పర భాష-రాష్ట్ర, పద,వాక్య, సన్నివేశ, ప్రదేశాల కూర్పుతో మన తెలుగు సినిమా !?

Posted by తెలుగు'వాడి'ని on Thursday, November 22, 2007

తెలుగు సినిమాలలో పర రాష్ట్ర, భాష (Hindi, Tamil, Malayalam and Kannada etc) పద, వాక్య, సన్నివేశ, ప్రదేశాలను కూర్చిన ప్రయోగాలను చూసి ఎప్పటినుంచో విసుగుచెంది కూడా, తన్నుకొచ్చే కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకుంటూ మరలా అదే తెలుగు సినిమాలు చూస్తూ (సిగ్గులేకుండానో లేక గతిలేకనో అని చదువుకున్నా ఫర్వాలేదు:)ఎలాగో కాలాన్ని నెట్టుకొస్తుండగా, ఇంతలోనే అంటే ఇప్పుడే చూసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా చూసి అందులో మితిమీరి పోయి ఉన్న ఈ విషసంస్కృతి లేక దర్శక/కధా రచయితల మరియు కెమేరామెన్ కొంగొత్త అభిరుచి లేక సృజనాత్మకత (!?) చూసి తట్టుకోలేని నా అవేదననకు అక్షర రూపమిది.

ఈ సినిమాను నేను ఉచితంగా (ఏమీ తెలియనట్టు, ఎలాగబ్బా అన్నట్టు ఫేసులు పెట్టకండి...అందరమూ (సరేలే చాలామందిమి) ఆ తానులో గుడ్డలమే ;) చూశాను (అందులోనూ ఇది చాలా పాత సినిమా) కాబట్టి ఈ సినిమాపై సమీక్షలాంటి నా అభిప్రాయాలేమీ ఇక్కడ ప్రస్తావించుటలేదు.

ఇప్పటికే మన దైనందిన జీవితాలలో ఆంగ్ల (అదే హైదరాబాద్ లో ఉంటే హిందీ/ఉర్దూ) పదాల వాడుక ఎంతగా జొచ్చుకు పొయిందో ఇక్కడ నేను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు ... మనం ఆ పదాలు వాడకుండా కొన్ని నిముషాలు లేదా కొన్ని వాక్యాలు కూడా మాట్లాడలేని పరిస్థితి... కానీ మనకందరికీ తెలిసినట్టుగా ఏవో ఒకటో రెండో ఆంగ్ల పదాలు అక్కడక్కడ వాడి మాట్లాడటం మొదలు పెట్టి ఇప్పుడు అక్కడక్కడ ఒకటో రెండో తెలుగు పదాలు పెట్టి మాట్లాడే స్థాయికి ఎదిగి(!?)పోయాము. (ఈ జాడ్యాన్ని కొద్దో గొప్పో తగ్గించటానికి, తెలుగు భాషాభివృద్ధికి, దాని గొప్పతనాన్ని కాపాడటానికి, ప్రాచీనభాషగా గుర్తించుటకు, తెలుగు వికీపెడియాలో విషయాలను చేర్చుటకు పాటు పడుతున్న ప్రతి ఒక్కరికీ ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందన శతఃనమస్సుమాంజలులు)

కుడి-ఎడంగా ఇదే విధంగా ప్రారంభమై, (బాల్య/కౌమార దశలను అంటే ఒకటో/రెండో పదాలు, వాక్యాలు/సన్నివేశాల తొ సరిపెట్టటం .. దాటాయనే నా అభిప్రాయం) ఇప్పుడు ఏకంగా యవ్వన/మధ్య వయస్సుని చేరుకొనే పరిణామ క్రమంలొ ఉన్నట్టుగా అనిపించే అంటే పూర్తి ఫ్లాష్-బాక్ లోని డైలాగులు, పాటలలో రెండో/మూడో వాక్యాలు, లేదంటే ఆరో/ఏడో సన్నివేశాలు మొదలగునవి జొప్పించి మనమీదకు వదలటం (మనం చూస్తున్నాము కాబట్టి వాళ్లు తీస్తున్నారు అని ... వాళ్లు తీస్తున్నారు కాబట్టి మనం చూస్తున్నాము అని ఎవరైనా వాదించవచ్చు గాక) అనేది నా అభిప్రాయం ప్రకారం దర్శక/కధా రచయితల పనికిమాలిన, వెధవ/చెత్త అభిరుచి, తెలుగు భాష, సినీ అభిమానులు అంటే లెక్కలేనితనం, అసలు కొంచమైనా బాధ్యతలేని సంపూర్ణ నిర్లక్ష్యం ... ముమ్మాటికీ మన దౌర్భాగ్యం.

నా ఆవేదన మరియు నా ఈ అభిప్రాయాలు ఈ ఒక్క సినిమాకు మాత్రమే సంబంధించినవి కాదు అండి....ఇలా అతిపోయే మిగతా సినిమాల గురించి కూడా నా స్పందన ఇలాగే ఉంటుంది.

సినిమాలాంటి ఒక పవర్-ఫుల్ మీడియా లో 'పర' ప్రయోగమనే అనే చిన్న మొక్కలాంటి విషసంస్కృతికి, దర్శక,కధారచయితలు వారి దౌర్భాగ్యపు అతి తెలివితేటలు, ఎందుకూ కొరగాని వ్యర్ధమైన సృజనాత్మక(?!) అలోచనలు అనే నీరు-పోసి బలం-వేసి ఒక వటవృక్షంగా తయారవ్వటానికి వారివంతు సాయం చేస్తున్నాము అన్న స్పృహ లేకపోవటం, ఉన్నా లేనట్టు నటించటం మనకు పట్టిన/పడుతున్న మరో జాడ్యం.

ఈ (తొక్కలో) దర్శకులు తీసేది ఏమన్నా అధ్భుత కళాఖండాలా లేక సమైక్య భారత జనజీవన స్రవంతి గురించి డాక్యుమెంటరీలా లేక సర్వరాష్ట్ర సమతోధ్ధారణ ప్రభోధిత సినిమానా ... నేటివిటి అనో లేక మాతృకలో ఇలానే ఉంది అనో లేక కధ వీటినే డిమాండ్ చేస్తున్నాయని పనికిమాలిన వాదనలతో సమర్ధించుకోవాలని చూడటం...

ఈ సినిమాలో హీరో గారి రెండో ప్రేమకధ గురించి చెప్పటానికి ఆంధ్రా నుండి కేరళకు తీసుకెళ్లిన దగ్గరనుంచి అక్కడ వచ్చేవన్నీ ఆ మళయాళం గోలే (ఒకటో రెండో డైలాగులు కాదు, పాటలో కూడా హీరోయిన్ తో రెండు వాక్యాలు .. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి)....ఈ సినిమా దర్శక/కధారచయితలు ఎందుకు కేరళను ఎన్నుకున్నారో తెలియదు గానీ....నా మటుకు నాకు ముఖ్యంగా మూడు సన్నివేశాలు కనపడ్డాయి...అవి :

1. హీరో గారికి హఠాత్తుగా ఒక తెలుగు ఆంటీ ముక్కుపుడక పెట్టుకొని కనపడటం...హీరోయిన్ తో ఆడపిల్లకు ముక్కుపుడక అందంగా ఉంటుంది అని చెప్పటం...ఈమె గారు తదుపరి సీన్ లో పెట్టుకోవటం...

2. కాలేజి నుంచి ఇంటికి రావడానికి పడవలో హీరో గారికి అక్కడ మళయాళం గుంపు చోటు ఇవ్వకపోవటం...హీరోయిన్ గారు అంతా ఆడవాళ్లు మాత్రమే ఉన్న పడవలో హీరో గారికి చోటు ఇవ్వటం...ఈ మగ గుంపు 'ఆడంగి' అని మళయాళంలో ఎగతాళి చేయటం.....(తరువాత మన వాడు రెచ్చిపోయి అందరినీ నీళ్లల్లోకి తోసెయ్యటం...మీరు ఊహించే ఉంటారు కదా)

3. హీరో గారి కోసం మన హీరోయిన్ గారు తెలుగు నేర్చుకోవటం ... (తన మీద ఉన్న ప్రేమతోనని చెప్పటం .. అదే తెలుగుతో చివరలో మరచి పొమ్మనమని చెప్పటం)

గుండెమీద చెయ్యివేసుకొని, అంతరాత్మ మీద ప్రమాణం చేసి అన్నీ నిజాలే చెప్పగలిగిన క్షణాన ఈ దర్శక/కధా రచయితలను మాట్లాడమని చెప్పండి...

రెండవ భాగం (మొదటిది గోదావరి జిల్లా నేపధ్యం) ఆంధ్రప్రదేశ్ లో వేరే ప్రాంతానికి (ఉదా: తెలంగాణ) మార్చి, అదే ముక్కుపుడక సీను, మన హీరో గారికి తెలియని తెలంగాణ తిట్టుతో ఆ సన్నివేశాన్ని, మన హీరోయిన్ గారి తెలంగాణ యాస నుంచి మన హీరో గారి కోసం వీడు మాట్లాడే ఏ ప్రాంత తెలుగు అయితే అది నేర్చుకున్నట్టుగా చూపించలేరా?

ఒకవేళ పై విధంగా సన్నివేశాలు మారిస్తే మన ఈ అతి గొప్ప సినిమా భవితవ్యం/కధాగమనం/చిత్రీకరణ పై నిజంగా అంత ప్రభావం చూపిస్తాయా? (ఏమీ ఉండదు అని నేను అయితే ఘంటాపధంగా చెప్పగలను...వీలయితే మీ అభిప్రాయాలు తెలుపగలరు)

మరి వీళ్లు ఏ ప్రయోజనం ఆశించి లేక ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి కధావస్తువులను, సన్నివేశాలను తీస్తారో, తీస్తున్నారో నిజంగా వారికన్నా తెలుసంటారా (బహుశా తెలియదేమో)....ఇక వేరే దేశాలలో ప్రముఖ వీధుల్లో మన హీరో-హీరోయిన్లు పాటకు వేసే శరీర భాగాల వింత వింత కదలికలను వారు వీరివైపు అతి విచిత్రంగా నవ్వుకుంటూ ఏవో వింత జంతువులను చూసినట్టు చూస్తూ ఉన్నా కూడా మనవారు మరలా ఎగేసుకోని అవే/అలాంటి ప్రదేశాలకు మరలా మరలా వెళ్లటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా..

ఇక్కడ నేను ముఖ్యంగా కొన్ని విషయాలను ప్రస్తావించదలచాను :

1. నేను వీటిని వాడ(చూపించ)టానికి పూర్తిగా వ్యతిరేకిని కాదు ... అలాగని పైన చెప్పినట్టుగా మొత్తము దానితోనే చుట్టేస్తాము రీలు మీద రీలు అంటే చూస్తూ ఊరుకోనూ లేను...ఏదో ఆవేశం....ఏదైనా మితముగా ఉండేటట్టుగా చూస్తే, అలాగే నిజముగా ఆ సన్నివేశాలు/డైలాగ్స్ మొదలగునవి సినిమాకు అవసరమనీ, అవే ప్రాణమనీ గుండె మీది చెయ్యి వేసి చెప్పగలిగి తీసి ప్రేక్షకులను ఒప్పించ గలిగేలా ఉంటే బాగుంటందని నా అభిప్రాయము....

2. ఒక వేళ ఈ సన్నివేశాలు/డైలాగ్స్ ఆయా ప్రాంతాల, రాష్ట్రాల, ప్రజల పధ్ధతులను, ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సంప్రదాయాలను అంటే దసరా/దీపావళి నార్త్ లో ఎలా జరుపుకుంటారో, మన ఉగాదిని తమిళనాడులో ఏమంటారో/ఎలా చేసుకుంటారో, మళయాళీల చీరకట్టు, మదరాసీల పంచెకట్టు... ఇలాంటివాటికి పరిమితమైతే అందరికీ ఆనందము ..కొత్త విషయాలు నేర్చు(తెలుసు)కున్నాము/కుంటున్నాము అనే భావనతో.

3. అలాగే పాటలలో లేక సన్నివేశాలలో ప్రకృతి రమణీయ దృశ్యాలను చూపించటానికి (కేరళ, కర్ణాటక, చెన్నై మరియు ఆ హిందీ రాష్ట్రాలతో సరిసమానమైన లేక ఇంకా కొంచెము బాగా ఉండే ప్రదేశాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అని కొంతమంది వాదించ/తెలియపరచ వచ్చు) ఈ డైలాగ్స్/సన్నివేశాలు ప్రాతిపదికైతే ... అంతవరకు ఓకే....ఎందుకంటే మొదటి కారణము కారణాలు ఏవైనా దీనిని దర్శక/కధా రచయిత/కెమెరామెన్ ల అభిరుచికి, నిర్మాత బడ్ఙెట్ కి వదిలి పెట్టెయ్యటము మంచిది .. ఇక రెండో అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇలాంటి విషయాలు/ప్రదేశాలు చూడటం/తెలుసుకోవటం వలన, పర్యాటకం పెరిగి అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి...

దీనికి మంచి ఉదాహరణ : గోదావరి సినిమా ... ఇది వచ్చిన/చూసిన తరువాత నుంచీ గోదావరి పర్యాటక ప్రదేశంగా ఎంత అభివృధ్ధి చెందిందో, ఆ లాంచీ ప్రయాణం ఎంత ఫేమస్ అయ్యిందో మనలో చాలామందికి తెలిసిన విషయమే ... అలాగే ఈ గోదావరి సినిమా చూస్తూ ఉన్నంత సేపూ, చూసిన చాల రోజుల తరువాత వరకు కూడా, మన కందరికీ నిజంగా ఇంత అందంగా ఉంటాయా ఆయా ప్రదేశాలు (ఒక్క ప్రదేశాలే కాదు లేండి కమలనీ ముఖర్జీ కూడా అనుకోండి ;) అనీ లేక ఇంత అందంగా చూపించవచ్చా సినిమాలలో అనీ అనిపించిన(చని)వారంతా తెలియజేయండి(ఈ తెలియజేయడం ఒక్క గోదావరి అందాల గురించేనండోయ్ :)

ఇది భారతీయత అనీ, ఇవి మన వారసత్వ సంపద అనీ, మనం భారతీయులమనీ గర్వంగా చెప్పుకోవటానికి దోహదపడతాయి కాబట్టి ఓ.కె ... అలాగే రేపు ఇతర దేశాలలో వీటి గురించి NRIs ని, లేక ఇండియా విచ్చేసిన ఇతర దేశాల వాళ్లు మన ఇండియన్స్ ని ఎవరన్నా అడిగితే ... ఆ! అవా , అవేవో కేరళ వాళ్లవనో, తమిళనాడు వాళ్లవనో ఒక్కరంటే ఒక్కరు కూడ చెప్పరు ... ఎవరైనా-అవునండీ, అవి మా ఇండియా లో ఫలానా రాష్ట్రంలో లో ఉంటాయి ... బాగుంటాయి ... ఒక్క సారన్నా చూసి తీరవలసినవి అనే చెప్తారు.......అందుకే పర్యాటక, విహారానికి సంబంధించిన ప్రదేశాలను సినిమాలలో చూపించటం తప్పులేదు.

నాకు తెలియని విషయం ఒకటి తెలుసుకోవాలనే ఉత్సాహంతో అడుగుతున్నాను : మన తెలుగు సినిమాల లాగానే ఆ తమిళ, మళయాళ, హిందీ మొదలగు సినిమాలలో కూడా ఇలాగే తీస్తున్నారా అంటే వాళ్లు కూడా ఫ్లాష్-బాక్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లేక గోదావరి చుట్టుపక్కల పల్లెప్రాంతాలకి వెళ్లినట్టుగా, కొన్ని డైలాగులు తెలుగులో మాట్లాడుతున్నట్టుగా మొదలగునవి. (నేను ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ తమిళ/మళయాళం సినిమాలు చూడలేదు కనుక మనకి ఆ విషయపరిజ్ఞానం శూన్యం. కనుక మన బ్లాగ్మితృలలో ఎవరికి అయినా వీటి గురించి తెలిసి ఉంటే దయచేసి తెలుపగలరు..అట్టివారికి మునుముందుగానే కృతజ్ఞతలు)..ఒక వేళ వాళ్లు కూడా ఇలాగే తీస్తూ ఉంటే .. అదొక రకమైన వెర్రి ఆనందం :-( వాళ్లు కూడా మనతోనే ఉన్నారనీ మరియు మన గురించి అక్కడ ప్రాచుర్యం లభిస్తుంది కదా అని.....ఏదో గుడ్డిలో మెల్ల :-)

అలాగే ఇంకో గుడ్డిలో మెల్లగా, మట్టిలో మాణిక్యంలా....ఇంత బాధలో కూడా దొరికిన ఆణిముత్యమైనది ఏదైనా ఉంది అంటే అది ఈ సినిమాలో ఉన్న మౌనంగానే ఎదగమనీ అనే పాట....దీని గురించి నేను ప్రచురించిన మరొక బ్లాగ్ పోస్ట్ : మౌనంగానే ఎదగమనీ - నాకు నచ్చిన పాటలు లో చూడండి.
12 వ్యాఖ్యలు:

shanker on Nov 24, 2007, 12:22:00 AM   said...

abboo.. meeru cheppenta varaku naku aa cinemalu tappulu kanipinchaledandi asalu.. kani cheppinataruvata kuda peddaga anipinchatam ledu. kani mee uddesyam nachindi.. anta telugu mayam avvali ani.. chala bagundi


తెలుగు'వాడి'ని on Nov 24, 2007, 12:25:00 AM   said...

@shanker garu :

మీ వ్యాఖ్యకు ఇవే నా కృతజ్ఞతలు ... నేను వ్యక్తపరచినవి నేను తప్పులుగా అనుకోలేదు మరియు తప్పులు అనుకోని మాత్రం చెప్పలేదండి....అలాగే సినిమా మొత్తం తెలుగుమయమే కావాలనేది కూడా నా ఉద్దేశ్యం కాదండి....నా ప్రధానమైన బాధంతా అంత అతి పరభాష (ఇందులో మళయాళం) ఛాయలు ఎందుకు అనేదే ... నిజం చెప్పాలి అంటే సినిమా మొత్తం తెలుగుమయమే అయితే అంటే వాడుకలో ఉన్న ఆంగ్లపదాలను వదిలి వాటిని తెలుగులోకి తర్జుమాచేసి సినిమాలో వాడితే జనాలకు ఆ సినిమా ఎక్కకపోయే (మొదటి ప్రయత్నంలో అర్ధంకాక లేక అలవాటు పడలేక) ప్రమాదం ఉంటుందేమో ;)


చదువరి on Nov 24, 2007, 5:02:00 AM   said...

అప్పుడెప్పుడో ఓ హిందీ సినిమా చూసాను, సత్యనారాయణ (ఔను, కైకాలే), శ్రీదేవి ఉన్నారందులో. వాళ్ళిద్దరూ తెలుగులో మాట్టాడుకుంటూంటారు. అట్లూరి పూర్ణచంద్రరావు తీసినదనుకుంటా అది!


నవీన్ గార్ల on Nov 24, 2007, 10:13:00 PM   said...

చదువరిగారు, సత్యనారాయణ నటించిన ఏకైక హిందీ సినిమా కర్మ

: http://en.wikipedia.org/wiki/Karma_(film)


radhika on Nov 26, 2007, 9:16:00 AM   said...

నాకు మీరు చెప్పిన విషయాలు పెద్దగా లోపాలుగా అనిపించలేదండి.నూతిలో కప్పల్లా అంతా ఇక్కడే,అంతా ఇదే అవ్వాలంటే ఎలాగండి?అతి సామాన్య ప్రజలకి అంతా సినిమానే.ఇతర రాష్ట్రాల గురించి,దేశాల గురించి తెలుసుకోవాలన్నా,చూడాలన్నా సినిమా ఒక్కటే దిక్కు.[నిజమా అనుకోకండి.నూటికి నూరుపాళ్ళూ నిజం.ఇందుకు నేనే సాక్ష్యం].ఏమనుకున్నా సినిమా అన్నది వినోదం కోసం.పల్లెటూరు వాళ్ళకి అంతో ఇంతో లోకజ్ఞానం చెప్పేది కూడా సినిమానే.మన చాలా తెలుగు సినిమాల్లోనే పాకిస్తాను వాళ్ళు,మన ఆర్మీ వాళ్ళు తెలుగులో మాట్లాడేస్తుంటే అది ఎంత అసహజం గా అనిపించిది అందరికీ.అవసరం లేకపోయినా సంభాషణల్లో ఆగ్లం ఎక్కువయిందనో,పాటల్లో సాహిత్యపు విలువలు పడిపోతున్నాయోనో,రక్తపాతం ఎక్కువయిపోతుందనో బాధపడొచ్చు గానీ అది అలాగే ఎందుకు తియ్యాలి ఇలా ఎందుకు తియ్యకూడదు అని ఎందుకంటున్నారో అర్ధంకాలేదు.ఈ సినిమాని ఆణిముత్యం అనను గానీ ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే ఎన్నో రెట్లు బాగున్న సినిమా.
ఎక్కువ మాట్లాడి వుంటే క్షమించండి.


తెలుగు'వాడి'ని on Nov 26, 2007, 9:59:00 AM   said...

రాధిక గారు : మొదటిగా, మీ అభిప్రాయాలు తెలిపినందుకు కృతజ్ఞతాభినందనలు, రెండవది ఎక్కువ మాట్లాడానేమో మరియు క్షమించమని అడగటం వద్దండీ (కనీసం నా బ్లాగ్ వరకైనా), ఎందుకంటే ఇది అభిప్రాయాల చర్చావేదిక కనుక మీరు ఏమాత్రం మొహమాటం లేకుండా (కనపడినప్పుడు మొట్టికాయలు వేసినా ఫర్వాలేదు గానీ...డైరెక్ట్ గా తిట్టనంతవరకు ఓకే) మీ అభిప్రాయాలు వ్యక్తపరచవచ్చు.

నూతిలో కప్పల్లా ఉండిపోకూడదనీ, కొత్త విషయాలు తెలుసుకోవటానికీ, ఇతర రాష్ట్ర, దేశాల ను చూడటానికీ ... వీటన్నికీ అయితే సినిమానే బాగా ఉపయోగపడుతుందనీ ... నేను కూడా ఖచ్చితంగా మీరు చెప్పినట్టే పాయింట్ 1, 2, 3 లలో చెప్పానండి.

అలాగే సినిమాలో అందరూ తెలుగులోనే మాట్లాడటం అసహజంగా (ఏ ప్రాంతం, దేశం వెళ్లినా)ఉంటుందనటంలో సందేహమే లేదు. అందుకే నేను ముందుగానే చెప్పాను ఇలాంటి సన్నివేశాలకీ, సంభాషణలకీ సంబంధించి (మితంగా) వాడుకుంటే బాగుంటుందని.

మీరు నా అతిధి రివ్యూ చదివారు కదా, నేను అసలు ఈ/అలా/ఎలా/ఇలా తియ్యటం అనే వాటి జోలికి వెళ్లనండి...సినిమా సినిమాలా చూడటం, బయటకు వచ్చెయ్యటం అంతే ... ఈ సినిమాలో నేను చెప్పింది (నాకు అనిపించింది) అనవసరంగా ఆ సన్నివేశాలేదో సినిమాకు ప్రాణమన్నట్టుగా దానిమీదే మళయాళం పూసెయ్యటం గురించే...


స్మైల్ on Nov 27, 2007, 10:54:00 PM   said...

మీరన్నదానితో అంగీకరిస్తాను. ఇతర బాషా చిత్రాల పునర్నిర్మాణం(రీమేక్)లో ఉన్నదున్నట్టు తీస్తే వచ్చే చిక్కే ఇది! కానీ నా తమిళ మితృని ప్రోద్భలం వల్ల ఈ చిత్రానికి మాతృక అయిన తమిళ 'ఆటోగ్రాఫ్' మొదట చూశాను. బాష అంతగా అర్థం కాకున్నా భావం తెలుస్తోంది. మొదట అనాసక్తిగానే మొదలెట్టాను. సినిమా నడిచే కొద్దీ అప్రయత్నంగా టి.వి. దగ్గరికెళ్లి పోయాను, సినిమా ఆగేసరికి కానీ తెలియలేదు నా కన్నీటి ధారలు. అద్భుతంగా తీసాడు. అది తెలుగులో మళ్లీ చూశాక ఆ అనుభూతి అస్సలు రాలేదు. సినిమా అయినా, కథ అయినా, కావ్యమయినా మనస్సు లోతుల్లో నుంచి వస్తే అది మిగిల్చే అనుభూతే వేరు. హ్యాట్సాఫ్ టు చేరన్!


భాస్కర్ రామరాజు on Jan 2, 2008, 12:51:00 PM   said...

మీరు చాలా విషయాల్ని లేవనెత్తారు. సరే ముందు మాట : గోదావరి అందాల్ని "గోదావరి" సినెమాలో చూసేదాకా జనాలు గమనించలేదు అంటే అది ఘోరం. ఇంతక ముందు ఎన్ని సినేమాలు రాలేదూ, ముత్యాల ముగ్గు దెగ్గర్నుంచి, మొన్నీమధ్య వచ్చిన దొంగరాముడు అండ్ పార్టీ వరకూ.
తర్వాత, వచ్చీరాని తెలుగు (తెలుగు వచ్చి కూడా, నంగి నంగిగా, ఆంగ్లీకరణతో మాట్లాడే డబ్బింగు వాళ్ళూ) కంటే తమిళమో, మళయాళమో అదే పర్వాలేదనిపించింది. ఇక్కడ ఇంకో సౌలభ్యంకూడా ఉంది, ఆ భాష మనకు అర్ధం కాదుగా (నంగి నంగి గా అంగ్లీకరించినా).
ఏమైనా మంచి విషయాల్ని మీరు గమనించారు.

భాస్కర్


చాలా ఉంది on Jan 3, 2008, 12:46:00 AM   said...

గోదావరి మీద చాలా సినిమాలు వచ్చినా, లాంచీ ప్రయాణం ఫేమస్ అయ్యింది మాత్రం గోదావరి సినిమానించే అని నా అభిప్రాయం.
తమిళ 'ఆటోగ్రాఫ్' ని చేరన్ అద్భుతంగా తీసాడు. అరవానికి, మలయాళం అతుకుతుందేమో మరి, వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. రీమేక్ బాగోలేదని విన్నాను. చూడలేదు.

తమిళ సినిమాల్లో తెలుగు వినిపిస్తూంటుంది. ఒక్కోసారి ఒక్కో పాత్రని చిత్తూరు నించో, నెల్లూరు నించో దిగుమతి అయినట్టు చూపిస్తారు. రజనీ నటించిన చంద్రముఖి(తమిళ్) లో తెలుగు డవిలాగులతో పాటు ఒక ఫుల్ లెంగ్త్ తెలుగు పాట కూడా ఉంది.


రాజేంద్ర కుమార్ దేవరపల్లి on Jan 3, 2008, 5:50:00 AM   said...

చాలా ఉందిగారు చెప్పింది నిజమేనేమో,ఆ సినిమా లాంచీల గిరాకి పెంచేందుకు పనికొచ్చింది కానీ ఆరున్నర కోట్ల బడ్జెట్ అందుకేవాడాలా?వెళ్ళేది భద్రాచలం,హీరో రాముడు,హీరోయి న్‌ సీత,పేర్ల దగ్గరనుంచే మాచ్ ఫిక్స్ ఐపోయాక సీత పాత్రలో ఏమాత్రం ఇంటిగ్రిటి నాకు కనిపించలేదు పైగా చాలా కన్‌ప్యూజుడ్ పాత్ర.

ఈ బ్లాగు మీద నా పేద్ధ కామెంటు చాలా కాలం నుంచి పెండింగులో ఉంది ఎప్పుడు రాస్తానో


తెలుగు'వాడి'ని on Jan 3, 2008, 12:50:00 PM   said...

@ స్మైల్, భాస్కర్, చాలా ఉంది, రాజేంద్ర గార్లు: ముందుగా మీ అభిప్రాయములు తెలిపినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ..

స్మైల్ గారు : మాతృకలో ఎలా తీశారు దానికి మీ స్పందన మరియు అదే తెలుగులో చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని చాలా హృద్యంగా చెప్పారు. మీరు అన్నట్టు చే(తీ/రా)సేది గుండె లోతుల్లోనుంచి వస్తేనే ఆ అనుభూతే వేరు.

భాస్కర్ గారు : గోదావరి గురించి నావి కూడా 'చాలా ఉంది' మరియు 'రాజేంద్ర' గార్లు వ్యక్తపరచిన అభిప్రాయములే.

చాలా ఉంది గారు : తమిళ సినిమాల్లో మన గురించి ఉంది అంటే అదో ఆనందం (వెర్రే అనుకోండి)...అయితే చంద్రముఖి చూడవలసిందే

రాజేంద్ర గారు : బడ్జెట్ గురించి మనం ఏం చేస్తం...ఎవరి పిచ్చి వారికి ఆనందం కాకపోతే శేఖర్ కమ్ముల గారికి దాని ప్రభావం చాలా తొందరగానే తెలిసి వచ్చింది లేండి. ఇకపోతే నా ఈ టపాపై మీరు వ్రాస్తాను అన్న టపాకై ఎదురు చూసే వాళ్లల్లో నేనూ ఒకడిని అని గుర్తుపెట్టుకోండి కనుక తొందరగా వ్రాయండి.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting