : దేముడి నుంచి వరం పొందటం ఎలా - సింపుల్ చిట్కా !!!

తోటి బ్లాగర్లూ! మీరు దేముడిని ప్రార్ధించడం, తను క్రిందకు దిగి రావడం, మీరు వరం అడగటం, ఆయన సీరియస్సుగా ఆలోచిస్తున్నట్లు భంగిమలో ఉండటం, మీలో సహనం నశించి, ఆవేశం పెరిగి పోతూ ఉండటం....ఇంతవరకు చాలా రొటీను...ఇది మీకు అందరకూ తెలిసిందే.....కానీ ఇక్కడే ఉంది అసలు చిట్కా ... ఇదే సమయంలో మన దేముడు గారు తన మనోనేత్రం తెరవబోతారు...అదే సమయంలో మీరు మీ ఆలోచనల రంగులరాట్నాన్ని తిప్పండి .... అంతే మనం కోరుకున్న వరం మనకు సొంతం ...

పాపం మన దేముడు గారు మన రాజకీయ నాయకులను చూసి నేనూ అలాంటి వాడినే అని భ్రమపడి నా మాస్టర్ ప్లాన్ అంతా నిజమే అని భయపడి వరం ప్రసాదించారు. కానీ తనకు తెలియని నిజం ఏమిటి అంటే, మనది తెలుగు బ్లాగర్ల రక్తం...రాజకీయం కాని స్వఛ్చమైన తెలుగు రక్తం...మనం ఎప్పుడూ అలాంటి మాస్టర్ ప్లానుల జోలికి వెళ్ళము ఒక వేళ వరం ఇవ్వకపోయినా....మరొక ప్రయత్నానికి ఆయత్తం అవటం తప్ప....ఆ మాస్టర్ ప్లాన్ అంతా ఉత్తిత్తిదే.....

ఇంతలో దేముడు గారు వెళుతూ, వెళుతూ ఇందాక వరమొచ్చినపుడు నా పెదవులపై కనిపించిన అదే చిరుదరహాసంతో టా-టా, బై-బై చెపుతూ హాయిగా, ప్రశాంతంగా పైకి వెళుతుంటే, ఎందుకో ఒక చిన్న సందేహం మది పొరలలో....అంతే సవాలక్ష సందేహాలతో, శతకోటి భయాలతో, పట్టుతప్పి పోతున్న చేతులతో ఎలాగో కష్టపడి ఇంతకు ముందు దేముడి గారి నుంచి వచ్చిన ట్రింగు ఈ-టపా ను ఓపెన్ చేసి చూస్తే ... ఇందాకటి పొలికేక, సునామీలను కొన్ని వందల, వేల, లక్షల, కోట్లతో వెచ్చించిననూ సరిపోదేమో ...

దేముడి వద్ద నుంచి వచ్చిన ఈ-టపా :

నే నొసంగిన వరప్రసాద ఫలితము : నీకు తక్షణమే మన ఏ.పి.యస్.ఆర్.టి.సి లో, మహిళలకు ప్రత్యేకము అన్న బస్సులో కండక్టరు ఉద్యోగం లభించుట.

భక్తా ! అప్పుడే అయిపొలేదు నాయనా ఈ ఈ-టపా ... కొంచెం కష్టపడి ఎడమ చేతితో వణుకుతున్న కుడిచేతిని గట్టిగా పట్టుకొని మూషికము సహాయమున నేర్పుగా బాగా క్రిందకు వెళ్ళుము.

అలా వెళ్ళగా, వెళ్ళగా, మరలా వెళ్ళగా, ఇంకా వెళ్ళగా కనిపించిన చివరి వాక్యాలు :

మీరే కాదు నాయనలారా! నేను కూడా వికీపెడియా, గూగుల్ సెర్చ్ మరియు అన్ని తెలుగు బ్లాగులు అను నిత్యం చదువుతూ మా విజ్ఞాన సంపదను అభివృధ్ధి చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే మీలాంటి వారికి ఇలాంటి విరుగుడు కనిపెట్ట వలసి వస్తుందని ... ముందు జాగ్రత్త!విషయ సూచికలు :


3 వ్యాఖ్యలు:

తెలుగు బ్లాగాభిమాని on Oct 12, 2007, 7:44:00 PM   said...

ఇరగదీశారండి. నిజంగా నవ్వులే నవ్వులు. దేముడు గారి ఈ-టపా చదివిన తరువాత, ఒకసారి మన తెలుగు సహొదరుని ముఖకవళికలు తలచుకుంటే పొట్టచెక్కలయ్యేలా నవ్వు వస్తుంది. దయచేసి మమ్ములను ఇలాగే నవ్విస్తూ ఉండండి.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting