గూగుల్ వాడి తెలుగు తగలెయ్య !?

Posted by తెలుగు'వాడి'ని on Thursday, August 14, 2008

ఈ రోజు నేను, నా మిత్రుడు ఒకరు GChat లో ఫలానా సమయంలో మాట్లాడదామని ముందుగానే నిర్ణయించుకున్నాం. అనుకున్న సమయానికి ఇద్దరము GChat లోకి రావడం జరిగింది కానీ ఒకరికొకరం GChat లో  on-line లో ఉన్నట్టు కనిపించకపోవటంతో తను Google లో కొత్త అకౌంట్ తెరవమని invitation పంపించాడు. ఇంతలో ఒకరికొకరు on-line లో చూసుకోవటంతో వెంటనే కబుర్లలో పడిపోయాము. కొంతసేపటి తరువాత సరే ఏదో కొత్త మెయిల్ వచ్చింది కదా అని open చేసి చూసా. ఆ invitation అంతా తెలుగులోనే ఉండటం ఒకటైతే, అందులోనూ ఇది నేను మొదటి సారిగా చూడటంతో కొంచెం ఓపిక చేసుకొని మెల్లగా చదవటం మొదలు పెట్టా. అందులో ఉన్న చాలా తెంగ్లీష్ పదాలు, ముఖ్యంగా సాంకేతిక పదాలు తెలుగులో వాడిన విధానం మనం కూడా వాడుతున్నాము కనుక అంత పెద్ద ఆశ్చర్యపరచలేదు కానీ ఒక్క పదం/వాక్యం మాత్రం దిమ్మతిరిగి పోయేటట్టు చేసింది.

అది మీకోసం ఇక్కడ ......

ఒకసారి మీరు అకౌంట్ని తెరిస్తే, <నా మిత్రుని పేరు ఇక్కడ> అది మీ ఇమెయిల్ అడ్రస్లో పొందుపరచబడుతుంది కాబట్టి మీరు Gmail తో సంపర్కంలో ఉండవచ్చు. 

అందుకే అనిపించింది ఈ గూగుల్ వాడి తెలుగు/తెగులు తగలెయ్య అని. లేక నాకు తెలియని అర్ధం ఏమన్నా ఉందా ఈ పదానికి?

వాళ్ల ఉద్దేశ్యం 'touch' లో ఉండవచ్చు అనా?

చూద్దాం! ఎంత తొందరగా గూగుల్ వాళ్లు ఈ పదాన్ని మారుస్తారో?  అదే సమయంలో ఈ గూగుల వాళ్లకి కనీసం కొన్ని పదాలకైనా  అర్ధాలు, పర్యాయపదాలు, అనువాదాలు తెలియచెప్పవలసిన అవసరం ఉంది.

*****************************************



విషయ సూచికలు :


19 వ్యాఖ్యలు:

Anonymous on Aug 14, 2008, 8:24:00 PM   said...

:-) వాడికేం తెలుసు, సంస్కృత పదమైనా ప్రస్తుతం హిందీలో బాగా వాడతారు. కానీ తెలుగులో సరిపోయే (సరైనది కాకపోవచ్చు) పదం అంటే, "సంప్రదింపులు కొనసాగించవచ్చు" అనొచ్చేమో.


Anonymous on Aug 14, 2008, 9:11:00 PM   said...

అది గూగుల్ వాడి తెలుగు కాదు, మన తెలుగు వాళ్ళ తెగులే. ఆంగ్ల పదాలను తెలుగులోకి అనువాదం చెయ్యండని కోరితే, మన తెలుగు వాళ్ళు కొందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి అనువదించారు. ఇది ఫ్రీ సర్వీసు కాబట్టి గూగుల్ వాణ్ణి వేలెత్తి చూపలేం.


Anonymous on Aug 14, 2008, 11:57:00 PM   said...

ఆ "సంపర్కం" అనే తెగులు భవదీయుడిదే! తప్పుగాతోస్తే నన్ను మన్నించాలి.


Anonymous on Aug 15, 2008, 12:15:00 AM   said...

సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను..
ఈ అనువాదంపై నాకు కొన్ని సందేహాలున్నాయి.
1. < > వీటిమధ్య ఉండాల్సిన ఆ చరరాశిని (వేరియబులు) కూడా తెలుగులోకి ఎందుకు అనువదించానో అర్థం కావడం లేదు. సాధారణంగా నేనలా చెయ్యను. (పైగా ఆ చరరాశి ఈ వాక్యంలో సరిగ్గా ఇమడలేదు.)
2. "ఇమెయిల్" -సాధారణంగా నేను "ఈమెయిలు" అని రాస్తాను.
3. "అకౌంట్ని", "అడ్రస్లో" లాంటి వాటిని క్యారట్‌తో విడగొడతాను. అసలు 'అకౌంటును' అని రాస్తాను గానీ, 'అకౌంటుని' అని రాయను.
4. "పొందుపరచబడుతుంది" -తప్పనిసరైతే తప్ప "బడు" వాడను.

పై కారణాల వల్ల ఈ వాక్యాన్ని అనువదించింది నేను కాకపోవచ్చని అనుకుంటున్నాను. కానీ, "సంపర్కం" అనే మాటను మాత్రం నేను వాడాను (అనేక ఇతర వాక్యాల్లో), బహుశా నేనే వాడటం మొదలుపెట్టాను. కాంటాక్ట్స్ అనే మాటకు సంపర్కాలు అని వాడాను. అది దోషమైతే.. ఆ దోషం మాత్రం నాదే! పోతే..

మరో సంగతి -ఆ అనువాదాల్లో, తెంగ్లీషులో ఉన్నవాటికీ నాకూ ఏమాత్రం సంబంధం లేదు. :)

ఒక మంచి చర్చకు ఇది నాంది కాగలదు. నెనరులు!


Unknown on Aug 15, 2008, 3:09:00 AM   said...

అవును అదో చెత్త. కనీసం ప్రూఫు రీడు కూడా చెయ్యకుండా జనాల చేత అనువదింపచేసాడు. (నేనూ అనువదించాననుకోండి. మరీ ఇంత దారుణం అయితే కాదు)
కమర్షియల్ సంస్థ అయిన గూగుల్ కొద్దిగా కూడా జాగ్రత్త తీసుకోకపోవడం దారుణం.
ఓపెన్ సోర్సు తప్ప ఇలాంటి కమర్షియల్ వాటికి అనువాదాలు చెయ్యడం నేను మానేసాను.


రానారె on Aug 15, 2008, 8:29:00 AM   said...

ఆగండాగండి. అసలు గూగుల్లో తెలుగు వచ్చిందే మొన్న. అంతలోనే తగలెయ్యకండి. :) అందునా సంపర్కం తప్పేమీ కాదని నాకనిపిస్తోంది. సంపర్కమంటే sexual intercourse మాత్రమే కానక్కరలేదు. చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాల్లో మనకీ పదం పరిచయమైనపుడు ఇలా అవడంతో వచ్చిన ఇబ్బందేకానీ మరేమీ కాదనుకుంటాను. పైగా ఇవి స్వచ్చందంగా చేయబడిన అనువాదాలు. తగలేస్తాం, తెగులు, చెత్త అని తూలనాడకండి మహాప్రభో!! :)


తెలుగు'వాడి'ని on Aug 15, 2008, 12:59:00 PM   said...

మీ అభిప్రాయాలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ముందుగా ధన్యవాదములు.

ఇందులో మన వాళ్లు (ప్రవీణ్/చదువరి మొదలగు వారు) ఉన్నారని, వాళ్లు ఈ/ఇలాంటి అనువాదాల్లో పాలుపంచుకున్నారని నాకు తెలియదండీ :-) ... వికీపెడియాలోనే అనుకున్నా ....

