ఆస్తుల లెక్కలపై సవాళ్లు :: విచారణ నియమావళి-విధానము-నివేదిక (భాగము - ఒకటి)
బాబు గారి ఇంట్లో ఒక గది :
ఏమిట్రా బాబూ ఈ కష్టకాలం....ఏ పార్టీవాడూ ఏ సమస్యనూ లేపడేంది...ఇలా అయితే మనకు హైజాక్ చెయ్యటానికి
ఏమీ దొరకటం లేదు. జనాలు మర్చిపొతారు మన గురించి, మన పార్టీ గురించి. ఏదో ఒకటి చెయ్యాలి...చెయ్యాలి అని గడ్డం నుండి నల్లవెంట్రుకలు పీక్కుంటూ ఆలోచిస్తున్న సమయంలో హఠాత్తుగా, సంకలు గుద్దుకుంటూ, ఎడమ చేత్తో పిల్లిమొగ్గల వేసుకుంటూ(కుడిచేతి రెండు వేళ్లు వి ఆకారంలో చూపించుకుంటూ) గదిలోంచి బయటకు వస్తే.... ఎదురుగా ఉన్న భువన ఈయన గారి వైపు, గది వైపు అనుమానంగా చూస్తుంటే అదేమీ లేదు అని మొహం పెట్టి .... ఆహా! దొరికింది ఒక కొత్త టాపిక్కు : రాజు గారి గంటలవారీ సంపాదన....అని అరుచుకుంటూ, ఎర్రన్న, దేవన్న, దయన్న, సీతన్న, రాజత్త, రోజక్క అందరి సెల్లులకి రింగులిచ్చి, వారి ద్వారా అన్ని మీడియాలకూ సెల్లు కాల్స్, యస్.యమ్.యస్, ఈ-టపాలు, పేజర్లు ఇచ్చి విలేకరుల సమావేశంలో --- గంటకు కోటన్నారు, మొత్తం ఒక ముఫ్పై వేల కోట్లు అన్నారు - విచారణ పెట్టాలన్నారు - అందరికీ మరలా ఆ రెండు వేళ్లు ఎప్పటిలానే చూపించి వెళ్లారు.
ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక గది :
ఇది విన్న/చదివిన మన రాజు గారు ఒక రకంగా నవ్వుకుంటూ (ఎప్పటినుంచో ఆస్తి మొత్తం లెక్కపెట్టటానికి ఎవడినో ఒకడిని నియమిద్దాము అనుకుంటుంటే బాబు తన శ్రమను తగ్గించాడు కదా అని) వెంటనే కొంచెం కోపంతో - వీడెమ్మ కడుపు కాలా (వెంటనే తెలుగు నిఘంటువు తీయబోయి అంతలోనే అసలు ఈ రాష్ట్రం మొత్తం మీద మన కన్నా తెలుగు బాగా వచ్చినవాడు ఎవడూ లేడు కదా అని గుర్తుకు వచ్చి), ఈ బాబు ఇంత పని చేశాడేందబ్బా అని పంచె సవరదీసుకుంటూ, చేతులు తిప్పుకుంటూ కుర్చీలో ఊగుతూ - "నువ్వు రెండెకరాలతో మొదలెట్టావు, తొమ్మిదేళ్లు ఉన్నావు - అదన్నాడు, ఇదన్నాడు మొత్తానికి బాబు దగ్గర కూడ కుడి-ఎడంగా అన్నే వేలకోట్లు ఉన్నాయి గదా" అని అదే మీడియాకు మొత్తం చిట్టా విప్పాడు..........ఈయన గారు కూడా విచారణకు సై అంటే సై అన్నారు.
ప్రజలనే పిచ్చోళ్లు:
ఆ తధాస్తు దేవతలు ఈ ఒక్క సారికైనా మా మాట విని ఏదో పుణ్యం కట్టుకోని ఈ లెక్కలు-తొక్కలు ఏవో తేల్చేసి వీరిద్దరి పిచ్చి కాస్తా కుదిర్చి (లేకపొతే ఇంకా ఒక 18 నెలల్లో మేము ఎలాగూ కుదురుస్తాము అని మనసులో అనుకుంటూ) ఆ కోట్లేవో ఆ రైతులకో, పౌష్టికాహారం చాలని పిల్లలకో, ప్రాధమిక విద్యకో, ఆరోగ్య పరిరక్షణకో, ఆడపడుచుల ఆర్ధిక స్వాతంత్ర్యానికో,మనల్ని రక్షించటానికో లేక ఏదో ఒక మంచికో ఉపయోగపడేలా చేస్తే ఒక పని అయి పోతుంది కదా అని, కనపడిన కనపడని దేముళ్లను-దేవతలను ప్రార్ధిస్తున్నారు.
బాబు గారి మాజీ మంత్రుల, యమ్.యల్.ఏ ల, పార్టీ కార్యకర్తల,, అనుచరుల సణుగుళ్లు :
ఈ లెక్కలు ఇప్పుడు చెప్పి మాకు పుండు మీద కారం రాయటం కాకపోతే ఏమిటి బాబూ అని ఒక వైపు... మొత్తానికి రేపు అధికారం లోకి వస్తే మనకి ఆదర్శం ఎవరు/ఏమిటి, మన సంపాదన ఏ రేంజ్ లో ఉండాలి అని చెప్పినందుకు ఆనందం మరొక వైపు ...
రాజు గారి మంత్రుల, యమ్.యల్.ఏ ల, పార్టీ కార్యకర్తల, అనుచరుల సణుగుళ్లు :
ఇప్పటి దాకా మేము పెద్ద పుడింగుల్లా కటింగులు దొబ్బుకుంటూ (మాకు అందుబాటులో ఉన్నంతలో మాక్సిమం చాలా వరకు ఒక దారి చేశాము అని), కాలరు ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఇంటికి వెళ్లి మా పెళ్లాలకి/మొగుళ్లకి మొహం చూపించాలంటేనే ఒక రకంగా ఉంది (బాబు అనవసరంగా ఇప్పుడు చెప్పాడే ఈ లెక్కలు అనుకొని) అనే బాధ ఒక వైపు ... ఇంకా మిగిలిన 18 నెలల్లో ఏమేమి చెయ్యాలో, ఎక్కడెక్కడ నొక్కెయ్యాలో అని సాధ్యమైనంత స్పీడుగా ఆలోచించుకుంటున్న ఆనందం (ఇప్పటికైనా చెప్పి కళ్లు తెరిపించినందుకు) ఒక వైపు..
ఒక్కొక్కరూ (అదేనండి పైవారు అందరూ) విడి విడిగా :
కలగాపులగమైన ఆలోచనలతో వారు కూడా ఏదో పూనకం వచ్చినట్టు (మీడియాను చూస్తే ఆటోమాటిక్ గా వస్తుంది లేండి) ఊగి నాలుగు పనికిమాలిన ముక్కలు మాట్లాడి ఇంటికి (అదేలేండి బారు కి) వెళ్లారు.
ఇక అసలు విషయంలోకి వస్తే ....
బాబు / రాజు గార్ల అవేశం కొద్దిగా చల్లారిన తరువాత, వారి సవాళ్లు-ప్రతి సవాళ్లు గుర్తుకి వచ్చి కొంచెం టెన్షన్ పెరగబోయే సమయంలో ... ఒకరి సెల్లు నుంచి ఇంకొకరి సెల్లుకి ఒకే సారి కాల్ వచ్చింది.
రాజు : ఏమయ్యా బాబు! గంటకి కోటన్నావ్-మొత్తం ముప్పై వేల కోట్లన్నావ్...అంతవరకి ఏదో ఓ.కె అనుకుంటే, మధ్యలో ఈ కమీషను, ఎంక్వైరీ అంటావేందయ్యా, అన్నీ తెలిసికూడా? ఇలా అయితే మనం ఏమి అయిపోవాలి?
బాబు : ఏంది రాజూ నువ్వు మరీనూ, తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ఆ మాత్రం (అన్నిట్లో కాదులే) ఆలోచించకుండా ఎలా మాట్లాడతాననుకుంటావయ్యా, అందులో ఈ ఆస్తిపాస్తుల విషయంలో....
రాజు : ఇంతకీ ఏందయ్యా నువ్వు అనేది
బాబు : అదేనండి ... నేను సిట్టింగ్ జడ్జి అంటాను ... మీరు జాగింగో లేక రన్నింగ్ జడ్జో అనండి ... ఇలా ఒక వారం సాగదీశామా ఎవడూ దీని గురించి పట్టించుకోడు ... అంతే ..(కనపడదు అని తెలిసి కూడా మరొక్కసారి తన రెండు వేళ్లు చూపిస్తూ) ...... సరేకానయ్యా, నేనంటే ప్రతి పక్షంలో ఉన్నాను ఇలా చించుకోవాలి కాబట్టి చించుకుంటా....నువ్వేంది అంతే అవేశపడి, అన్నింటికీ సిధ్ధం అంటావు....
రాజు : ఒక్కసారిగా నవ్వుతూ ... అంతలేదులేవయ్యా బాబూ, అసలు ఈ కమీషన్, ఎంక్వైరీలు ఎట్లా పనిచెయ్యాలొ నువ్వు చూపెట్టిన, ఆచరించిన నియమావళికి, నేను కొంచెం మార్పులు-చేర్పులు చెయ్యమని మా అధికారులను ఇప్పటికే ఆదేశించాను ... అది పూర్తి అయిన తరువాత ఒక కాపీ నీకు కూడా పంపిస్తాను అప్పుడు నీకు పూర్తిగా అర్ధమవుతుందిలే...
ఇంతలోపే ... అధికారులు ఎందుకైనా మంచిది అని (ఎలాగూ రాజు/రామచంద్రం గార్ల దగ్గరి నుంచి ఆదేశాలు వస్తాయని తెలుసు కాబట్టి) అసలు ఈ కమీషన్, ఎంక్వయిరీలకు ఒక సరికొత్త నియమావళిని, ఎలా పనిచేయాలి, నివేదికలో ఏమి-ఎలా ఉండాలి అని రూపొందించే పనిలో పడ్డారు.
................................
ఒకవేళ ఈ మొదటి భాగం మిమ్మల్ని కొంచమైనా నవ్వించి ఉంటే లేక కనీసం రెండో భాగంలో అయినా నవ్వు రాక పోతుందా అని ఆశ ఉంటే (మిమ్మల్ని ఆ దేముడే కాపాడాలి) ఇక ఆలస్యం ఎందుకు చదివెయ్యండి...ఇదిగో ఆ రెండో భాగం లంకె : ఆస్తుల లెక్కలపై సవాళ్లు :: విచారణ నియమావళి-విధానము-నివేదిక (భాగము - రెండు)