వీరి పొరపాటో, అవతలి వారి గ్రహపాటో .. వార్తలు ప్రచురించే విధానం ఇలాగేనా ?
ఏమి వ్రాస్తున్నామో అనే స్ఫృహ లేకపోవటమో లేక ఏదో ఒకటి వ్రాసేద్దాము అనే ఆతృతతో ఉండటమో లేక మేము ఏది వ్రాస్తే అదే వార్త అనే భ్రమో/గర్వమో తెలియదు గానీ వీళ్ల ధోరణి చూస్తుంటే ఏం చేసినా ఎలా చేసినా చెలామణి అయిపోతుందిగా అనే భావనే కనిపిస్తుంది ... వీటికి ఉదాహరణలు ఎన్ని కావాలంటే అన్ని కనిపిస్తున్నాయి మనకి ఈ మధ్య కాకపోతే నాకు ఇప్పుడే కనిపించిన ఇలాంటి మరొక వార్తను మీకు తెలిపరచాలనే ప్రయత్నమిది.
పొరపాట్లు అనేవి మానవ సహజం ... కాకపోతే కొన్ని కొన్ని విషయాలలోనైనా ఎట్టి పరిస్థితులలోనూ కనీసం ఆ పొరపాట్లకు తావులేని విధంగా ఉండటానికి ప్రయత్నించటంలోనే గొప్పదనం కనిపిస్తుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది అవతలి వ్యక్తి లేక అతని కుటుంబ సభ్యుల చావు వార్తలు.
గత వారంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ముగ్గురు(కల్పనా రాయ్, లక్ష్మీపతి, కునాల్) వేర్వేరు కారణాలతో చనిపోవటం ... అందులోనూ వీరిలో ఒకరికి (లక్ష్మీపతి) సంబంధించి, తన తమ్ముడు శోభన్ కూడా గత కొద్ది రోజుల క్రితమే చనిపోవటం ... వీరిద్దరూ ఒకే కారణంతో (గుండెపోటు ... ఇద్దరికీ మరో పోలిక ఏమిటి అంటే విపరీతంగా తాగుడు అలవాటు అందువలనే చనిపోయి ఉండవచ్చు అని) చనిపోయిన విషయం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది.
ఇదే బాధామయమైన సంఘటనల క్రమంలో అదే చిత్ర పరిశ్రమకు సంబంధించిన కృష్ణవంశీ గారి తమ్ముడు చనిపోతే (గుండెపోటుతో), AndhraVilas.com అనే site లో వారు ప్రచురించిన వార్త (ఇప్పుడు మార్చారులేండి.) చూడండి ఈ క్రింద ఉన్న image లో ...
ఇది ఖచ్చితంగా అనుకోకుండా జరిగిన తప్పులాగానే అనిపిస్తుంది .. లేదా అయ్యుండవచ్చు ...
నేను ఇది ఇంతగా విశ్లేషించి, విశదీకరించి వ్రాయటానికి ప్రధాన కారణం .. ప్రస్తుతం మన మీడియా అంతా ఎలాంటి విషయాన్ని అయినా sensational గా మార్చటానికి ఏ మాత్రం సందేహించకపోవటం ... వాళ్ల TRP Ratings పెంచుకోవటానికి ఏ స్థాయికైనా దిగజారటం చూస్తుంటే .... కలిగే ఏహ్యభావాం మాటల్లో చెప్పలేనిది.
ముందుగా వీరే ఆ వార్త అందించాలి అన్న తాపత్రయమో లేక మన site కి హిట్లు పెంచుకోవాలి అన్న తహతహో తెలియదు గానీ .. నేను పైన చెప్పినట్లు ... చావు లాంటి కొన్ని విషయాలలో కూడా వీరు జాగ్రత్త తీసుకోక పోవడం చూస్తుంటే ... వీరి నిర్లక్ష్యానికి ఏ శిక్ష వేసినా సరిపోదేమో అనిపిస్తుంది....
ఒక రోజో, రెండు రోజులో పోయిన తరువాత తప్పు తెలుసుకునో లేక వీళ్ల ప్రయోజనం(హిట్స్, రేటింగ్స్) నెరవేరిందనో అనిపించిన తరువాత ఎన్ని మార్పులు, చేర్పులు చేస్తే ఏమిటి ఉపయోగం .. అప్పటికే జరగవలసిన damage జరిగిపోయింది...
మీడియా(ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్) అనేది ఎంతటి ప్రభావవంతమయినదో, అందులో వచ్చే ఏ వార్త అయినా దావానలంలా వ్యాపిస్తుందనీ, చూపిస్తున్న విషయాన్ని కొన్ని లక్షల మంది వీక్షిస్తారనీ అందువలన వారి కుటుంభ సభ్యులు అనుభవించే మానసిక క్షోభను గురించి క్షణమైనా ఆలోచించక వీళ్లు చేసే ఈ పైశాచికానందాపు వికృతచర్యలకు స్వస్తివాక్యం పలికే రోజు ఎప్పుడు వస్తుందో ...
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::