నవీన్/చదువరి/ప్రవీణ్/రానారె గార్ల వ్యాఖ్యలు చదివిన తరువాత ఈ టపా వ్రాసేటప్పుడు పూర్తిగా 'మనసు' పెట్టకపోవటం, 'నోరు' విప్పకపోవటం, 'చేతులు' తడబడటం చాలా చాలా మంచిదే అయినట్టుంది ;-) లేకపోతే కొంపలంటునేవి. :-( హమ్మయ్య! బతికిపోయాము.


మోహన on Aug 15, 2008, 2:15:00 PM   said...

:) ఏంటో నాకంతా తికమకగా ఉంది. స్వచ్చందంగా అలా గూగుల్లో అనువదించవచ్చునని కూడా నాకు తెలియదు. తెలుగు'వాడి'ని గారూ ఎమాఇనా సమాచారం ఇవ్వగలరా?


Ramani Rao on Aug 16, 2008, 1:57:00 AM   said...

మంచి సందేహమే తెలుగు వాడిని గారు నాకయితే రానారె గారు చెప్పింది సమంజసంగా ఉంది.


netizen నెటిజన్ on Aug 16, 2008, 2:45:00 AM   said...

ఒకప్పుడు కలం స్నేహాలుండేవి. వారిని ఆంగ్లంలో "పెన్‌పాల్" అని చెప్పుకునే వారు.
తంతే తపేళా శాఖవారి, ఉత్తరాలు కొనుక్కుని వ్రాసుకునేవారు. ఆప్పట్లో ఈ కలం స్నేహితులకోసమే ప్రత్యేకమైన పత్రికలు కూడ ఉండేవి.
ఒకానొక సందర్భంలో, అప్పుడే పరిచయం ఐన ఒక కలం స్నెహితురాలికి, ఒక కలం స్నేహితుడు - " మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నరు ?" అని అడిగాడు. అతని ఉద్దేశం ఆవిడ వ్యాపకం, చదువు, ఉద్యోగం వగైరాలు తెలుసుకుందామని.
ఆవిడిచ్చిన జవాబుతో, కళ్ళు తిరిగి కింద బడ్డాడు.
ఆ కలం స్నెహితురాలు ఇచ్చిన జవాబు , "ఫస్ట్ ఇంటర్ కోర్స్ చేస్తున్నాను, " అని.
మొన్న ఆ మధ్యే గూగుల్లో, ఈ "సంపర్కం" ని గమనించినా, మన తెలుగు బ్లాగర్ల ప్రతిభ అని కలలో కూడ ఊహించలేదు. :)
సరే, "సంపర్కం" పదం అదో విధంగా, ఏదోలా ఉంది, మరి ఏ పదం ఐతే బాగుంటుందొ, అది ఆ గూగుల్ వాడికి తెలీయజేస్తే బాగుంటుంది.
రానారె గారు అన్నట్టు, "...గూగుల్లో తెలుగు వచ్చిందే మొన్న...తగలేస్తాం, తెగులు, చెత్త అని తూలనాడకండి మహాప్రభో!! :)"


Bolloju Baba on Aug 16, 2008, 4:16:00 AM   said...

నేను ఒకసారి గూగిల్ అనువాద పేజీలోకి వెళ్లి చూసాను. కొన్ని అనువాదాలు కృతకంగా ఉన్నాయి అనిపించింది.
కొన్ని కొన్ని పదాలను అనువదించకపోతే ఏమిటట. వాటినే నేరుగా ఇంగ్లీషులో వాడుకోవచ్చుగా? ఉదా: ఈ మెయిలు వంటివి. (ఇలాంటివి ఎలాగూతప్పవు)
నెట్ ను వాడేది అధిక శాతం అక్షరాస్యులే అందునా దాదాపు అందరికీ ఇంగ్లీషు వచ్చేవుంటునని భావించవచ్చు.
ఎందుకో కొన్ని పదాలను తెలుగులోకి అనువదించి వాటి ఫీల్ ను పాడుచేస్తున్నారనిపిస్తూంటుంది.

బొల్లోజు బాబా


తెలుగు'వాడి'ని on Aug 16, 2008, 7:24:00 AM   said...

మోహన గారు : ఇదిగోండి మీరు అడిగిన సమాచారం ...

Google in Your Language

ఆ పైన ఉన్న లంకెను నొక్కిన తరువాత మీరు ఏ భాషకు సంబంధించి అనువదించాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. కింద ఉన్న బటన్ నొక్కిన తరువాత మీకు ప్రస్తుతం అనువదించటానికి అవకాశం ఉన్న విభాగాలు కనిపిస్తాయి. మీకు నచ్చినది ఎంచుకోండి.

స్నేహపూర్వక సూచన (అందరికీ) : పైన ప్రవీణ్ గారు చెప్పినట్టు ఇలాంటి పాటిల్లో పాల్గొనేటప్పుడు సాధ్యమైనంత వరకు open source communities లో చేయటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. గూగుల్ లాంటి commercial companies అయితే అవసరం అనుకుంటే (ఊరికే చేసిపెడతాము అంటే ఎవరూ వద్దు అనరు అనుకోండి) డబ్బులు ఇచ్చి అయినా చేయించుకుంటారు.

ఈ సమాచారాన్ని అందించిన ప్రవీణ్ గార్లపాటి ( నా మదిలో బ్లాగ్ ) గారికి హృదయపూర్వక ధన్యవాదములు.


Anonymous on Aug 16, 2008, 9:15:00 AM   said...

బాగుంది. బ్లాగులో సమాచారం కన్నా చర్చలు చదువుతుంటే నవ్వొచ్చింది. మీరందరూ కలిసి నాదినం చేసేరు. I mean you made my day!
మాలతి


Anonymous on Aug 16, 2008, 11:06:00 AM   said...

ఫీల్ అనేది అలవాటు పడడాన్ని బట్టి ఉంటుంది. వాడితే అలవాటవుతుంది. వాడకపోతే ఎప్పటికీ తెలుగు అలవాటు కాదు. మన దినపత్రికల్లో ఉన్న భాష కూడా మనకు పాత్రికేయులు అలవాటు చేసినదే తప్ప అదేమీ నన్నయ్యకాలం నుంచి ఉన్నది కాదు. తెలుగు అనువాదాలు మొదట్లో (ఎంత) కొంత లోపభూయిష్ఠంగా ఉన్నా పెద్దమనసు చేసుకుని ప్రోత్సహించడం అవసరం.

తెలుగు అనగానే చిన్నచూపు చూసే మనస్తత్వమే గోచరిస్తుంది చాలా విమర్శల్లో ! 17 ఏళ్ళ కిందట "ఇండియా టుడే" తెలుగులో రావడం మొదలైనప్పుడు చాలామంది నొసలు చిట్లించారు " ఛీ ! ఆ పత్రిక డిగ్నిటీయే పోయింది" అంటూ ! మనం అలాంటివాళ్ళ జాబితాలో చేరదామా ?


Kathi Mahesh Kumar on Aug 16, 2008, 10:21:00 PM   said...

సంపర్కం (संपर्क) అనేది హిందీలో touch లో ఉండమని చెప్పడానికి వాడతారు. కాకపోతే దీనికి తెలుగు సమానాంతరం ఉందనేది డౌటే!


చదువరి on Aug 16, 2008, 10:40:00 PM   said...

:) వ్యాఖ్యలు బాగున్నాయి.

సంపర్కం అనే మాటపై అప్పుడే చర్చ జరిగింది. ఆ చర్చ తరవాత దాన్ని "పరిచయాలు", "పరిచయస్తులు" అని మార్చాం. అనువాదాలను మార్చాం కూడా! అనువాదాల్లో చేసిన అనేక మార్పులను గూగుల్ ప్రచురించలేదు, ఎంచేతో! అయితే "పరిచయాలు" అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు. ఆ ఇబ్బంది అలాగే ఉండి పోయింది. కాంటాక్టులో ఉంటాను, టచ్‌లో ఉంటాను అనే చోట్ల పరిచయంలో ఉంటాను అని అనలేం కదా. అలాంటి సందర్భాల్లో నాబోంట్లకు ఉన్న కొద్దిపాటి తెలుగు పరిజ్ఞానం బండిని నడిపించలేకపోయింది. తెలుగు బాగా తెలిసినవాళ్ళు ఈ పనిలో పాల్గొంటే బాగుండేది కదా అనిపించేది.

గూగులును అనువాదం చేసే సమయంలో ఎక్కువమంది ఉండేవారు కాదు -చాలా మందికి దాని సంగతి తెలియక. తెలిసినా, ఎక్కువమంది ఉత్సాహం చూపించకపోవడం వల్ల కూడా కావచ్చు.

తెలుగువాడిని పుణ్యమా అని ఈ పని పట్ల మనవాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఇప్పుడు తెలుస్తోంది. ఈ ఉత్సాహాన్ని ఉత్పాదక దిశలో పెట్టే అవకాశం ఉంది. మీరూ ఈ అనువాదాల్లో పనిచేసి, మీ అనుభవాన్ని తెలుగువారందరికీ పంచవచ్చు. కొత్తవాటిని అనువదించవచ్చు, పాతవాటిలోని దోషాలను సరిదిద్దవచ్చు. ఎక్కడ పని చెయ్యాలో తెలుసుకునేందుకు etelugu.org లోని ఈ కింది లింకు చూడండి:
తెలుగీకరణ పనులు

ఈ తెలుగీకరణ కార్యక్రమాలను వీవెన్ నడిపిస్తూ ఉన్నారు. ప్రవీణ్, ప్రదీప్, ఇంకా కొందరు ఈ పనుల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ మీ అందరి ఉత్సాహం చూస్తే ఈ పనులు ఇక పరుగులు పెడతాయని నాకు అనిపిస్తోంది.


Bolloju Baba on Aug 17, 2008, 4:55:00 AM   said...

తెలుగు అనువాదమని పేరు చెప్పి సంస్కృత పదాలు గుప్పించటం జరుగుతుంది.
ఇది నన్నయ కాలం నుంచే నడుస్తూ వస్తుంది.
మరి దానికేమంటారు?
బొల్లోజు బాబా


Anonymous on Aug 18, 2008, 1:58:00 AM   said...

నా వరకు అయితే సమ్పర్కాలు బాగానే ఉంది. నా నోకియా తెలుగు ఫోన్లో డబ్బులు పెట్టి చేయించిన అనువాదంలో కూడా :) అదే వాడారు! "సంపర్కంలో దోషం!" (error in connection?)

chavakiran


Anonymous on Jan 21, 2009, 10:41:00 AM   said...

సంయోగం, నిర్దేశం లాంటి పదాలు వాడేటప్పుడు కూడా కాంటెక్స్త్ డిఫరెన్స్ వస్తుంది. నా డి.టి.పి. సెంటర్ కి ఒక రైల్వే కాంట్రాక్టర్ హిందీ వర్క్స్ పట్టుకొస్తుంటాడు. ఆదేశం అనే పదానికి నేను నిర్దేశ్ అని అనువాదం వ్రాస్తుంటాను. ఇలాంటి తేడాలే కొన్ని కనిపించినప్పుడూ ఇలాగెందుకు మారుతుంది అని అతను అడిగాడు. తెలుగు - కన్నడ అనువాదాలలో కూడా ఇలాంటివి కనిపిస్తాయి. తెలుగులో దొడ్డవారు అంటే పెద్దవారు (ముసలివారు). కన్నడంలో సైజ్ లో పెద్ద అని సూచించడానికి కూడా దొడ్డ అనే పదం వాడుతారు.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting