విహారి గారు వ్రాసిన - 'మీ టపా హిట్టా-ఫట్టా' పై ఓ విశ్లేషణ

Posted by తెలుగు'వాడి'ని on Saturday, October 13, 2007

నా ఈ విశ్లేషణకు ముఖ్య కారణం, ఈ మధ్య తరచుగా మన తెలుగు బ్లాగు/జాబు/వ్యాఖ్యలలో అసలు ఈ బ్లాగులు ఏర్పడిన ఉద్దేశ్యం ఏమిటి అనేది మరచి పోయి మెల్లమెల్లగా ప్రక్కదారి పడుతున్నామేమో అనే బాధ అంతే.

ఇదే (విహారి గారు వ్రాసిన - 'మీ టపా హిట్టా-ఫట్టా) అంశంపై మన cbrao గారు కొంచెం వివరణతో, మరి కొంచెం విశ్లేషణతో, ఇంకొంచెం సూచనలతో, వెరసి జాబు ప్రయోజనమేమిటో, ఇప్పటికే ఒక జాబును (
హిట్ల కోసం టపాలు )ప్రచురించి ఉన్నారు.

Definition and/or primary purpose of the Blog, just as a recap :

*** Short for Web log, a blog is a Web page that serves as a publicly accessible personal journal for an individual. Typically updated daily, blogs often reflect the personality of the author.

*** A BLOG is a publication of personal thoughts, experiences, and web links. It is updated frequently and is usually a mixture of what is happening in a person's life and what is happening on the web or in the media.

*** A blog is a personal diary. A daily pulpit. A collaborative space. A political soapbox. A breaking-news outlet. A collection of links. Your own private thoughts. Memos to the world.

The best one ...

*** The heart and soul of blogging is the individual and/or the group of individuals opining on the fly and responding post-haste to one and all.

ఇక మనం విషయంలోకి వెళితే, విహారి గారు బ్లాగు/జాబుల్లోని రకాలను ఒక షడ్రుచుల భోజనం గా వండి-వడ్డించి, జాబులకు వచ్చే హిట్లను, వ్యాఖ్యల సంఖ్యను బట్టి ఆ బ్లాగు/జాబు హిట్టా-ఫట్టా అని చెప్ప చూడటం, తినబోయే ముందు, తరువాత పచ్చి కాకరగాయ ముక్కను నోటికి అందించినట్లుగా ఉంది.

ఇంతకు మునుపు దొంగ హిట్లు సృష్టించి Google AdSense ను ముంచివేసిన దాఖలాలు మనకు చాలా తెలుసు. కానీ ఇప్పుడు పైత్యం ప్రకోపించి, మన బ్లాగ్ప్రంచంలోకి వ్యాఖ్యలు అమ్మే sites వచ్హాయి. ఇలాంటి వాటి ద్వారా వారు ఇప్పటికే బ్లాగోద్దేశ్యపు లక్ష్మణ రేఖను దాటినట్టే ... కనీసం మన తెలుగు బ్లాగ్ప్రంచపు సభ్యులకైనా, మరీ ఎక్కువగా ఈ హిట్లు-వ్యాఖ్యలు-వ్యాఖ్యల సంఖ్యలు గురించి ఆలోచనలు రానీయకుండా, బ్లాగోద్దేశ్యాన్ని కాపాడాలనే నా ఈ ప్రయత్నం (ఒక్క విహారి గారి జాబు, లేక ఇలాంటి జాబుల వలన, నిజంగా మనం వెనువెంటనే అటువైపు దూకేస్తామనో, లేక దూకేసేలా ప్రోత్సహిత్సాయనో చెప్పడం నా ఉద్దేశ్యం కాదు సుమా) ....

నా దృష్టిలో ఒక జాబు ఎలా ఉండాలీ అంటే, మనం వ్యక్తపరచిన భావం కనీసం ఒక్కరితోనైనా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వగలిగితే, ఆ బ్లాగు అజరామరం...వ్రాసిన బ్లాగరి ఉద్దేశ్యం పరిపూర్ణం...అతని జీవితం ధన్యం.

మచ్చుకి కొన్ని అజరామర జాబులు :

చదువరి గారి - ట్రాఫిక్కబుర్లు

ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించ దలచాను ఈ జాబు గురించి ....

1. ఈ జాబు చదివిన తరువాత మనం ఎప్పుడైనా ట్రాఫిక్ లో ఇరుక్కు పొయినపుడు ఈ జాబులోని ఏదో ఒకటి మన కళ్ళ ముందు జరుగుతుంటే ఖచ్చితంగా ఈ జాబు గుర్తుకు వచ్చి ఒక చిన్న దరహసం మన పెదవులపై కదలాడుతుందే అదే ఈ జాబుకు విజయ సంకేతం ...

2. అలాగే ఈ జాబు చదువుచున్నపుడు ఒకనాడు మనకు జరిగిన ఇలాంటి అనుభవాలు గుర్తుకు వచ్చి, ఆ చదువుచున్న కొద్ది నిముషాలు నవ్వించ గలిగితే(కామెంట్ రాయక పోయినా), లేక ఈ జాబు ప్రేరణతో వారి వారి బ్లాగులలో ఒక కొత్త జాబు రాయటమో జరిగితే అదే ఈ జాబుకు విజయ సంకేతం ...

జ్యోతి గారి - పెళ్ళైన వారికి మాత్రమే

ఈ జాబుకి వచ్చిన వ్యాఖ్యలలో, నిజాయితీగా జాన్ హైడ్ కనుమూరి-చాణుక్య జివి గార్లు, ఒకరు గుర్తుకు వచ్చింది అని, మరొకరు కనువిప్పు కలిగింది అని ఒప్పుకున్నారు...ఈ రెండు చాలు ఈ జాబోద్దేశ్యపు లక్ష్యం నెరవేరింది అని, అదే ఈ జాబు విజయ సంకేతం అని చెప్ప టానికి.

అలాగే ఒక కామెంటు ఇప్పుడు రా(య)కపోయినా, ఏ ఒక్క ఇల్లాలు అయినా మనసులో జ్యోతి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటే ..అటు పిమ్మట (హఠాత్తుగా తన భర్త గుర్తు పెట్టుకొని బహుమతి, పూలు, పళ్ళు తీసుకు వెళితే, ఈయన గారు చెప్పక పొయినా, సాధించి అయినా భార్యలు తెలుసుకుంటారు మన జ్యోతి గారి జాబు గురించి)ఈ జాబుకి వచ్చే వ్యాఖ్య అయినా లేక జ్యోతి గారికి వచ్చే ఈ-టపా అయినా చాలు ఈ జాబు విజయ సంకేతం అని చెప్ప టానికి.

రెండు రెళ్ళు ఆరు గారి - నేను - బినీతా - చంద్రబాబు రెడ్డి , బరువు - బాధ్యత

...................

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ "జెస్ట్ రిలాక్స్" (ఫోటో గ్యాలరీ) లింకు చూస్తే, క్లిక్కకుండా మనం ఉండలేం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సైటులకు ఎక్కువ హిట్లు రావచ్చు...కానీ వెళ్ళిన వారిలో 97 శాతం మంది అక్కడ ఉన్న పాతచింతకాయ లాంటి ఫొటోలు చూసి (మొదటి ఫొటో తప్ప) తిట్టుకోవటమో లేక వెంటనే బ్రౌజరు మూయటమో చేస్తారు...(కానీ అప్పటికే ఒక హిట్టు సంఖ్య పెరిగింది)...మిగిలిన ఒక శాతం మంది ఇంకొక సారి చూశాము అన్న ఆనందం...ఇంకా ఒక శాతం మంది ఆ కొత్తదైన మొదటి ఫొటో చూశామన్న ఆనందం....మిగిలిన ఒక శాతం మంది ఆ ఫొటోలన్నీ మొదటి సారి చూశామన్న ఆనందం.....

ఇప్పుడు చెప్పండి .. ఆ పైన ఉన్న లింకు కలిగిన జాబు హిట్టా? కానే కాదు. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు అసలు బ్లాగొద్దేశ్యం ఇది(హిట్లు, కామెంట్లు జనరేట్ చేయటం)కాదు కాబట్టి. అదే ఇది ఒక రెగ్యులర్ వెబ్ సైటు అయితే సూపర్ హిట్ అనాలి అంత క్యాచీ టైటిలు పెట్టినందుకు ..

బ్లాగటం మొదలు పెట్టిన తొలినాళ్ళలో వచ్చే హిట్టుల-వ్యాఖ్యల గురించి కొంత ఉత్సుకతను చూపటంలో తప్పులేదు ఎందుకంటే అవి మనం వ్రాసేవి కూడా చదివేవాళ్ళు ఉన్నారు అన్న ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఎంత అయినా మానవమాతృలం గదా!

కానీ ఇలా వచ్చే హిట్టుల సంఖ్యను బట్టి మీ జాబు హిట్టా-ఫట్టా అని అందులో 150+ హిట్టులు వస్తే సూపర్ హిట్ అనీ, 100-150 వస్తే హిట్ అనీ అలా అలా ఇంకా ఏవేవో వ్రాసే జాబులు ఇప్పటి దాక బ్లాగర్లలో లేని ఆలోచనలను కలిగించటం వలన వచ్చే లాభాల కన్నా, నష్టాలే ఎక్కువ.

కనుక నా విజ్ఞప్తి ఒక్కటే ... హిట్లు రాలేదనో, వ్యాఖ్యలు లేవనో ... లేక మీ బ్లాగు ఫ్లాపు అని ఎవరన్నా చెప్పారనో అర్ధం-పర్ధం లేని అలోచనలతో నిరుత్సాహం తెచ్చుకోకండి....బ్లాగటం ఆపకండి.

బ్లాగు పరమోద్దేశ్యాలివే :

ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడో, చదివినప్పుడో వెనువెంటనే మీకు కలిగే స్పందనకు యధాతధపు...

మీ బ్రతుకు పుస్తకం లోని మధుర స్మృతుల, తీపి జ్ఞాపకాల, అనుభవాల దొంతరల పుటలకు, అందులోని పేజీలకు...

మీ అభిరుచులు, ఇష్టాయిష్టాలు, ఆశలు, ఆశయాలు, ఊహలు, ఊసులు, బాసలకు...

అవనీ-ఇవనీ ఒకటని ఏమిటి, దేనిమీదైనా, వేటిమేదైనా మీరు పంచుకోదలచిన వాటికి...


                     అక్షరరూపం.

ఇవన్నీ మీ అందరికీ నాకన్నా ఎక్కువగా తెలిసినా ఇక్కడ ప్రస్తావించటానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే....

కర్ణాటక సాహిత్యం పైనో, కధాకళి నృత్యం పైనో బ్లాగు వ్రాస్తే హిట్లు-వ్యాఖ్యలు రాలేదనో, ఇలాంటి విచిత్రమైన వివరణలతో సింపుల్ గా ఫ్లాప్ అని మనంతట మనలనే నిర్ధారించుకొనమని, ఫ్లాప్ కనుక వెంటనే ఇంకొక జాబు రాయుటకు ఉపక్రమించటం ఉత్తమమని సూత్రీకరించడమే అసమంజసం. అలాకాక మీరు చెప్పదలచుకున్నది చెప్పారు...జనాలు చదివారా, హిట్లు-వ్యాఖ్యలు వచ్చాయా అన్నది పట్టించుకోక మీరు తదుపరి జాబు రాయుటకు ఉపక్రమించటం ఉత్తమమని చెప్పి ఉంటే చాలా బాగుండేది.

ముగింపుగా నేను చెప్పేది ఒకటే ....

మీరు చెప్పదలచుకున్న దానికి, పంచుకోదలచిన వాటికి ఒక అక్షరరూపం ఇచ్చారు... జనాలు చదివారా, హిట్లు-వ్యాఖ్యలు వచ్చాయా అన్నది పట్టించుకోక ముందుకు సాగండి... బ్లాగులు సృష్టించండి ... జాబులు లిఖించండి.

ఎన్ని రాశాము అన్నది ముఖ్యం కాదు .... కనీసం ఒక్క సారైనా మీ జాబులోని విషయం మరొకరితో ఎమోషనల్ గా కనెక్ట్ కాగలిగితే మీ బ్లాగు-జాబు అజరామరం. ఒకవేల అలా కనెక్ట్ కాకపోయినా, ఎల్లప్పుడూ మీ మదిలో కదలాడుతున్న బ్లాగోద్దేశ్యానికి మీరిచ్చిన అక్షర రూపం మీరు చూసుకున్న, చదివిన క్షణాన మీ కళ్ళల్లో కనిపించే, మోములో వికసించే వెలుగులు, మీ పెదవులపై పలికే చిరునగవులు అమృతతుల్యమైనవి ... వెలకట్టలేనివి ....

అవే చాలు, రాని హిట్లు-వ్యాఖ్యల నిరాశలు అనబడే, బంధు-మిత్ర-హిత-సన్నిహితులను చంపలేననే అర్జునుడైన మీకు మీ బ్లాగ్ప్రపంచపు మహాభారత సంగ్రామంలో తదుపరి పదనిర్ధేశానికి కర్తవ్య భోధన చేసే భగవద్గీత లోని కృష్ణోపదేశం లాంటివి.



విషయ సూచికలు :


15 వ్యాఖ్యలు:

Anil Atluri on Oct 14, 2007, 12:02:00 AM   said...

విహారి గారి బ్లాగు "హిట్టు" ఒక లాంగ్ అండ్ లెందీ కామిడి కామెంట్ కాదా?


Anonymous on Oct 14, 2007, 12:43:00 PM   said...

నేను మీతో ఏకీభవిస్తున్నాను. దురదృష్టవశాత్తు, అవును కాదనుకున్నా ప్రపంచం అంతా నెంబర్ వన్, నెంబర్ టూ లతో మునిగిపోయింది. కాబట్టి, విహారి కాకపోతే మరొకరు ఈ పోటీ తత్వాన్ని తీసుకొచ్చేవాళ్ళే. విహారి హాస్యానికే చెప్పినా, అందులో గులాబీల మధ్యలో ముళ్ళవంటివి లేకపోలేదు. కర్మయోగులకైతే, అవేమీ పట్టవు. కానీ (అ)కర్మయోగుల్లో కొందరికి ఈలాటి టపాలు తప్పక గుచ్చుకుంటాయి సూదుల్లాగా. నా వరకు నాకు ఆ కర్మయోగ స్థితి రాలేదు. అలాగని గుచ్చుకోనూ లేదు. ఆయా సంఖ్యల తాలూకు బాణాలు నాకు వర్తించలేదన్న సంతోషమా? ఏమో అయుండొచ్చు. ఏమైనా, అంత లోతుగా విశ్లేషించకపోతేనే బాగుండేదేమో!
అనవసరముగా కొందరు బాధపడి, మంచిగా రాసాడు ఈయన అనుకున్నా మెచ్చుకోలేని స్థితులు వంటివి ఇంకా పెరుగుతాయేమో, వీటివల్ల అని నా కనిపిస్తోంది.


ramya on Oct 14, 2007, 4:46:00 PM   said...

లక్షల విలువైన అక్షరాలు


Unknown on Oct 14, 2007, 9:31:00 PM   said...

అయ్యా విహారిగారు ఒక వ్యాఖ్యా రాకపోయినా హిట్టనదగే సమాంతర టపాల గురించి కూడా చెప్పారు కదా. రానారె, వెంకట్, కొత్తపాళీ, పప్పు నాగరాజు గార్లు రాసిన అనేక టపాలు ఈ సమాంతర టపాల కింద వస్తాయి.
గుచ్చుకునే కర్మయోగులు, ఇంకేం కర్మయోగులు??
బ్లాగ్యవ్వనంలో పరిగెత్తి పాలుతాగే బ్లాగర్లను చూసి బ్లాగ్ ఉద్దండులు బాధపడనేల. (ఏ వయసులో ముచ్చట్ట్లు ఆ వయసులో..)
మీ టపా కొ.పా గారన్నట్టు చాలా ఆలోచనాత్మకంగా ఉంది. మీకు తెలియనివి కావు గుర్తుచేస్తున్నా అని మీరు గుర్తుచేసిన అంశాలు బాగున్నాయి. చాలా విషయాలు అందరికీ తెలుసు. గుర్తు చేస్తుండటమే మనం చెయ్యాల్సిన పని.


Anonymous on Oct 15, 2007, 9:45:00 PM   said...

ఈ టపా చదివేసరికి నేనెలాంటి వ్యాఖ్య రాయాలనుకున్నానో, దాన్ని కొత్తపాళీ గారు రాసేసారు.
మీరు వ్రాసినవి ఆలోచించాల్సిన విషయాలే.


Chowdary on Oct 15, 2007, 11:26:00 PM   said...

అందరికీ కృతజ్ఞతలు.

ఇక్కడ గుచ్చుకోవటమో, బాధపడటమో అన్నది అసలు సమస్యగా భావించి నేను ఇది వ్రాయలేదండి. ఇప్పటికే వ్యాఖ్యలు తన పరిధి దాటి వ్యక్తిగతంలోకి జొరబడి కొందరిని నొప్పించాయని, ఈ బ్లాగులు వ్రాయటంపై (తాత్కాలికంగానైనా)ఉత్సాహాన్ని చంపివేశాయని చదివి, మరలా ఈ హిట్లు-ఫట్లు లాంటివి వాటికి జతకాకూడదనే ఉద్దేశ్యమే నా ఈ విశ్లేషణకి అసలు కారణం.

ఇప్పుడే ఊకదంపుడు గారిచే ప్రచురించబడిన 'మీ టపా టపాకట్టిందా?' అనే జాబులో నుంచి కొత్తగా చదివిన రాకేశ్వర రావు గారి ' బ్లాగ్విజయానికి పది ఉపాయాలు' లా, విహారి గారు సినిమా/హీరోల మాధ్యమంగా వ్రాసిన 'మీ టపా హిట్టా-ఫట్టా ' కూడా, బ్లాగు/జాబుల్లోని రకాలతో ఆగి, హిట్టా-ఫట్టా అని లేకుండా ఉంటే ఇంకా బాగుండేదనేదే నా ఉద్దేశ్యం.


నా కథలు...... on Oct 16, 2007, 4:47:00 AM   said...

మీ బ్లాగు బాగుంది.కొంచం కామిడిగా ఉంది.మీరు చెప్పినది అక్షర సత్యం కాని మనం ఏమీ చెయ్యలేము.ఒక వేళ మనం ఏమన్నా చేద్దం అంటె ఏవరు మనకి సహకరించక పోగ మనల్ని చూసి విరగపడి నవ్వుతారు.ఈ సమాజాన్ని ఏవ్వరూ మర్చలేరు.మనం చెయ్యవలసిందల్లా మనం సరిగ్గా ఉండడం.అంతకు మించి మనం ఏమి చెయ్యలేము.నేను కూడ ఈ మధ్య ఒక బ్లాగు రాశాను.తీరిక చూసుకొని చదవగలరని ప్రార్ధన.


నా కథలు...... on Oct 16, 2007, 4:48:00 AM   said...

మీ బ్లాగు బాగుంది.కొంచం కామిడిగా ఉంది.మీరు చెప్పినది అక్షర సత్యం కాని మనం ఏమీ చెయ్యలేము.ఒక వేళ మనం ఏమన్నా చేద్దం అంటె ఏవరు మనకి సహకరించక పోగ మనల్ని చూసి విరగపడి నవ్వుతారు.ఈ సమాజాన్ని ఏవ్వరూ మర్చలేరు.మనం చెయ్యవలసిందల్లా మనం సరిగ్గా ఉండడం.అంతకు మించి మనం ఏమి చెయ్యలేము.నేను కూడ ఈ మధ్య ఒక బ్లాగు రాశాను.తీరిక చూసుకొని చదవగలరని ప్రార్ధన.


Anonymous on Oct 16, 2007, 7:23:00 AM   said...

మీ టపా, విహారి గారి టపా రెండూ బావున్నాయి.

వ్యక్తిగత వ్యాఖ్యలవల్ల టపాలు రాయడం నుండి తాత్కాలికంగా break తీసుకోవడం గురించి మీరు స్పందిస్తున్నారని తెలిసి నేను భుజాలు తడుముకుంటున్నాను:-) నా బ్లాగులో నేను ప్రస్తావించిన వ్యాఖ్యలకీ, ఆ వ్యాఖ్యలు రాసిన వారికీను, విహారి గారికీ వారి టపాకీనూ పొంతనే లేదండి.

మీ ఆలోచనలు, దీప్తి ధారలో రావు గారి ఆలోచనలు, "హిట్ట ఫట్టా" లాంటి ఆలోచనలూ, మన బ్లాగరలందరిలోను మెదిలేవే. తెలుగువీర గారి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తున్నాను.


Unknown on Oct 16, 2007, 8:40:00 AM   said...

ఈ హిట్ల గురించి ఎప్పుడు చర్చ వచ్చినా నాకు కలుక్కుమంటూనే ఉంటుంది.
వీటికెవరూ అతీతం కాదు కానీ దీనిని ముఖ్య విషయం చేయడం తగ్గాలి.


Anonymous on Oct 16, 2007, 11:39:00 AM   said...

అయ్యా తెలుగు వాడి గారు,

నేను ఉదహరించింది కేవలం వినోదం కోసమే. అందులో ప్రస్తావించిన వాటి లో కొంత నిజం లేక పోలేదు. అయినా దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకునే స్కూలు పిల్లల స్థాయిలో లేరని నా ఉద్ధేశ్యం. నేను సహజంగా చర్చకు దారి తీసే టపాలు రాయను. నాకున్న సమయంలో వాటికి సరైన సమయంలో స్పందించే ఓపికా నాకు లేదు. అలాగే నేను రాసే వ్యాఖ్యలు కూడా చాలా తక్కువ గానే వుంటాయి. నా బ్లాగును నిశితంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది నేను దేన్నీ సీరియస్ గా తీసుకోనని. ముందుగా స్పందిస్తే ఆవేశం అవుతుందని కూల్ ఆఫ్ పీరియెడ్ గా రెండు రోజులు సమయం తీసుకొని మరీ స్పందిస్తున్నాను. ఇది కూడ ఒక టపాలాగా నా బ్లాగులో రాసుకోవచ్చు. ఇందుకోసం నా నైజాన్ని మార్చుకోలేను.

కానీ మీరు రాసిన నాలుగో టపాకే పని గట్టుకుని మరీ నా టపాలను ఇతర టపాలతో పోల్చడం నిర్మాణాత్మకంగా కనిపించడం లేదు. నేను రాసిన వందకు పైగా టపాలలో ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా ఉద్ధేశించి ఇలా ఉండాలి అలా వుండాలి అని ఎవ్వరికీ చెప్ప లేదు. మీరు పేర్కొన్న నా టపాలో 14 కామెంట్లలో కూడా ఎవ్వరూ అది సీరియెస్ అని చెప్పలేదు. అంత మాత్రాన అది అందరి ఆమోద ముద్ర పడిందని అర్థం కాదు. బహుశా అది నచ్చని వారు ఒక కామెంటు కూడా వ్రాయక పోయుండచ్చు. వీలయితే భవిష్యత్తులో నా బ్లాగును ఇష్టపడకపోవచ్చు. అలాగే మీరు చెప్పిన దాంట్లో అంతా నిజమే అని అందరూ ఒప్పుకున్నట్లు కాదు.

హిట్లు అన్నవి ఎంత మంది ఎన్ని సార్లు తమ టపాలలో రాసుకోలేదు. ఒక్కో సారి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పుకుంటారు. "హిట్ల కోసం టపా" అన్న సి.బి. రావు గారు కూడా తమ హిట్లు గురించి చెప్పుకున్నారు గతంలో. అంత మాత్రం చేత తక్కువస్తున్నాయనే న్యూన్యతా భావంతో ఎవరూ కుంగి పోరని నేననుకుంటున్నాను.

తెలుగు వీర గారు స్పష్టంగా చెప్పారు. నేనూ అదే చెప్తున్నా ఎవరైనా దీన్ని సీరియస్ గా తీసుకుంటారనుకుంటే అందులో కాఫీ లాంటి టపాలు, టోఫూ లాంటి టపాలు అని చెప్పాను. అవన్నీ ఇందులోకే వస్తాయి. మీరు పైన చెప్పినవి నాకు కూడా నచ్చాయి. అయినా మీకు నచ్చినంత మాత్రాన అవి అందరికీ నచ్చాలని రూలేమీ లేదు కదా. మీరు చెప్పిన వన్నీ బాగా పాపులర్ అయినవి. నేను రాసిన టపాను వీటి పక్కన పెట్టి సరి పోల్చ చూడడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. రాకేశ్వరుడు రాసిన పది ఉపాయాలు నేనయితే చాలా సరదాగా తీసుకున్నా. అది కొంత మందికి నచ్చలేదు. నేను రాసిన దాన్ని చూసి బ్లాగర్లు పారిపోతారనే అపోహకు రావడం అనవసరం. ఈ బ్లాగుల కోసం ఎవరి పరిధిలో వారు చెయ్యాల్సిన కృషి చేస్తున్నారు. వారి ప్రత్యేకతల్లో వారు వున్నారు. ఇక్కడ నేం డ్రాపింగ్ అనవసరం.

నేను రాసేటటు వంటివి నచ్చకపోతే నా బ్లాగు ఆదరణ తగ్గిపోతుంది. ఇదేమీ సినిమా రంగం కాదు ఎవళ్ళో ఒకళ్ళ సపోర్టుతో ఆదరణ పొందటానికి.హిట్ల కోసమే అనుకుంటే నాకు తెలిసిన రూమర్లు ఎన్నో ఇందులో వదలచ్చు.

కావున దయచేసి మీరు రాసే టపా ఏదైనా వుంటే అది కొత్తగా వస్తున్న బ్లాగర్లెవరన్నా వుంటే వారిని ఉత్సాహ పరచేటట్లు రాయండి. ఏ టపా రాస్తే ఎవరు ఎలా స్పందిస్తారో అన్న సందిగ్దాన్ని మొదలు పెట్టనివ్వకండి.

వందనం.

-- విహారి


Chowdary on Oct 16, 2007, 1:56:00 PM   said...

అయ్యా విహారి గారూ,

నా జాబుకి ముఖ్య కారణం - మాటల చిరు బిందువులతో, హాస్యపు విరిజల్లులను - నవ్వుల వడగండ్లను కురియించే మీ (మీ జాబులు చాలా చదివిన, పరిశీలించిన తరువాత personality of the author ఇదే అని భావించి) నుంచి, నేను ముందే చెప్పినట్లు షడృచుల భోజనం లాంటి మీ జాబులో కాకరగాయ ముక్క తగలటం చూడలేక వ్రాశానే గానీ, మీ బ్లాగు/జాబులను వేరే వాటితో పోల్చే, అలా మీ జాబులని కించ పరచే ప్రయత్నం ఇప్పుడు చేయలేదు-ఇక ముందు చేయను కూడా.

నైజాల గురించి మరియు బ్లాగు లెక్కల గురించి ఎందుకులేండి. కానీ మీ ఈ ఒకే ఒక్క జాబు చదివి నేను ఏదన్నా రాస్తే తప్పు (ఎందుకంటే personality of the author
తెలుసుకోకుండా) గానీ, రాసింది నాలుగు అయినా, నాలుగొందలు అయినా అవతలి జాబు చదివినప్పుడు కలిగే స్పందన అదే(మారదు) కదండి.

వ్యాఖ్య అయినా, విశ్లేషణ అయినా పరిధి దాటి వ్యక్తిగతం కానంతవరకు నేమ్ డ్రాపింగ్ అనేది చెడు ఉద్దేశ్యంలో కాదు కనుక ఓకె అని అనుకుంటున్నాను. కాదని భావిస్తే పెద్దలు చెప్పండి మరుసటి ప్రయత్నంలో మానుకోవటనికైనా లేక ఇప్పుడే పేర్లను, లంకెలను తొలగించుటకైనా నేను సిధ్ధం.

నా ప్రయత్నం కూడా, వేటి గురించీ పట్టించుకోక ఏ (కొత్త/పాత) బ్లాగరైనా చెప్పదలచుకున్నది చెప్పండి-రాయదలచుకున్నది రాయండి....అని చెప్పాలనే, అంతే గానీ వారిలో ఎలాంటి సందేహాలు కలుగజేయాలని కాదు.

అభినందనలతో మరియు కృతజ్ఞతలతో
తెలుగు'వాడి'ని


Anonymous on Oct 16, 2007, 2:19:00 PM   said...

తెలుగు వాడి గారు,

ధన్యోస్మి.

మీ సమాధానం నాకిప్పుడు సంతృప్తి గా వుంది. మీరు ఆ పేర్లేమీ తీయఖ్ఖర్లేదు గానీ :-) వెంటనే నా బ్లాగు కొచ్చి ఓ వంద కామెంట్లు రాసిపోండి :-) తరువాతెప్పుడన్నా వచ్చి బాకీ తీర్చుకుని పోతా :-;

-- ఎప్పట్లానే విహారి :-)


Chowdary on Oct 16, 2007, 6:44:00 PM   said...

విహారి గారు, చిరునగవుల మోమున మరలా ఇట ఏతెంచిన మీకు ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనవందనములు.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting