చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మరియు మనలో పదేళ్లలో ఎంత మార్పు !?
కాలచక్రంలో పదేళ్లు గిర్రున తిరిగిపోయాయి. పాలక ప్రతిపక్షాల స్థానాలు మారాయి ... హైదరాబాద్, బెంగుళూరు మొదలగు సిటీల నుండి మనం అమెరికాకు వచ్చిపడ్డాము .. రూపాయి స్థానంలో డాలర్ కనపడటం మొదలెట్టింది...కానీ మారనిది, ఆరేడు (మూకుమ్మడిగా లేక బయటకు తెలిసింది) సంవత్సరాల క్రితం మొదలైన రైతుల కష్టాలు, ఆత్మహత్యలు మరియు వారి జీవన స్థితిగతులు...మారని ఆ రైతుని చూసి ఒక రైతుబిడ్డగా ఆవేదనతో ఎందుకో ఈ పదేళ్లను మననం చేసుకోవాలి అనిపించిన నా ఆలోచనకు అక్షరరూపం.
ఆనాడు :
మనకు ఈ బిల్లు(క్లింటన్, గేట్స్)లు మాత్రమే చాలన్నావు .. అదే అభివృధ్ధిపధమని ఊదరగొట్టేశావు మా తండ్రులకు....
ఆ పిచ్చి మా తండ్రులేమో ఇద్దరు బిల్లులలో ఒక్కరైనా తన రెండు బిల్లు(విద్యుత్తు, అప్పు)లలో ఏ ఒక్కటైనా తీరుస్తారేమో, చిల్లులు పడిన తన భార్యాపిల్లల గుడ్డలకైనా అతుకులు వేస్తారేమో, కాలే కడుపులకింత గంజైనా పోస్తారేమో అని ఎదురుచూస్తూ ....
మీకు ఈ బిల్లు(క్లింటన్, గేట్స్)లు కాదు, అసలు ఏ బిల్లులు లేకుండా చేస్తాను ... అంతా ఉచితమే అని అడుగడుక్కీ చెప్పావు....అంతా మన చేతుల్లో ఉందని అన్నావు ...
పిచ్చిగా నమ్మారు నీ ఉచితాన్ని, పాదయాత్రను, చెప్పిన ఇందిరమ్మ రాజ్యాన్ని, తెగిపోయిందన్న ఆవేశపు నరాన్ని, చలించిపోతుందన్న నీ మనస్తత్వాన్ని...అందుకే అందించారు జీవితంలో ఒక చివరి అవకాశాన్ని
ఈనాడు :
పేదలకు, రైతులకు సంస్కరణ ఫలాలు అందాలంటున్నావు ... అందుకే ఒకప్పుడు హైటెక్కు బాట పట్టావనీ, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయనీ అంటున్నావు
అదే పిచ్చి పేదలు, రైతులేమో తినటానికి ఒక ఫలమిచ్చిన చాలు ... పండించిన పంటకు సరైన ధర ఇచ్చిన చాలు ... భార్యల పుస్తెలకు నూరేళ్ల గారంటీ కనిపించిన చాలని ... నీ వెంబడి పరుగులు తీస్తూ.......
అయినదానికీ కానిదానికీ ఆ తొమ్మిదేళ్ల పాలనతోనే పోలుస్తున్నావు .... వాళ్లు ఇంతకన్నా ఏమి పీకారు అని ఎదురు చెపుతున్నావు ... గట్టిగా అడిగితే బూతుల చిట్టా విప్పుతున్నావు
కానీ ఇచ్చిన వాగ్ధానం ఒక్కటి మాత్రం నిజంచేసి చూపిస్తున్నావు .... అదే దోచుకోవటమన్నది,కాల్చి చంపటమన్నది,పచ్చని పంటలు పరిశ్రమలకు పంచటమన్నది పూర్తిగా ఉచితంగానే కానిస్తున్నావు ...
మరి వచ్చిన లేదా మనకు కనిపించే మార్పేమిటంటారా .....
మన రాష్ట్రంలో :
పాలక-ప్రతిపక్షాల స్థానాలు మరాయి..చంద్రయ్య బదులు రాజయ్య వచ్చాడు
మారింది స్థానాలు, మనుషులే..అంతరంగాలు ఒకటే..అందినకాడికి సంపాదించటం..అయినవాడికి అప్పనంగా దోచిపెట్టటం
విధానాలు అవే ..ఆచరణకూడా అదే .. కానీ చెప్పే భాషలోనే తేడా అంతే
బాబు గారేమో : మనం ముందుకు పోతున్నాము అని తెలియజేసేవారు
రాజు గారేమో : ముందుకు పోయి చేసేదేమీ లేదని తెలియజేస్తున్నారు
మన కుటుంబాలలో :
మన 'ఆ' బాబు .. ఈ 'మన' బాబులో(గా) క(అ)నిపిస్తున్నాడు
మన 'ఆ' అమ్మ .. ఈ 'మన' అమ్మాయిలో(గా) క(అ)నిపిస్తుంది
ఆనాడు ....
నెత్తిమీద తెల్ల కండువా తో మన నాన్నోడు ....
అడిగాడు నన్ను లాప్-టాప్ ల లాజిక్కు, హైటెక్కుల జిమ్మిక్కు గురించి
అర్ధంకాకున్నా ఆదరించారు నిన్ను మరో అయిదేళ్లు ...
ఎండకన్నెరుగకగ పెరిగినా,కూలీనాలీకి వెళ్లకపోతే జరుగదని తెలుసుకున్న మన అమ్మ
ఒంటిమీద తెల్లబట్టలు నెత్తికి కండువా చూసారు నీ మీద, ...
చూసుకున్నారు నీలో మరో రైతన్నను అందుకే అందించారు ఊహించని అఖండ విజయాన్ని
ఈనాడు ....
నడ్డిమీద నల్ల జీన్స్ ఫ్యాంట్ తో మన చంటోడు ...
అడిగాడు నన్ను రైతంటే ఎవరని, వరి అంటే ఏమిటని
రాజు, బాబుల గెలుపోటముల చిరు రహస్యమేమిటని ...
అంధ్రప్రదేశ్ ని చూసి రాత్రికి రాత్రే ధనవంతులవ్వచ్చు అనుకునే మన అమ్మాయి
సంపాదించటమింత తేలికని కనిపిస్తుంటే .. ఎందుకునాన్నా మనకేమీ ఆస్తులు లేవనీ, ఎందుకొచ్చాము ఈ దేశమనీ
చూపులతోనే ప్రశ్నిస్తుంటే ఇది నా చేతకానితనమా అని ... వలస వచ్చినది నా అసమర్ధతవలనా అని
అప్పుడైనా ఇప్పుడైనా ... తెల్ల మొహం వేయటమే మాకు తెలిసింది....
కష్టమైన ప్రశ్నలు కావవి కానీ సరళంగా సమాధానం చెప్పలేని బేలతనమది
నూరేళ్ల అనుభవసారం ఒక వైపు ... నూరేళ్ల జీవిత భవితవ్యం మరొక వైపు
నడుమన నన్ను వుంచి సంధించిన ప్రశ్న ఒక్కటే...నమ్మవలసిందెవరినని :
హైటెక్కు బాట పట్టిన బాబునా .... రైతన్న పాట పాడుతున్న బాబునా...
రైతన్ననని చెప్పిన రాజునా ... దోపిడీని మౌనంగా చూస్తున్న రాజునా
ఒక్కటి మాత్రం నిజం ... నాకు అర్ధమైన పచ్చి నిజం ....
కొడుకుగా ఆనాడు ... తండ్రిగా ఈనాడు ... ఏ బాబు(అమ్మ(యి))కి గూడా అర్ధమయ్యే రీతిలో సమాధానం చెప్పలేని నిస్సహాయుడనని
మారనిదేమో ఛిద్రమైన రైతు కుటుంబాల జీవన స్థితిగతులు మరియు నిరుపేదల బతుకు వెతలు అనీ
అందుకే ఓ చంద్రయ్య, రాజయ్యలూ ...
ఎందుకు మా మీద ఇంత కోపం .. ఎందుకు మా జీవితంతో ఆడుకోవటం
వదిలెయ్యండయ్యా మా తరాన్ని ... ఆడుకోకండయ్యా మా తలరాతల్ని
పశ్చాత్తాపానికి మించిన ప్రాయాశ్చిత్తం లేకపోవచ్చు ...
అలాగే ఫలానా సమయంలోపలే పశ్చాత్తాపం కలగాలన్న నియమం ఉండకపోవచ్చు
క్షమాగుణం అనేదొకటుందని మాకందరికీ గుర్తుండి ఉండవచ్చు
అలాగే క్షమించటం అన్నది మన రక్తంలో, సంస్కృతిలో భాగమై ఉన్నదని మాకు తెలిసుండవచ్చు
పశ్చాత్తాపం మీద నమ్మకం పోయేటట్టుంది మీ ఈ కొత్త మాటలను వింటుంటే
క్షమాగుణం అనేది ఉన్నదని మరచిపోవాలనిపిస్తుంది .... మీ ఈ సరికొత్త రూపాన్ని(పాలన) చూస్తుంటే
రైతు ఆత్మహత్యలకు ఒక్క చంద్రబాబు మాత్రమే కారణం కాకపోవచ్చు కానీ, వ్యవసాయం అనే ప్రయోగంలో 'లాభసాటికాదేమో, శాస్త్రీయ పధ్ధతులు అవలంబించాలేమో, Mktg & Distribution వ్యవస్థను సరిచేయాలేమో' అనే పెద్ద ఉత్ప్రేరకాలకు 'చంద్రబాబు హైటెక్కు, రైతుల వ్యతిరేక విధానాలు' అనే ఒక అతి పెద్ద ఉత్ప్రేరకం తీక్షణంగా పనిచేయగా వచ్చిన వ్యతిరేక ఫలితమే రైతు ఆత్మహత్యలన్నది నా అభిప్రాయం.
ఇరువదిఅయిదు సంవత్సరాల రాజకీయ జీవితంలో (అతి కొద్దికాలం తప్పించి) ఎలాంటి అధికార పదవినీ అధిష్టించక, తన జీవిత పరమపద సోపాన పటంలో ఎక్కిన ఒకే నిచ్చెన ఏకంగా చివర గడిలోకి చేర్చిననూ, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికీ రాని అవకాశం (అంటే పీఠాన్ని అధిష్టించేటప్పుడే అయిదు సంవత్సరాలు ఖచ్చితంగా ఉండితీరుతారు) చేజిక్కుంచుకుని కూడా(ఇప్పటిదాక చెప్పిన కారణలన్నిటి చేత నాకు ఎందుకో రాజశేఖరరెడ్డి గారి మీద అపరితమైన నమ్మకం ఉండేది ఒక మనీషిగా మిలిగిపోవటానికి , మన రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించటానికి, పేద-బడుగు-రైతు ల బతుకులలో వెలుగులు కురియించి ఓ ఆరాధ్యదైవంగా మిగిలిపోవటానికి నిత్యకృషీవళుడై ఈ పదవి-అధిక్కారాన్ని ఒక తపస్సుగా భావించి చేసితీరుతాడు అని) 'అవినీతి, లంచగొండితనం, ఆశ్రితపక్షపాతం, నిర్లక్ష్యపు పాలన' అనే సరికొత్త ఉత్ప్రేరకంగా మారుటచే ఆ రైతు ఆత్మహత్యలే ఇంకా కొనసాగటానికి కారణమని నా అభిప్రాయం...
అదే ఫలితం ... నిండునూరేళ్ల జీవితం వారి చేతుల్లో పెట్టే రైతన్నల లలాట లిఖితం ... కనుచూపు మేరనైనా కనిపించని సహాయ ప్రయత్నాలు..
అందువలన
గతించిన వారెందరో.....గతిలేక దినసరి కూలీలుగా మారినదెందరో.... పస్తులున్నదెందరొ ... పుస్తెలమ్మిన దెందరో .. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భూములను అమ్ముకున్నదెందరో .. ప్రాణమున్న జీవఛ్ఛవాలుగా బ్రతుకు బండినీడుస్తున్నదెందరో ..మా తండ్రుల ప్రాణమే ఈ భూమనీ ... ఈ వ్యవసాయమే మాకు వారసత్వమనీ గర్వంగా చెప్పలేని, చెప్పుకోలేని స్థాయికి దిగజార్చావు, అదే వ్యవసాయాన్ని అపహాస్యం చేశావు.
అవకాశాలు వెదుక్కుంటూనో, అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనో, చితికిపో(వుచున్న)యిన మా కుటుంబాలను కాపాడుకోవటానికో, వ్యవసాయం వంటబట్టకనో(వంటబట్టించుకోవటం ఇష్టంలేకనో) .... పుట్టిపెరిగిన ప్రాంతాన్ని వదిలి వచ్చి అంతో ఇంతో సంపాదించుకున్నందుకు, మా రైతులను, రైతు కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగానే తెలుసు.
ఈ సమస్యకు పరిష్కారపు దిశగా, ప్రోదిచేసుకున్న నా ఆలోచనలు : ఓ రైతుబిడ్డగా నా అంతఃసంఘర్షణకు ప్రతిరూపంగా తదుపరి కార్యాచరణగా ...
ప్రత్యామ్నాయం లేకనో........మా క్షమాగుణ(18 నెలల్లో మీ విషయంలో ఇది అనేది ఉందని మర్చిపోవటానికి పూర్తిగా కృషి చేస్తాము) సంపత్తిచేతనో....లేక మా ఖర్మ సంపూర్తిగా కాలితేనో... మరలా మీరు అదికారంలోకి వస్తే ...
నిజమైన పశ్చాత్తాపమంటే ఏమిటో తద్వారా ఈ రైతన్నలకు ప్రాయాశ్చిత్తంగా చేయగలిగేది సంపూర్తిగా చేసి చూపించండి....
మనిషిగా పుట్టడం దేముడిచ్చిన వరం.
మనిషిగా పెంచ(బడ)డం మీ తల్లిదండ్రుల సంస్కార, బాధ్యతల, పుణ్య ఫలం.
మనిషిగా ఎదగటానికి మీరు నేర్చుకున్న చదువు,మిత్రుల వల్ల వచ్చిన అవకాశం.
మనిషిగా నిలబడటానికి, సాటి మనిషికి సాయంచేయటానికి అన్న(అమ్మ)గారు మీకు అందించిన ఆశీర్వాదఫలితం.
మనీషిగా నిలిచిపోవటానికి ఇచ్చిన 9(3.5)సంవత్సరాల అవకాశాన్ని వ్యర్ధం చేసుకోవటం పేద, బడుగు, రైతుల పరంగా క్షమించరాని నేరం....
ఒక మనిషిగా మిగిలి పోతారో ... మనీషిగా మారిపోతారో ... మీ చేతుల్లో ఉంది ... అది చేతల్లో చూపించండి....
2
వ్యాఖ్యలు:
- సూర్యుడు on Dec 1, 2007, 7:04:00 AM said...
-
అమెరికా లో చల్లగా కూర్చుని ఆంధ్ర రాష్ట్ర పేద రైతు జీవితాన్ని ఎంత చక్కగా వర్ణించారో, అనుభవవిస్తున్న పేద రైతు కూడా అవాక్కైపోవల్సిందే. నా తలపై తలపాగా (you can consider as a hat of a farmer) లేకపొయింది, లేకపోతే తప్పకుండా తీసేవాణ్ని ;)
సూర్యుడు
- Anonymous on Sep 16, 2010, 4:02:00 AM said...
-
okkasaari america vaste telustundi.... kinda manta... pina chali