నన్ను దోచుకొందువటే

Posted by తెలుగు'వాడి'ని on Monday, September 22, 2008

నాకు బాగా నచ్చిన సినిమాలు, పాటల గురించి చెప్పాలి అనుకున్న టపాల క్రమంలో ఇంతకు ముందు టపా మౌనంగానే ఎదగమనీ - నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ సినిమాలోని పాట చూశాము కదా .. ఈ టపాలో మరొక పాట చూద్దాం ...

అది గులేబకావళి కధ లోని నన్ను దోచుకొందువటే అనే పాట ..

నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి ..

ఆ అందం, అభినయం, సాహిత్యం, సంగీతం ... ముఖ్యంగా, మరీ ముఖ్యంగా అన్నగారి ఆహార్యం ... ఒకటేమిటి .... అన్నీ ... అన్నీ .... నిజంగా అత్యంతాధ్భుతం ... అది మాటలకందని భావం ... కనురెప్పవేయటం మరచిపోయేలా చేసే మహత్తు.

అసలు రాజకుమారులు అనేవారు ఎలా ఉండాలో, ఎలా ఉంటే బాగుంటుందో ...ఒక్కముక్కలో చెప్పాలంటే ఇలానే ఉండాలేమో, ఇలా లేకపోతే వారిని రాజకుమారులు అనకూడదేమో అనేలా ఉండే అన్నగారి రూపురేఖలు, ఆహార్యం ... ఓహ్, ఎంత చెప్పినా తక్కువేనేమో ... చూడటానికి రెండు కళ్లు, రాయటానికి ఒక్క టపా సరిపోవేమో ...


.......... ఆ ముగ్ధమనోహర సౌందర్యం ... రూపురేఖలావణ్యాలు .... ఓహ్! ఏమని/ఎంతని వర్ణించగలం ....

నేల రాలిన ఆ పువ్వు లేక నేలనే ఉన్న ఆ గడ్డిపువ్వుకు తన అడుగుల సవ్వడి లేక తన పాదధూళి వలననైతేనేమి ఇబ్బంది కలుగకూడదన్నట్టుగా అల్లనల్లన అడుగులు కదిపే ఆ రాయంచ నడకల గురించి వర్ణించుట కన్నా వీక్షించుట బహు బాగు.........
ఇంత ఉపోధ్ఘాతం ఎందుకులేండి ... అసలు పాట చూస్తే చాలేమో కదా ..

ఇదుగోండి పాట .....

కింద ఉన్న లింక్ ను నొక్కండి

నన్ను దోచుకొందువటే - గులేబకావళి కధ

లేదా చూడండి మరి ఇక్కడే ...తాత గారి ఇంటి ఆవరణలో ఆరుబయట రాజసంగా మంచం మీద పడుకుని [ మా ఇంటి ముందు సినిమా వేసుకోవటానికి అనుమతిచ్చినందుకు ఆ మాత్రం ఉండాలి కదా ] పౌర్ణమి రోజున పల్లెటూళ్లో తెర మీద ఈ పాట చూస్తుంటే అదో అనిర్వచనీయమైన, అందమైన అనుభూతి, సుమధుర జ్ఞాపకం.... (ఎన్ని సార్లు చూశామో లెక్కే లేదనుకోండి)

అ తెరపైనున్న పున్నమి చంద్రుడు, నా తలపైనున్న వెన్నెలరేడు సైతం చిన్నబోయి ఉంటాయనిపిస్తుంది ... తెరపై కదలాడే సౌందర్యం రాజసం కలబోతగా అనిపించే అన్నగారు, జమునలను చూసి.

నలుపు తెలుపుల్లో ఉండటం వలన అన్నగారు-జమునల అందం ఇనుమడించిందో, నలుపు తెలుపుల్లో ఉన్నా అన్నగారు-జమునల అందానికి ఇంత కూడా నష్టం జరగలేదో అనిపిస్తుంది ...వీలుంటే ఇలాంటివి మరలా కొన్ని చూద్దాం అతి త్వరలో ...

24 వ్యాఖ్యలు:

రమణి on Sep 22, 2008, 10:05:00 PM   said...

ఎస్ నాకు చాలా ఇష్టమైన పాట
"నన్ను దోచుకొందువటే వన్నేల దొరసాని"
"కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ" అంటూ .. బాగుంటుంది బయట అరుగుమీద అమ్మమ్మ మడతమంచం వేసుకొని, పక్కన మేమంతా అరుగు మీద కూర్చుని మీరు చెప్పినట్లుగా తెర మీద మేము చూసిన సినిమా "గుండమ్మ కథ" అది కూడా బాగుంటుంది.
"కోలు కోలుయన్న కోలో నా స్వామి కొమ్మలిద్దరు మాంచి జోడు" అంటూ పిల్లలమంతా లేచి బాగా డాన్స్ చేసినట్లుగా గుర్తు. ఆ రోజులు, ఆ కల్మషంలేని బాల్యం ఆ ఆటలే వేరండి. తలుచుకొన్న కొద్దీ ఓ తీయటి అనుభూతి కలుగుతూ ఉంటుంది.


రమణి on Sep 22, 2008, 10:09:00 PM   said...

మౌనంగానే ఎదగమని అన్న పాట లో ఈ చరణం బాగుంటుంది
"అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది,
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది"
నాకు ఇష్టమైన పాటే.
మొత్తానికి సాంకేతిక సలహాలు , రాజకీయలు మొ! ఎక్కువగా ఆలోచించే తెలుగు 'వాడి ' ని గారు భావుకత దారి పట్టారు..ఆ స్పెషల్ ఏంటో చెప్తే మేము కూడా మీ ఆనందంలో పాలుపంచుకొంటాము కదా.


Anonymous on Sep 22, 2008, 10:39:00 PM   said...

అయ్ బాబోయ్,మీ టపా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి పొయింది.
వెన్నెల్లో వీధి సినిమాలు చుసిన జ్ఞాపకం ,ఒక్కసారి మనసంతా కమ్మేసింది.
ఇంట్లోవాళ్ళకి తెలియకుండా ,ఎవరైనా చుస్తారేమో అని భయం,భయం గా ఏ గోడ చాటునో నక్కి
వీధి సినిమాలు చుసేవాళ్ళం .మర్నాడు గుసగుసగా పాటలు పాడుకొనేవాళ్ళం.
పైకి పాడితే రాత్రి సినిమాకి వెళ్ళిన విషయం పెద్ద వాళ్ళకి తెల్సిపోతుందిగా!
మీ టపా ఒక మధురమైన జ్ఞాపకాన్ని తట్టి లేపింది.thankyou


Anonymous on Sep 22, 2008, 10:40:00 PM   said...

అయ్ బాబోయ్,మీ టపా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి పొయింది.
వెన్నెల్లో వీధి సినిమాలు చుసిన జ్ఞాపకం ,ఒక్కసారి మనసంతా కమ్మేసింది.
ఇంట్లోవాళ్ళకి తెలియకుండా ,ఎవరైనా చుస్తారేమో అని భయం,భయం గా ఏ గోడ చాటునో నక్కి
వీధి సినిమాలు చుసేవాళ్ళం .మర్నాడు గుసగుసగా పాటలు పాడుకొనేవాళ్ళం.
పైకి పాడితే రాత్రి సినిమాకి వెళ్ళిన విషయం పెద్ద వాళ్ళకి తెల్సిపోతుందిగా!
మీ టపా ఒక మధురమైన జ్ఞాపకాన్ని తట్టి లేపింది.thankyou


అబ్రకదబ్ర on Sep 22, 2008, 10:57:00 PM   said...

అన్నగారి వర్ణన ఓకే కానీ జమునదే....

ఆమెకన్నా కృష్ణకుమారో సరోజాదేవో అయితే మరింత బాగుండేదేమో.


చైతన్య on Sep 22, 2008, 11:05:00 PM   said...

ఆ పాత మధురాలను గుర్తు చేశారు. "నన్ను దోచుకొందువటే" ఆల్ టైం నా ఫేవరెట్ సాంగ్.


జ్యోతి on Sep 22, 2008, 11:22:00 PM   said...

అబ్బా! ఈ పాట నాకు కూడా చాలా చాలా ఇష్టం. అందునా ఎన్టీవోడి అందం మాత్రం అదుర్స్.. మావారు కూడా అంటారు. ఎన్.టి.ఆర్ అంత అందమైన వాళ్లు ఉన్నారా అని. ఇక జమున కూడా .. అసలు వాళ్లు అందంగా ఉన్నారా? నిర్మాత దర్శకులు అంత అందంగా చూపించారా అనిపించింది. ఆ పాటలో అందంగా లేనిది ఏదీ లేదు అనిపిస్తుంది నాకైతే. కొత్తపెళ్ళికూతురు,పెళ్ళికొడుకు నిజంగా అంత ముద్దుగా, అందంగా ఉండాలని అనుకుంటాను. థాంక్స్ ఫర్ ఎ బ్యూటిఫులు మెమరీ..


కత్తి మహేష్ కుమార్ on Sep 23, 2008, 12:28:00 AM   said...

ఈ పాటకి ఇంకో ప్రాముఖ్యత ఉంది. ప్రముఖ కవి డా"సి. నారాయణ రెడ్డిగారు రాసిన మొదటి సినీగీతం ఇదే అనుకుంటాను.


సుజాత on Sep 23, 2008, 2:10:00 AM   said...

అవునండి! రాజకుమారుడు అంటే ఇంకెవరూ కాదు, ఎప్పటికీ ఎన్ టీ ఆరే! రాకుమార్తెలు ఎవరైనా ఒకటే! అంత అందమైన వాళ్ళు ఇంకెప్పటికైనా పుడతారా అసలు!


ఆ పెదవి వొంపులో దాగే నవ్వు నాకెప్పుడూ మిస్టరీయే!

సాంకేతికాల నుంచి మంచి పాటల పూలబాట పట్టారు. ఇలాగే మరిన్ని మంచి పాటల గురించి రాస్తే ఆందించే వాళ్ళు నాతోపాటు బోలెడుమంది.


సిరిసిరిమువ్వ on Sep 23, 2008, 2:16:00 AM   said...

మంచి పాట.వీధి సినిమాలని భలే గుర్తు చేసారు. మా పిన్ని వాళ్ళ దొడ్డి మీద ఇలానే సినిమాలు వేసేవాళ్ళు. పిల్లలం చాపలో మంచాలో వేసుకుని పడుకుని మరీ చూసేవాళ్ళం. పాత సినిమాలు ఎక్కువగా అలా చూసినవే.

ఆ పాత మధురాలు అని ఓ టపాల పోటీ పెడితే ఎలాగుంటుందంటారు.


Anonymous on Sep 23, 2008, 4:50:00 AM   said...

ఈ పాట మంచిదే కానీ. మరీ అన్నమీద ఇంతపిచ్చా? నాకేమో అన్న స్టెప్పులు, బెల్ బాటమ్స్, చాటల కాలర్లు గుర్తుకొస్తున్నాయి. మేధావులలో కూడ ఈ వ్యక్తి పూజ ఏమిటి? కులం ఒక కారణమై ఉండవచ్చు అనుకుంటున్నా. బబుచి బబుచి. ఇక రెచ్చిపో.


Purnima on Sep 23, 2008, 6:27:00 AM   said...

భలే మంచి పాట! మరిన్ని పాటలు రాయగలరని ఆశిస్తున్నాను.


నిషిగంధ on Sep 23, 2008, 6:53:00 AM   said...

వాహ్వా ఏం పాట!! ఆ మనోహరమైన నవ్వు.. ఆ అర్ధచంద్రాకార తిలకం.. సుజాత గారన్నట్టు అసలు రాజకుమారుడు, జగదేకవీరుడు అంటే ఎంటీఆరే!!


అబ్రకదబ్ర on Sep 23, 2008, 9:54:00 AM   said...

అనామక మహాశయా,

కొన్ని విషయాలు నచ్చటానికి కులంతో పని లేదు. నాకు తెలిసి, ఇక్కడ రామారావుని ఎత్తేస్తున్న వాళ్లంతా ఆయన కులపోళ్లు కాదు. అయినా, రామారావు కులస్థులు ఆయన్ని ఇష్టపడటం నేరమా?

ఎన్టీయార్ చాట కాలర్లు, బెల్ బాటమ్స్ ఇప్పుడు నవ్వులాటగా ఉంటాయి కానీ ఆ కాలంలో అదే ట్రెండ్. మీ నాన్నగారినడిగి చూడు ;-)

వీలయితే ఓ సారి రామారావుది 'చిరంజీవులు' కానీ 'మల్లీశ్వరి' కానీ చూడండి. ఓవర్ యాక్టింగే కాదు, అతి సున్నితంగా కూడా రామారావెలా నటించగలడో మీకర్ధమవుతుంది.

@తెలుగువాడిని:

మా కామెంట్లు ప్రతిసారీ మీ అనుమతి కోసం ఎదురు చూడాల్సి రావటం కాస్త విసుగ్గా ఉంటుంది. కాస్త ఉదారంగా ఉండు బాబూ.


రమణి on Sep 23, 2008, 10:27:00 PM   said...

ఇలా కులం పేరు చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలకి అనుమతివ్వద్దు తెలుగు వాడి ని గారు. అబ్రకదబ్ర గారు అభినందనలు. చాలా కరెక్ట్ గా చెప్పారు జవాబు.


వేణూ శ్రీకాంత్ on Sep 24, 2008, 8:21:00 PM   said...

చాలా మంచి పాటని గుర్తు చేసారు తెలుగు వాడిని గారు.
@ అనామకా
అబ్రకదబ్ర గారన్నట్లు అన్నగారి చాట కాలర్ లు బెల్బాటం లు అప్పటి ట్రెండ్ కు అణుగుణం గా వాడారు కానీ తనవి పాత సినిమాలు ఒక సారి చూడండి మీ మాటలు మీరే వెనక్కి తీసుకుంటారు. ఆ తరం ఈ తరం, ఆ కులం ఈ కులం అనే తేడా లేకుండా అందరికీ నచ్చితీరుతుంది అప్పటి ఆయన నటన.


తెలుగు'వాడి'ని on Sep 26, 2008, 11:20:00 AM   said...

రమణి గారు : ఆదివారం నుంచి ఇక్కడ ఒక పనిలో(!?) చాలా చాలా చాలా బిజీ బిజీ (ఏమీ పనీపాటా ఉండదు అన్నమాట .. full ఖాళీ) ...అందునా ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయం లేదు :-( చేతివేళ్లు కట్టివేసినట్టు అయిపోవటంతో, మనసు రెక్కలు విప్పుకొని అలా అలా ఏటో వెళ్లిపోయింది అంతే ...

భావుకతకేం (మొదటినుంచీ) చాలా ఉందండి .. కానీ బ్రహ్మీ అయిన తరువాత ఉన్నదంతా సర్దుకుంది ... ఆ ఉన్న ఒకటో రెండో చుక్కలు బయటకు తీయాలంటే చాలా కష్టపడాలి .. ఎందుకంత బాధ ... తేలికగా నాలుగు సాంకేతిక విషయాలు రాసుకునేదానికి .. అదీ మన ఆలోచనా విధానం :-)


తెలుగు'వాడి'ని on Sep 26, 2008, 12:37:00 PM   said...

@అబ్రకదబ్ర : జమున ఫ్రేముల ఫ్రేములగా బాగానే ఉంటుంది ... ఖచ్చితంగా వాళ్లతో పోల్చలేము గానీ ..కొన్ని సినిమాలలో/సన్నివేశాలలో చూడ చక్కగానే ఉంటుంది. అలాంటివాటిలో ఈ పాట ఒకటి. ముందు జాగ్రత్తగా ఆ వర్ణనలో జమున పేరు ప్రస్తావించలేదు (వేరే నాయికలకు కూడా ఇదే వాడుకోవచ్చు కదా) !:-)


తెలుగు'వాడి'ని on Sep 26, 2008, 12:43:00 PM   said...

సిరిసిరిమువ్వ గారు: అధ్భుతమైన ఆలోచన. ఇంకేముంది కొత్తపాళీ గారు ఉన్నారుగా మనకి ఇలాంటి వాటిని చక్కగా సమన్వయపరచటానికి ... చూద్దాం వారేమంటారో ..


తెలుగు'వాడి'ని on Sep 26, 2008, 12:47:00 PM   said...

@మహేష్ : అది సినారె గారి పాట అని తెలుసు గానీ మొదటిది/దా అన్న విషయం నాకు తెలియదు ... కనుక్కుందాం


తెలుగు'వాడి'ని on Sep 26, 2008, 1:58:00 PM   said...

@అబ్రకదబ్ర : ఈ Comment Moderation పెట్టింది ఇదిగోండి ఇలాంటి కుల ప్రస్తావనల వ్యాఖ్యలను చేయకుండా ఉండటానికి ... మీరు చెప్పారు కదా అని మరియు ఈ సంవత్సరకాలంలో నేను రిజెక్ట్ చేసిన(చేయాలి అనిపించిన) వ్యాఖ్యలు సున్నా కాబట్టి moderation తీసివేద్దామనుకున్నా కానీ నిన్న కొంచెం బిజీగా ఉండి ఆలస్యం అయ్యింది .. అంతలోనే ఆ వ్యాఖ్య .... చదివిన (ఎలాగూ తప్పదు కాబట్టి) నాకు ఎలాగూ చురుక్కుమంటుంది ... ఆ పైన automatic గా పబ్లిష్ చేసి ఇలాంటివాటిని రచ్చ రచ్చ చేయటం ఇష్టం లేక ఈ మోడరేషన్ గొడవంతా ...


అబ్రకదబ్ర on Sep 26, 2008, 3:41:00 PM   said...

మాబోటి బుద్ధిమంతుల్ని trusted list లాంటిదాంట్లో పెట్టెయ్యొచ్చు కదా. (అదంత వీజీ కాదని తెలుసు కానీ మీ బుర్రకి పదును పెట్టే విషయం కాబట్టి ఉ.స. ఇచ్చేశా)


రాజేంద్ర కుమార్ దేవరపల్లి on Sep 26, 2008, 9:28:00 PM   said...

సినారె మొదటి సారి పాటలు రాయటం ఈ సినిమాతోనే మొదలు.ఈ సినిమాకు దర్శకత్వం వహించింది యన్.టి.ఆరే.ఆ విషయం చాలా మందికి తెలియదు కూడా.మన వాళ్ళు పైన కొందరు యంటీఅర్ అంటున్నారు,సవరించగలరు ఇకనుంచైనా.ఇక ఈ పాటను చదివి కూడా ఆనందించవచ్చు ఇలా...
పల్లవి:

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

చరణం1:

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

చరణం2:

నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ
కలసి పొదు నీలొ
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం


నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే.

అవునూ నేను అచ్చంగా ఒక సినిమాబ్లాగు ఇలాంటి పాటలకోసమే ప్రారంభిస్తే ఇక్కడ కామెంట్లు రాసినవారెవరూ అటువైపు తొంగిచూసినట్టులేదు.అయినా సరే నా ప్రతిన వీడను హ్హ్హ హ్హ హ్హా :)


కొత్త పాళీ on Sep 27, 2008, 6:56:00 AM   said...

ట్రస్టెడ్ లిష్టు అని ఒహటుందా? చెప్పండి బాబూ! కొత్త టపా రాసుకోంగానే ఎక్కడ కామెంట్లు ఇరుక్కు పోతాయోనని ఉలికి ఉలికి పడిపోతున్నాను.
తెలుగు వాడిని గారూ మొరిగే కుక్కలు ఎప్పుడూ ఉంటై. పెద్ద పట్టించుకోనక్కర్లేదు. లైట్.

@అబ్రకదబ్ర - సరోజాదేవి ఓకే. కృష్ణకుమారి నో నో. వగలరాణివి నీవే పాట కృష్ణకుమారి మీద చిత్రీకరించినదని తెలిసిన రోజున నా మనసెంత బాధపడిందో!!!


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting