ఆస్తుల లెక్కలపై సవాళ్లు :: విచారణ నియమావళి-విధానము-నివేదిక (భాగము - రెండు)

Posted by తెలుగు'వాడి'ని on Thursday, October 18, 2007

ఇది రెండవ భాగం అండి....కనుక దయచేసి ముందు మొదటి భాగం చదవండి పూర్వాపరాలు అర్ధం కావాలంటే ... ఒకవేళ అది మిమ్మల్ని నవ్వించలేక పోతే, అంతే సంగతులు ... కనీసం దీంట్లో కొంచమన్నా నవ్వు రాక పోతుందా అని ఆశ ఉంటే (మిమ్మల్ని ఆ దేముడే కాపాడాలి) ఇక ఆలస్యం ఎందుకు చదివెయ్యండి.

ఈ దిగువన ఇచ్చినది, మాకు దొరికిన నకలు (మేము సేకరించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం) ... లేక ఇలా ఉంటుంది అనే మా ఊహ అనో, ఎలా అనుకున్నా ఫర్వాలేదండి :-)

విచారణాధికారి నియామకం :

ఎవరు : రిటైర్డ్ / సిట్టింగ్(రన్నింగ్,జాగింగ్) జడ్జి ... ఎవరో ఒకరు (ఎవరైనా ఊడేది ఏమీ లేదు ... ఏదో ఒక పేరు లాటరీ తీయండి)

ముందుమాట :

మీరు ఊరికే ఆవేశపడి బట్టలు చించుకోకుండా, ముందు ఈ నియమ-నిబంధనలను పూర్తిగా చదివి(అర్ధం చేసుకోవాలి బాబూ, మాలాగ చూడ/చదవకుండా సంతకాలు పెట్టటం కాదు) ఉధ్ధరించండి. ఇది మీకు మేము పెట్టే పరీక్ష...ఇందులో మీరు పాస్ అయ్యి, ఒక ప్రమోషనో లేక ఎంతో కొంత వెనకేసుకోవాలి అనుకుంటే మేము చెప్పేది తూ.చ. తప్పకుండా పాటించండి.

నియమావళి :

1. మీరు హైదరాబాద్ దాటి ఎక్కడికీ వెళ్లవలసిన పని లేదు (వెళ్లటానికి వీలులేదు). ఒక వేళ వెళ్లవలసి వస్తే మీరు ఏఏ బంధువుల, స్నేహితుల, విహారయాత్రల సిటీ/విలేజ్ పేర్లు రాసుకొని అక్కడికే వెళ్లి విచారించండి...స్వామి కార్యం - స్వకార్యం అయిపోతుంది.

2. ఇడుపుల తోట - హెరిటేజ్ కోట లాంటి ప్రదేశాలకు వెళ్లండి (కనీసం వీటికి కూడా వెళ్లక పోతే బాగోదు కాబట్టి) మీ కుటుంబంతో కలిసి - మిగతా ఏర్పాట్లు మేము చూసుకుంటాము.

3. ఇంకు లేని పెన్ను, తెల్లకాగితాలు ఉన్న ఫైలు పట్టుకొని బాగా హడావుడిగా తిరుగుతూ కనిపించాలి. అలాగే, మైకు (అదే లేండి మీడియా)చూడగానే పూనకం వచ్చినట్టు ఊగిపోకుండా, మేము రాసిచ్చిన డైలాగులు మాత్రమే అప్పచెపుతూ ఉండాలి.

4. ఇంతకు ముందు వేసిన అన్ని కమీషన్లు/విచారణల గతి ఏమయ్యిందో, వాళ్లు ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయో, వాటిపై మా (ముందు లేక వెనుక వచ్చే ఏ ప్రభుత్వాలది అయినా అందరిదీ అదే బడి) స్పందన ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకోండి. అంటే మీరు ఊరికే పెద్ద చించుకోవద్దు అని మా ఉద్దేశ్యం / సలహా.

***ఇది నియమావళి తొలి కాపీనే అండి....మాకు గుర్తుకు వచ్చినపుడు వీటికి కలుపుకుంటూ పోతూ ఉంటాము.

విచారణ కాలపరిధి :

పదిహేను నుంచి ఇరవైఒక్క నెలలు (బాబు బండారం ఏదన్నా బయట పడితే (ఎట్టాగూ పడదు .. కాకపోతే ఏదో ఆశ) ఎన్నికలల ముందు జనాలకు/మీడియాకు వదలటానికి వీలుగా...) ... కానీ ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది(తొందరగా ముగించటం లాంటిది మాత్రం ఉండదు) కనుక మీరు ప్రశాంతంగా మీకు అందుబాటులో ఉన్న అన్ని రాజభోగాలనూ సంపూర్తిగా అనుభవిస్తూ ఉండండి.

నివేదిక :

ఇది మీరు సేకరించిన మరియు మాకు ఇచ్చిన వివరాలలో ఒక్కముక్క కూడా దీంట్లో ఉండదు ఎందుకంటే మా బండారం మేమే బయట పెట్టుకోనే వెధవల స్థాయికి ఇంకా దిగజారలేదు కాబట్టి. దీంట్లో ఏమి ఉండాలో మేము పూర్తిగా అలోచించి (ఒకసారి బాబు తో కూడా మాట్లాడి .. 2009 లో ఏమవుతుందో ఎవడికి తెలుసు), కర్ర విరక్కుండా - పాము చావకుండా, నాలుగు పనికిమాలిన వివరాలు ఉండేలా చూసుకుంటూ మేమే ఒక నివేదికను సిధ్ధం చేసి ఉంచుతాము కనుక మీరు నిశ్చింతగా ఉండండి.

ఈ వివరాలన్నిటితో, రాజు గారు బాబు గారికి ఈ-టపా పంపించటం, బాబు గారు చదవటం, వెంటనే ఎనిమిది వేళ్లతో (కుడి చేతిలో రెండు వేళ్లు V ఆకారంలో బిగుసుకుపోయాయి కదా...అప్పుడే మర్చిపోతే ఎలాగండి) రాజు గారికి రిప్లై ఇవ్వటం, రాజు గారు అది చదవటం అందరూ హాపీ-హాపీ గా ఉండటం జరిగిపోయాయి.

కొసమెరుపు :

బాబు గారు మామూలు మూడ్ లోకి వచ్చారని అనుకున్న తరువాత రాజు గారు, అసలు బాబు అవేశానికి కారణం కనుక్కుందాము అని బాబు సెల్లుకి ఫోన్ చేయగా.......

రాజు గారు : ఏం బాబూ! నా ఈ-టపా చూసాక కొంచెం నవ్వు మొహం వచ్చి ఉంటుంది అని అనుకొని, అసలు నువ్వు నా ఆస్తులపై గొడవకు దిగటానికి కారణం కనుక్కుందామని చేశానయ్యా ఈ ఫోన్ కాల్.

బాబు గారు : ఏం చెప్పమంటావయ్యా రాజూ! నిన్నటి దాకా తొమ్మిదేళ్లు సి.యమ్ అని, బాగానే వెనకేశాము అని మేము జబ్బలు చరుచుకుంటూ బ్రతికాము నువ్వేమో నిన్న గాక మొన్న వచ్చి లేటెస్ట్ సినిమాలో హిట్టైన డైలాగులన్ని కొట్టేస్తుంటే తట్టుకోలేకే ఈ గొడవంతా........

వినండి ఆ డైలాగులు ఏందో:

ఎప్పుడొచ్చామన్నది కాదమ్మా ... ఎంత వెనకేశామన్నదే ముఖ్యం.

ఎవ్వడి అవినీతి గురించి చెపితే .. దిమ్మతిరిగి పోతుందో వాడే(రే) రాజు గాడు(రు)

ఇది చూసి మేము కూడా సినిమా స్టైల్ లో ఏదన్నా చేద్దామని ఆ శివాజీ వెంట బడితే అది కాస్తా తుస్సుమంది.

ఈలోపు నువ్వేమో, ఇలియానాలా ఊపుకుంటూ తిరుగుతుంటే, మా బతుకేమో, నిన్ను చూసి

బస్తాలు, బస్తాలు డబ్బులు పోగేసి వెనకెయ్యటమే గానీ, ఏదోలే మాజీ సి.యమ్, మరలా అధికారంలోకి వస్తాడేమో, ఎప్పుడైనా కొంచెం ఉంచుదాం అనే ఆలోచనే రాదాయె నీకు ... ఇలాగయితే ఎలా చచ్చేది. మరి కాలక ఏం జేస్తది మాకు.

..............................

అక్కడయితే ఇలియానా బాక్స్ ఇచ్చి (కోపంతో అయినా) వెళ్లిపోయింది. మరి ఇక్కడ రాజు గారు కొన్ని బస్తాలన్నా మిగులుస్తారో లేదో ఇంకొక 18 నెలలు ఆగితే కానీ తెలియదు. ( ఏమవుతుందో మన కందరికీ జగమెరిగిన సత్యమే :-) )

మనవి : రాజు గారు ఇలియానా కాదు ...బాబు/రాజు గార్ల ఇద్దరిలో ఏ ఒక్కరూ మహేష్ కాదు.విషయ సూచికలు :


3 వ్యాఖ్యలు:

నేనుసైతం on Oct 19, 2007, 11:50:00 AM   said...

బాగుంది..మీ వేడి,వాడి తగ్గనివ్వకండి.
-నేనుసైతం


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting