అతిధి రివ్యూ : Direction (Extras, Ordinary) but Mahesh is Extraordinary

Posted by తెలుగు'వాడి'ని on Monday, October 22, 2007

ఒక వేళ మీకు ఈ అతిధి సినిమా గురించి మన టిపికల్ తెలుగు వెబ్ సైట్స్ రివ్యూలు కావాలి అంటే దయచేసి ఈ లంకెను క్లిక్కండి. ఆతిధి సినిమా రివ్యూలు - అన్ని సైటుల నుంచి ఒకే చోట

సైనికుడు సినిమా చూసిన తరువాత ఇంతకన్నా ఎక్కువ బాధ, ఆవేశం, కోపం వచ్చినా కూడా అంతలోనే తమాయించుకోవటం జరిగింది ఎందుకంటే ఆ సినిమా తీసిన అశ్వనీదత్ గారి జీవిత ధ్యేయం( ఈ మధ్య కాలంలో మాత్రమే) ఏమిటో మనకందరికి తెలిసినదే .... అది ఏ హీరో అయితే మంచి ఫామ్ లో ఉండి, సూపర్ డూపర్ హిట్స్ ఇస్తున్నాడో, అతనితో సినిమా తీసి ఇంత వరకు వాళ్ల కెరీర్ లోనే రాని/లేని అట్టర్ ఫ్లాప్ ను వాళ్లకి అంటగట్టటం....

కానీ ఇప్పుడు సొంత ప్రొడక్షన్ లో, మహేష్ అన్న గారే నిర్మాతగా వచ్చిన ఈ సినిమా ఇంత దరిద్రంగా, పరమ చెత్తగా, భీభత్స-భయానక హింస-రక్తపాత దృశ్యాలతో ఉండటం చూసి తట్టుకోలేక పెల్లుబికిన ఆవేశమే నా ఈ సమీక్షకు ప్రేరణ...

ఒక సినిమా చూసిన తరువాత ఆ సీను అలా ఉంటే బాగుండేది, ఈ ఫైటు ఇలా తీస్తే అదిరేది, ఆ సీను అలా లేకపోతే, ఈ సీనుని ఈ యాంగిల్ లో తీసుంటే, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యుండేది ... ఇలా ఎన్నో ఎన్నెన్నో చెప్పవచ్చు ... అలా చెప్పటం కూడా చాలా తేలిక మన లాంటి ప్రేక్షకులకి (ఎన్ని సినిమాలు చూడలేదు మనం)....

కానీ ఈ అతిధి సినిమా చూసిన తరువాత వీటన్నిటి కన్నా మన మైండ్ ని (ఇంకా ఏమన్నా మిగిలున్నా, లేక మోకాలు/అరికాళ్ల దాక వెళ్లి ఆగిపోయి ఉన్నా, కొద్దో గొప్పో పని చేస్తూ ఉన్నా) తొలిచి వేసేది ఒకటుంది ... అది మామూలు సినిమా కన్నా ఒక 20-40 నిముషాలు ఎక్కువ నిడివి తీసుకోని అసలు కొంచమైనా కూడా కామెడీ-రొమాంటిక్ సన్నివేశాలు చూపించటానికి ప్రయత్నం చేయకపోవటానికి, ఆ ఎక్కువ సమయాన్ని కూడా అంతా హింస-రక్తపాతంతో మాత్రమే నింపివేసి, హీరో-దర్శక-నిర్మాతలు ఎలాంటి రిజల్ట్ ఆశించి ఈ సినిమాను మన మీదకు వదిలారో అన్నదే...

ముందుగా ఈ చిత్ర దర్శకుడికి కొన్ని సూటి ప్రశ్నలు :

1. మహేష్ లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుని సినిమాలో అసలు ఇంత తీవ్రస్థాయిలో భీభత్స-భయానక హింస-రక్తపాత దృశ్యాలను చూపించటం వెనుక మీ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

2. ఈ చిత్రం యొక్క నిడివిని ఒక మామూలు సినిమా కన్నా 20-40 నిముషాలు పెంచి కూడా, హాస్యానికీ మరియు హీరో-హీరోయిన్ల మధ్య రసమయ ప్రేమ సన్నివేశాలకీ ఒక పది-పదిహేను నిముషాలు కేటాయించలేకపోవటానికీ కారణమేమిటి?

3. మహేష్ చేత కత్తి పట్టించి కుడి-ఎడంగా ఒక 50 మందిని ఏకబిగిన చంపించి తెరమీద అంతా రక్తపాతంతో నింపి చూపించటం అనేది మీ దృష్టిలో తనకి సూపర్ మాస్ ఇమేజ్ ఆపాదించటానికేనా?

4. లక్ బాగుండి సినిమా హిట్ అయితే అందరూ మీవల్లే మహేష్ కి ఇలాంటి ఇమేజ్ వచ్చింది అని చెప్పుకోవాలనా లేక తాను పట్టిన కుందేటికి రెండున్నర కాళ్లే అనుకుని మీ పంధా మార్చుకోకుండా మీకు తెలిసిన ఆ రెండు ఫైట్లు, 50 మందిని పొడవటం, 20 లీటర్ల రక్తం, ముప్పావు గంట క్లైమాక్స్ తో సినిమాని చుట్టేయటమా?

5. అసలు క్లబ్ సాంగ్ కు డాన్స్ వేసే వాళ్లు ఎలా ఉండాలో అనే బేసిక్ పాయింట్ ని ఎలా మర్చిపోతారండి మీరు? అసలు మీరు తెలుగు సినిమాలు చూడరో, ఒకవేళ చూసినా ఇదో వెరైటీ అనుకున్నారో గానీ, చెంచాడు కండ కూడా లేని మలైకా అరోరా సెలక్షన్ ని చూసిన తరువాత మీకు కళాపోషణ పూర్తిగా నష్టి (సున్న, శూన్యం) అని మాత్రం అర్ధమయ్యింది. మీరు అనుకునే ఏ సెంటర్లలో (A, B, C, D ...) ప్రేక్షకుడి అభిరుచి అయినా ఈ విషయంలో ఒకటే ...కండపుష్టితో, ముద్దుగా-బొద్దుగా, 35/70 MM(మరీ ఇంత కాదు అనుకోండి) లో చూసి సరిపెట్టుకోవలసి వస్తుందే అని బాధపడేటట్టుగా ఉండే అలనాటి జయమాలిని-జ్యోతిలక్ష్మి, ఒకనాటి సిల్క్-స్మిత లేక ఈనాటి ముమైత్ ఖాన్ లా ఉండాలి బాబూ. మలైకాకు 15 లక్షలు ఇచ్చినది నిజమే అయితే, దాని బదులు చిలకలూరిపేట/నరసరావుపేట/అమలాపురం/పెద్దాపురం దరిదాపుల్లో ప్రభలపై డాన్స్ వేసే వాళ్లని తీసుకువచ్చినట్లైతే (1500-15000) అంత రంజుగా ఉన్న పాటని ఒక ఊపు ఊపే వాళ్లు.

నా అభిప్రాయం ఏమిటంటే, ఎంతో టాలెంట్ ఉండి కూడా, ఒకటో రెండో పాయింట్లతో(నరకటం, రక్తపాతం) సినిమా మొత్తాన్ని చుట్టెయ్యటం, హాస్యానికి, లవ్ సీన్లకి అసలు ప్రాధాన్యతే లేదన్నట్టు వాటిని పక్కన పెట్టెయ్యటం చాలా శుధ్ధతప్పు. మీరు తీస్తున్నది మహేష్ తో అని, తన సినిమాలంటే మహిళలు-పిల్లలకు కూడా యువతకు ఉన్నంత క్రేజ్, ఫాలోయింగ్ ఉన్నది అని మర్చిపోయి సినిమా మొత్తాన్ని హింస-రక్తపాతంతో చుట్టెయ్యటం ఇంకా తప్పు.

నిర్మాత రమేష్ గారు!

పోకిరి లాంటి ఒక సూపర్ సెన్సేషనల్ హిట్ తో, అనితర సాధ్యమైన నటనతో ఆశేష తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో కనీవినీ ఎరుగని ఇమేజ్ ని సృష్టించుకున్న మీ సొంత తమ్ముడైన మహేష్ తో సినిమా ఇలానా ఉండేది....ఒక్క క్షణం అలోచించి చూడండి. (ఖచ్చితంగా అశ్వనీదత్ లా ఫ్లాప్ సినిమా తీసే ఉద్దేశ్యమైతే కాదు గదా మరి ఏమిటండీ ఇది)

మహేష్ గారూ,

మేము మీకు చెప్పదలచుకున్నది ఒకటే ... ఒక సినిమాను ఒప్పుకున్న తరువాత మీరు పూర్తిగా డైరెక్టర్స్ బాయ్ అయిపోయి, దర్శకునిపై ఉన్న నమ్మకమనే ఉలికి మీలో నటుడు అనే శిలను అప్పగించి తనకు ఎలా కావాలో అలా మలచబడటానికి, ఒదిగిపోవటానికి.. మేమే కాదు మాతో పాటు మీతో పని చేసిన ప్రతి దర్శకుడూ చెయ్యెత్తి జై కొడుతున్నాము..చప్పట్ల వర్షం కురిపిస్తున్నాము ...

కానీ ... ఇకముందు దర్శకుడు మీ చేతికి కత్తి ఇచ్చినపుడు దయచేసి కనీసం కొన్ని వివరాలు, ఎంత మందిని నరకమన్నారు, ఎన్ని లీటర్ల రక్తం లేక ఎరుపు రంగు వాడబోతున్నారో కనుక్కొని, ఆయా సన్నివేశాలలో నటించండి. ఇవ్వాళ తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న కొద్ది మంది (కుర్ర)హీరోలలో, సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా, కేవలం మీకోసం అంటే మిమ్మల్ని చూడటం కోసమే సినిమాకు వచ్చే వాళ్లు కోకొల్లలు అందులో ఎంత మంది యూత్ ఉంటారో, కుడి-ఎడంగా అంతే మంది మహిళలు-పిల్లలు కూడా ఉంటారనే విషయాన్ని మీరు మర్చిపోకుండా మీ దర్శకుడికి కూడా చెప్పండి.

మహేష్ వీరాభిమానులూ,

మీరు మాత్రం ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోవటానికి గల కారణాలు తెలుసుకోని కూడా దయచేసి ఊరికే వదిలిపెట్టవద్దు. ఈ చిత్ర దర్శకుడినీ, హీరో అన్న గారు అయినందుకు మరీ ఎక్కువగా ఈ చిత్ర నిర్మాతనీ మీరు ఎలాగైనా కడిగి పారెయ్యండి, మరలా మరలా ఇలాంటి పనికి మాలిన సినిమాలు అంటే బాక్సాఫీసు దగ్గర గారంటీగా పల్టీకొట్టే (మొదటి రోజు 6.15, మూడు రోజులకి 13, నాలుగు రోజులకి 16.73 కోట్లు వసూళ్లు రావచ్చు గాక .. For more records and collection details, please click Prince Mahesh - Athidhi Collection Records ... Actual figure of Athidhi is Rs.17 Cr. but here is the latest update from UTV : Athidhi tots Rs 125 mn in 1st (First)week)), మరీ ముఖ్యంగా ఉండవలసిన అన్ని హంగులూ అంటే కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా సినిమా తీసినందుకు...ఇక ముందు సినిమాలు తీయకుండా ఉండేలా చేసేందుకు....

వీరాభిమానులంటే సినిమా విడుదలప్పుడు కటౌట్స్ కట్టి, పాలాభిషేకాలు చేసి, రంగు కాగితాలు కట్టి, గుడ్డలు చించుకోని మొదటి ఆట సినిమాకు వెళ్లేవాళ్లు మాత్రమే కాదు అనీ వాళ్ల అంచనాలకు, ఆశించినదానికి విరుధ్ధంగా ఉంటే ఎదురుతిరిగి చీల్చిఛెండాడే వాళ్లు అని కూడా తెలియచెప్పవలసిన తరుణమిదే. (ఇది చిరంజీవి వీరాభిమానులకు కూడా అండి ... ముఖ్యంగా ఆ శంకర్ దాదా జిందాబాద్ లో హీరోయిన్ ని చూసినప్పుడల్లా రక్తం ఉడికిపోతూ ఉంటుంది)

చివరిగా ఒక్క మాట ... మహేష్ నటనాకౌశలం, హావభావ విన్యాసాలు, స్క్రీన్ ప్రెజన్స్, హెయిర్ స్టైల్ ఇలా మహేష్ కు సంబంధించినంత వరకు ఎంత చెప్పుకున్నా తక్కువే...అవన్నీ అధ్బుతం ...నిరుపమానం... అనితరసాధ్యం...అతనికి అతనే సాటి.

కానీ వీటన్నిటి గురించి, నాకు తెలిసినంతలో తెలుగు సినీ ప్రేక్షక, విమర్శక, సమీక్షక లోకంలో గానీ, ఆ మాటకొస్తే వేరే నటీనటులలో గానీ, వారి అభిమానులలో గానీ, వేరే అభిప్రాయం ఉంటుంది అని నేను అనుకోవటం లేదు.

కాదూ మహేష్ బాగా నటించి ఉంటాడా, స్క్రీన్ మీద బాగుంటాడా etc అని సినిమాకు వచ్చే వాళ్లు ఉంటారు అని దర్శక-నిర్మాతలు భావించి జస్ట్ వాటి కోసమే ఈ సినిమా తీయటం జరిగితే మాత్రం .. అది ఎలా ఉంటుంది అంటే ....

(నాలుగైదు సంవత్సరాల క్రితం కుడి-ఎడంగా 2002 వరకు లెండి) చిరంజీవి గారి సినిమాకి, ఆ సినిమాలలో పాటలుంటాయో లేవో చూద్దామని, ఉన్నా కూడా పాటలలో ఆయన స్టెప్స్ వేస్తారో లేదో, వేసినా గూడా అసలు ఎలా వేస్తారో అని...వెళదాము అనో....లేక రాఘవేంద్ర రావు గారి సినిమాకి, హీరోయిన్ ని అసలు ఎక్స్-పోజ్ చేస్తారో లేదో .. చూపించినా బొడ్డు చూపిస్తారో లేదో, బత్తాయిలు, ఆపిల్స్, ద్రాక్షలు హీరోయిన్ కి వేసి కొడతారో లేదో అని..వెళదాము అనో ... అనుకునే వాళ్లు ఉంటారు అని భ్రమ పడేంత....

అలాగే మహేష్ పేరు/నటన/స్టైల్, చిరు స్టెప్స్/ఫైట్స్, దర్శకేంద్రునిచే హీరోయిన్ బొడ్డు ఎక్స్-పోజింగ్, ఫ్రూట్స్ వాడటం ... ఒక సినిమాని హిట్ చేయలేవు అని ఇప్పటి దాకా ఫ్లాప్ అయిన వాళ్ల సినిమాలని చూసి కూడా నేర్చుకోక పొతే ఎలా అండి.


[ ఇప్పుడే అందిన వార్త ఈ మద్య విడుదలైన తెలుగు సినిమాలు హిట్టా-ఫట్టా: ఆంధ్రాకేఫ్ వారి లేటెస్ట్ ట్రేడ్ టాక్ ]

కనుక మీరు ఎక్కువ క్రియేటివ్ గా ఆలోచించ కుండా, ఉండవలసిన నాలుగు అంశాలు అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకుంటూ, మహేష్ బాబు వీరాభిమానుల అంచనాలకు కొద్దిగా అటూ-ఇటుగా ఉండేలా జాగ్రత్త పడుతూ, మహిళలు-పిల్లలు కూడా మహేష్ మానియాలో ఒక భాగమే అని మరచిపోక, మహేష్ ని ఒక్క 'పోకిరి' గానే కాకుండా, ఒక 'అతిధి' లానో (ఇది సర్దుకున్నట్టు గానే ఉంది), 'మిర్చి' లానో, రాబోయే మరో పాత్ర/సినిమాలాగానో గుర్తుంచుకునేలా చేయటానికి ఇక రాబోయే దర్శక-నిర్మాతలు కృషి చేయటానికి ఏ కొంచమైనా ఇది ఉపయోగ పడాలని, ఉపయోగపడుతుందనే ఆశ...ఆకాంక్ష...
16 వ్యాఖ్యలు:

దిన్నిపాటి on Oct 24, 2007, 4:16:00 AM   said...

అన్నియ్యా.. అంత చండాలంగా ఉందా? మహేష్ సినిమా గుడ్డలు చించుకుని చూసే ఫంకా కాకపోయినా, ఓసారి చూడాలనుకొనే పంకాని ఇంకా దుబయ్ లొ వెయ్యలే బొమ్మని. వేసుంటే ఓ వంద దిర్హంస్ బొక్కపడుండేదేమో. మొత్తానికి ఇది పనిలేనప్పుడు ఆఫీస్ లొ అంతర్జాలం లొ ఉచితంగా చూడదగ్గదనమాట.

మీ విశ్లేషన బావుంది... నెనర్లు.
ది.శివకుమార్.


రానారె on Oct 24, 2007, 8:57:00 AM   said...

చాలా అతి-థి. శుక్రవారం సాయంత్రం తల బొప్పి కట్టించింది.


తెలుగు'వాడి'ని on Oct 24, 2007, 10:19:00 AM   said...

అందరికీ కృతజ్ఞతాభినందనలు మీ వ్యాఖ్యలకు.

@koththapALI : No. I don't think it's a good movie but watchable in bits and pieces where Mahesh, Ileana, Mahesh&Ilean together and finally refreshing/informative dialogues. As a whole movie and in all aspects, I like Athadu much better than Pokiri.

@దిన్నిపాటి : తమ్ముడూ, సినిమా ఛండాలమే. మన లాంటి వాళ్లు అదే మహేష్ బాబుకి విసనకర్ర, పంకా, చల్లదనం కాకపోయినా అతని కోసం ఒక సారి చూడొచ్చు/చూద్దాములే అనుకునే వాళ్లకు పెద్ద బొక్క పెట్టే సినిమా. వంద దిర్హామ్ లు ఖచ్చితంగా మిగల్చండి అసలు నా ఈ ఉడుకుమోత్తనానికి కొంత కారణం నాకు పడిన 60 డాలర్ల (2*13(two tickets)+14(samOsA+chetta)+2*10(dinner)) బొక్క కూడా ఒకటిలే. ఇంట్లో హాయిగా కడుపులో చల్ల కదలకుండా, ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటూ ఏ మిస్సమ్మ(పాతదిలే), గుండమ్మకథ, కొంచెం లేటెస్ట్ అయితే ఏ త్రివిక్రమ్ సినిమానో చూసుకుంటే అదే ఒక స్వర్గం.

@రానారె : మీకు ఒకటేనా సార్, మాకు అయితే తల నిండా అవే ... ముందు నేను అనుకున్న టైటిలు అదేనండి : అంతా అతి .. చివరకు 'థి...థు' అనిపిస్తుంది అని. కానీ మహేష్/డైరెక్టర్ గురించి టైటిల్ లో రావాలని అలా మార్చాను.


నవీన్ గార్ల on Oct 26, 2007, 6:16:00 AM   said...

కష్టాలు తెలుగు సినిమాభిమానులకు కాకుంటే..మానులకు ,మాకులకు వస్తాయా. కొంచెం తట్టుకో బాబూ తట్టుకో. ఈ మాత్రం దానికి డాక్టరు గీక్టరు అనేవు...ఓ నెల రోజులు తెలుగు సినిమాలు చూడమాక. నీ మెదడు వాపు తగ్గిన తరువాత..మెల్ల మెల్లగా..ఒక్కో సినిమా అరగంటేసి మాత్రం చూడు. ఆరోగ్యానికి మంచిది. ఏంత బాధ పడుండకపోతే...ఇంత పెద్ద టపా వ్రాస్తావో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను.
ఏదేమైనా చండాలమైన సినిమా గురించి వ్రాసిన సమీక్ష బాగుంది. నాకు కూడా నలభై ..యాభై దిర్హాములు మిగిల్చింది. మీరు గనక బెంగళూరికి వస్తే..ఆ డబ్బులతో పార్టీ చేసుకుందాము. పార్టీ చేసునేటప్పుడు ఈ యదవ సినిమాల గురించి నాలుగు తిట్లు ఆరు బూతులు కూడా మాట్లాడుకోవచ్చు!!!


తెలుగు'వాడి'ని on Oct 26, 2007, 8:48:00 AM   said...

కృతజ్ఞతాభినందనలు, నవీన్ గారు మీ వ్యాఖ్యకు,

ఏమిటండీ మీరే కదా మొదట తెలుగు సినిమాభిమానులమన్నారు ... మరి తరువాతేమో
మెదడువాపు, డాక్టరు/గీక్టరు అనీ, నెలరోజులు సినిమా చూడొద్దనీ, చూసినా అరగంట మాత్రమే అనీ అంటారు ఏమిటండీ....ఆ బిరుదుకీ, వీటికీ పొత్తు కుదరదే .... ఇలాంటివి ఎన్ని తట్టుకోలేదండీ మనం....అప్పుడేమో మూడు తిట్లు-ఆరు బూతులతో ...ఇప్పుడేమో ఒక బ్లాగో/జాబో రాయటంతో అంతా సరి. తరువాత మరలా మామూలే రేపు ఇంకో క్రేజీ కాంబినేషన్ సినిమా రాగానే లుంగీ (సరేలేండి షార్ట్ ..ఓహ్ ఓహ్..చలి మొదలయ్యింది కనుక జీన్స్) ఎగబట్టి లైన్ లో ఫస్ట్ ఉండేది మనమే...ఎందుకంటే మనకి ఇచ్చిన బిరుదుకి సార్ధకం చేయాలి .. అలా చేయటంలో మనకి మనమే సాటి కనుక ... అదేనండి ఎంతైనా మనం తెలుగు సినిమాభిమానులం కదా!!!!!!!


నేనుసైతం on Oct 26, 2007, 4:43:00 PM   said...

అందుకే నాలాగా బ్లాగుల్లో రివ్యూలు చదివి సినిమాకు వెళ్ళలో లేదో నిర్ణయించుకోవాలి :) చక్కగా వారాంతాల్లో పాత ఆణిముత్యాలు చూసుకుంటూ, హేపీడేస్ లాంటి సినిమాలకోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తుండం మంచిది.ఈ వారం మా ఊరిలో ఉంది.కనీసం ఒక వెయ్యి రూపాయిలు మిగిల్చినందుకు నెనర్లు.
-నేనుసైతం


తెలుగు'వాడి'ని on Oct 26, 2007, 5:25:00 PM   said...

@ నేనుసైతం గారు, కృతజ్ఞతాభినందనలు, మీ వ్యాఖ్యకు. మాదీ అదే బాట అండి :-) అందుకే సైనికుడు కి అశ్వనీదత్ పేరు చూసి, SDZ కి కరిష్మా కోటక్ ఫేసు చూసి, మున్నా/ఆట లో ఇలియానా ఉందన్ తెలిసి కూడా, మొదలగు వాటికి రివ్యూల దాకా ఆగి కొంచెం డాలర్లు మిగిల్చామండి. కానీ ఇక్కడ నిర్మాత అన్న, అందులో పోకిరి తరువాత ఒకటి దొబ్బింది అట్టర్ ఫ్లాప్ గా, కనుక దీంట్లో ఏదో ఉంటుంది, కష్టపడి తీసుంటారు అని కొంచెం (చాలా రోజుల తరువాత) తొందరపడ్డాం. అంతే దర్శకుడి చేతుల ముద్రలు మా చెప్పుల మీద - మా చెప్పుల సోల్ గుర్తులు మా చెంపల మీద :-( .....


తెలుగు వీర on Oct 27, 2007, 1:31:00 AM   said...

అమ్మో!! మొత్తానికి మీరు రసికులే ;-) నా నెత్తి కాపాడినందుకు నెనర్లు


కొత్త పాళీ on Oct 27, 2007, 8:11:00 AM   said...

నవీన్ కామెంట్ అదుర్స్. నాదీ ఇదే పద్ధతి.


amanaceo on Nov 7, 2007, 7:51:00 AM   said...

Thank you తెలుగు వాడు గారు. నేనూ ఒక 20 డాలర్లు సేవ్ చేసాను. మా మామ గారిని దించి వచ్చాను. ఆయనికి మామూలుగా నచ్చని సినిమా వుండదు. అతిధి ని తెగ తిట్టుకున్నారు. i felt like a wise man (having read your blog previously) while my fil was cursing the movie during our ride back.


తెలుగు'వాడి'ని on Nov 8, 2007, 12:04:00 PM   said...

@amanaceo గారు ! మీకు రెండు విధాలా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ... మొదటిది మీరు ఈ బ్లాగు చదివినందుకు, రెండవది కొద్ది కాలం తరువాత కూడా గుర్తుపెట్టుకొని మరలా వచ్చి ఈ కామెంట్ రాసినందుకు.

మీరు $20 మిగిల్చారని చెప్పినందులకు నా ఈ బ్లాగ్ పోస్ట్ యొక్క ఒక ఉద్దేశ్యం నెరవేరినట్టే...ఇక రెండవది అంటారా అదేనండి మహేష్/నిర్మాత/దర్శకులు గార్లు దీని నుంచి ఏమన్నా నేర్చుకోని మనకి కొన్ని అన్నా మంచి సినిమాలు అందించటమన్నది .... కొంచెం అత్యాశే(ఒక్క సారికే నేర్చుకుంటే వాళ్లు తెలుగు సినిమావాళ్లు ఎందుకు అవుతారు) అని తెలుసు .. అయినా చూద్దాం ... కొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుందిగా :-)


తెలుగు'వాడి'ని on Nov 21, 2007, 9:36:00 PM   said...

అయ్యో రాధిక గారు! క్షమించండి. మీరు ఆలస్యంగా చూశారండి ఈ రివ్యూని ఇది నేను సినిమా చూసిన వెంటనే (ఎంత అంటే వాయు-మనో వేగంతో) రాశానండి కనీసం కొంతమందిని అన్నా కాపాడదాము అని...ఇప్పుడు చెప్పారుగా మీ బ్లాగుకి వచ్చి మరీ చెపుతా నేను చూసిన సినిమా గురించి :-)


rajendra devarapalli on Nov 22, 2007, 8:42:00 AM   said...

అతిధి సినిమా గురించి రెండుమూడు సినిమా వెబ్ సైట్లలో నా అభిప్రాయం ఇంతకు ముందు రాశాను.సంధర్భమొచ్చింది కాబట్టి మరోసారి.ఎంత మహేష్ బాబైనా సినిమా మొత్తం ఒక్కడ్నే చూస్తూ ప్రేక్షకులు వుండాలనుకోవటం కేవలం మోకాలితో చేసే అలోచన.గతంలో అమితాబ్ బచ్చన్,రజనీకాంత్,చిరంజీవి తదితరులు ఇలాంటి ప్రయోగాలు చేసి నెత్తి బొప్పి కట్టించుకున్నారు. మహేష్ సినిమాల్లో నాని,ఒక రకమయిన ప్రయోగమైతే అతిధి వికారమైన ప్రయోగం. మంచి నటులు,పుష్కలమయిన బడ్జెట్,షూటింగ్ బండికి నత్తలను కట్టి తాపీగా తీశారు.అలాంటప్పుడు అంతిమంగా సినిమా ఎలా వుండాలి.ఈ సినిమా లా మాత్రం వుండకూడదు. గతంలో అశోక్ అనే హాహాకారపు సినిమా తీసినప్పుడు
సురెందర్ రెడ్డికి చాలా మంది చెప్పారు.కత్తులు,హత్యలున్నా లేకున్నా కధ వుండాలని,అసలు విషయం లేనప్పుడు ఎంత డాబు ఉన్నా ఉపయోగం ఉండదని.గమ్మత్తేమిటంటే సురేందెర్ రెడ్డి తన టాలెంటు మొత్తాన్ని,మహెష్ ని,రమేష్ ని కన్విన్స్ చేయటంలోనే ఖర్చు చేసేసి, దర్శకత్వానికి వచ్చేసరికి నోరు వెళ్ళబెట్టాడు.


తెలుగు'వాడి'ని on Nov 22, 2007, 9:10:00 AM   said...

రాజేంద్ర గారు! చాలా చక్కగా చెప్పారు ఈ అతిధి సినిమా మీద మీ అభిప్రాయం. కృతజ్ఞతాభినందనలు. మీరు అన్నట్టు మంచి నటులు, పుష్కలమైన బడ్జెట్ ఉండి, ఇంతకు ముందు తీసిన సినిమాపై ఇతరుల సలహాలు/అభిప్రాయాలు లెక్కలోకి తీసుకోకుండా, దర్శకుడు తన తెలివి తేటలన్నీ హీరో, నిర్మాతలను కన్విన్స్ చేయటానికి మాత్రమే ఉపయోగిస్తే, సినిమా ఎలా తయరవుతుందో...ఒక విధంగా చెప్పాలి అంటే సినిమా ఎలా ఉండ(తీయ)కూడదో ప్రత్యక్షంగా చూపించినందుకైనా ఇతర హీరో, నిర్మాత, దర్శకులకు కొంచమైనా కనువిప్పు కలిగితే (ఇంత తొందరగా అయితే వాళ్లు తెలుగు సినిమా వాళ్లు ఎలా అనిపించుకుంటారు!?) అదే పదివేలు. అలా ఆశించటం అత్యాశే అని తెలుస్తున్నా ఏదో ఇలా మహేష్ లాంటి వాళ్లు ఉన్న సినిమాలైనా కొంచెం ఎంజాయ్ చేస్తూ చూద్దామని, చూసే రోజు వస్తుందనీ.....ఎదురు చూపులతో....

ఓ తెలుగు సినీ అభిమాని


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting